Thursday, May 2, 2024

ఖర్చు ఎంతైనా పర్లేదు.. గెలవాల్సిందే!

- Advertisement -
- Advertisement -

municipal-polls

హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులోని కొత్త మున్సిపాలిటీల్లో ఓటు రేటు అదిరిపోతోంది. అలాగే జాతీయ రహదారుల వెంట ఉన్న మున్సిపాలిటీల్లోనూ పోటీలో ఉన్న అభ్యర్థులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు గడువు ఉంది. వివిధ పార్టీల తరపున బరిలో దిగిన వారితో పాటు మందీ మార్బలం దండిగా వున్న వారు పెద్ద సంఖ్యలో మున్సిపల్ బరిలోకి దిగడంతో ఓటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. నగర శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కోవార్డుకు సగటున రూ.2 వేల నుంచి రూ. 2500 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

ఇందులో ఒక వెయ్యి ఓట్లను టార్గెట్ చేసుకుం టే ఈజీగా గెలవచ్చని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. దాని కోసం రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. చట్ట ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డులో పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థి రూ. ఒక లక్ష వరకు, కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థి రూ. లక్షన్నర వరకు ప్రచార ఖర్చు చేసుకోవచ్చు. అయితే ఒక్క రోజు తన వెంట తిరిగే వారికి ఇచ్చేందుకే ఈ మొత్తం సరిపోతుందని ఫీర్జాదిగూడ కార్పొరేషన్ పోటీలో ఉన్న ఒక అభ్యర్థి పేర్కొన్నారంటే ఏ స్థాయింలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ నుంచి, రెబెల్స్, ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల దాకా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. వెయ్యి ఓట్ల కోసం కోటి రూపాయలు.. అంటే ఒక్కో ఓటుకు రేటు పది వేల రూపాయలన్న మాట.

గతంలో ఓటుకు రూ. వెయ్యి, పోటీ ఎక్కువగా ఉంటే రూ.2 వేలు ఇవ్వడం వినడమే కానీ ఇప్పుడు తాజాగా ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు సిద్ధపడుతున్నారు. నగర శివారులో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల పరిధిలో బాగా పెరిగిపోతున్న రియల్ ఎస్టేట్ దందాలో బాగా సంపాదించిన వారు.. వారి ఫ్యూచర్ అవసరాల కోసం ఈ ఎన్నికల బరిలోకి దిగారు. వారంతా తాము అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యధేచ్ఛగా వెదజల్లుతున్నారని సమాచారం. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన వారు బిల్డర్లు, రియల్టర్లు కావడంతో ఎంతైనా ఖర్చు పెట్టి గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. మున్సిపాలిటీల్లో బలంగా వుంటే భవిష్యత్తులో భూములకు, లే అవుట్లకు, నిర్మాణ అనుమతులకు ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉండదన్న ఉద్దేశంతోనే ఎంతైనా ఖర్చు చేసేందుకు వీరు సిద్దపడుతున్నారని చెప్పుకుంటున్నారు.

ముందుగా కౌన్సిలర్లుగాను, కార్పొరేటర్లుగాను గెలిస్తే.. ఆ తరువాత మేయర్ పదవి కోసం రూ.కోట్లు గుమ్మరించేందుకు మరికొందరు సిద్దపడుతున్నారని అంటున్నారు. దేశ రాజకీయాల్లో ఈ స్థాయి ఖర్చు మున్సిపల్ ఎన్నికల్లో జరగలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందరూ రియల్ వ్యాపారులు రంగంలోకి దిగడంతో, పుల్‌టైమ్ పొలిటిషయన్స్ పోటీకి దూరంగా ఉంటున్నారు. పార్టీలు కూడా డబ్బులు పెట్టే నేతలకే టికెట్లు ఇస్తున్నాయి. దాంతో ఓటు రేటు పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎక్కవగా ఇంటి సామాగ్రిని కొనివ్వడం, వెండి వస్తువులను పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారని తెలిసింది. ఖర్చుపై ప్రత్యేక వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎన్నికల అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Telangana municipal polls 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News