Sunday, September 15, 2024

సిఎం అయి ఉండి ఈ విధంగా మాట్లాడుతారా?:సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు గురువారం తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆయనను తీవ్రంగా మందలించింది. 2015 ఓటుకు నోటు కేసు విచారణ బదలాయింపు పిటిషన్ నేపథ్యంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, పికె మిశ్రా, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది. మాజీ సిఎం కెసిఆర్ పార్టీకి, కేంద్రంలోని అధికార బిజెపికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందం (డీల్) క్రమంలోనే కవితకు బెయిల్ వచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ విధంగా మాట్లాడటం పద్థతి కాదు, న్యాయస్థానం తీర్పును తప్పుపడుతారా? అని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యి, సుప్రీంకోర్టు బెయిల్‌తో ఇటీవలే బయటకు వచ్చారు.రేవంత్ వ్యాఖ్యలపై ధర్మాసనం ఘాటైన పదజాలంతో స్పందించింది.

ఆయన మాటలు న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో తప్పుడు భావనలకు దారితీస్తాయని పేర్కొంది. “ఆయన చెప్పింది, పత్రికలలో వచ్చింది. దీనిని చదివారా? లేకపోతే చదవండి, బాధ్యతాయుత ముఖ్యమంత్రి ఏ విధమైన ప్రకటన చేశారనేది తెలుస్తుంది. ఇటువంటి మాటలతో ప్రజలలో తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. సిఎం అయి ఉండి ఈ విధంగా మాట్లాడటం , ప్రకటన వెలువరించడం ఈ స్థానానికి సముచితమా? రాజ్యాంగ నిర్వాహకులు ఈ విధంగా మాట్లాడటం ఏమిటీ” అని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ శత్రుత్వాల మధ్యలోకి కోర్టులను లాగడం ఎందుకు? తాము రాజకీయ పార్టీలతో సంప్రదించి అ, రాజకీయ కోణాలలో ఉత్తర్వులు వెలువరిస్తామా? రాజకీయ నాయకులు కానీ ఇతరులు కానీ తమ తీర్పులు, ఉత్తర్వులను విమర్శిస్తే పట్టించుకునేది లేదు. తమ అంతరాత్మ ప్రబోధం, బాధ్యతల దశలో చేసిన ప్రమాణానికి అనుగుణంగా విధులు నిర్వరిస్తామని బిఆర్ గవాయ్ సారధ్యపు ధర్మాసనం తెలిపింది.

సిఎం రేవంత్ రెడ్డి తరఫున కేసుకు సంబంధించి సీనియర్ లాయర్ ముఖుల్ రొహత్గీ , సిద్ధార్థ్ లూథ్రాలు హాజరయిన దశలో ధర్మాసనం సిఎం వ్యాఖ్యలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనిపై వారు వివరణ ఇస్తూ ఇకపై ఇటువంటివి జరగవని న్యాయవాదులు తెలిపారు. వ్యవస్థల పట్ల తమకు సరైన గౌరవం ఉంది. వ్యవస్థల మధ్య పరస్పర గౌరవం ఉండటం విద్యుక్త, ప్రాధమిక ధర్మం , విధి అని తాము భావిస్తున్నామని సముచిత సరైన దూరం అత్యవసరం అని కూడా ధర్మాసనం పేర్కొంది. శాసనపరమైన వ్యవహారాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోదు. ఈ విధంగా లెజిస్లేచర్ జుడిషియరీ మధ్య సరైన పద్థతి ఉండాలని ఆశిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. దీనిని తాము లెజిస్లేచర్ నుంచి కూడా ఆశిస్తున్నామని స్పష్టం చేశారు. రాజకీయాలను పరిగణనలోకి తీసుకుని రూలింగ్‌లు వెలువరిస్తామా? ఏమనుకుంటున్నారు? అని ధర్మాసనం నిలదీసింది. క్యాష్ ఫర్ ఓటు స్కామ్ కేసులో సిఎం రేవంత్ రెడ్డి నిందితుడుగా ఉన్నారు.

కేసు విచారణను రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ హైకోర్టుక బదలాయించాలని పిటిషన్ దాఖలు అయింది. .స్వరాష్ట్రంలోనే ఈ కేసు విచారణ జరిగితే సాక్షలను ప్రభావితం చేయడం, ఆధారాలను దెబ్బతీయడం జరుగుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు నుంచి రేవంత్ రెడ్డి మందలింపులను చవిచూడాల్సి వచ్చింది. సిఎం మాటలు బహిరంగం అయ్యాయి. దీనిని తాము ఏ విధంగా భావించాల్సి ఉంటుందని కవితకు బెయిల్ ఇచ్చిన ఇదే ధర్మాసనం ప్రశ్నించింది. కవితకు బెయిల్ విషయంలో వ్యాఖ్యలపై ధర్మాసనం నుంచి మందలింపులకు గురైన సిఎం రేవంత్ రెడ్డికి , మరో వైపు ఓటుకు నోటుకేసు వేరే హైకోర్టుకు అప్పగించాలనే విషయంలో ఉపశమనం దక్కింది. కేసు బదిలీ పిటిషన్ పట్ల సానుకూలత చూపలేదు. తమకు రాష్ట్ర హైకోర్టు సహచర బెంచ్‌పై పూర్తి విశ్వాసం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. తాము కేసు విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నామని , ఇప్పటికిప్పుడు దీనిని ముగించడం లేదని, లెజిస్లేచర్ వ్యవహారాలలో తాము కలుగచేసుకునేది లేదని, వారి నుంచి కూడా దీనిని ఆశిస్తన్నామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News