Monday, July 15, 2024

ఈసారి ప్రేక్షకులకు అందించేది స్ట్రెయిట్ సినిమానే : సురేష్ కొండేటి

- Advertisement -
- Advertisement -

పాత్రికేయుడుగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85 కు పైగా చిత్రాలను పంపిణీ చేసి ‘ప్రేమిస్తే’ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, డాక్టర్ సలీం, నాన్న, రేణిగుంట ఇలా ఎన్నో అద్భుతమైన డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆ తర్వాత శంభో శంకర స్ట్రెయిట్ చిత్రం ద్వారా నిర్మాతగా భాగస్వామ్యం గా ఉన్న సురేష్ కొండేటి  ఆ తర్వాత కూడా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలను అందించారు. అయితే ఈసారి  మాత్రం తెలుగు స్ట్రెయిట్ చిత్రాన్ని అందించబోతున్నట్లు అక్టోబర్ 6వ తేదీ  (శుక్రవారం) తన పుట్టినరోజు సందర్భంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

సురేష్ కొండేటి కల‘కలం’.. అంబరాన్ని దాటిన సంతోషం
సంకల్పబలం ఉంటే మనిషి సంతోషంతో సంబరాలు జరుపుకోవచ్చు.. అంబరాన్ని కూడా అవలీలగా అందుకోవచ్చు. సురేష్ కొండేటి (సంతోషం సురేష్) విషయంలో ఇది అక్షర సత్యం అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. అతను నిత్య శ్రామికుడు, అవిశ్రాంత యోధుడు. అతని అమ్ముల పొదిలో ప్రశ్నల అస్త్రాలు ఎన్నో. కలం బలంతో కదం తొక్కడమే కాదు, కలలు సాకారం చేసుకోవడంలోనూ అనితరసాధ్యుడు. ఎవరీ సురేష్ కొండేటి ఏమా కథ అంటే అతని జీవిత సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.

కట్ చేస్తే పాలకొల్లు…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు  పేరు వినగానే మనకు గుండె ఝల్లుమంటుంది. ఎందుకంటే సినిమా రంగంలో అతిరథమహారథులంతా ఆ ఊరివారే. సురేష్ దీ ఆ ఊరే. అందుకేనేమో సినిమా రంగం అతన్ని ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది. జున్నూరు హైస్కూల్ లో చదువుతున్న సమయంలోనే అతనిలో సినిమా అనే భీజం పడింది. తరగతి గది కన్నా ఆ ఊరి గ్రంథాలయమే అతని అడ్డా. ‘సితార, జ్యోతిచిత్ర’ లాంటి సినిమా పత్రికలు చదివితే ఇంకేముంది సినిమా కలలే. సితారలో గుడిపూడి శ్రీహరి గారి చిత్ర సమీక్షలు సురేష్ కొండేటిను హైదరాబాద్ కు చేర్చాయి. హైస్కూల్ విద్య తర్వాత పాలకొల్లులోని ఛాంబర్‌ కాలేజీలో ఇంటర్ చదువుతూ హైదరాబాద్ కు చెక్కేశారు.

వెళ్లగానే ఎవరూ రెడ్ కార్పెట్ తో స్వాగతం పలకరు. అందుకే తెలివిగా కృష్ణాపత్రికలో అడ్వర్టైజింగ్ విభాగంలో చేరారు. మనసంతా సినిమానే.. అందుకే ఫిల్మ్ రిపోర్టర్ గా కొత్త జీవితం. సినీ ప్రముఖులను సురేష్ కొండేటి క్రమం తప్పకుండా ఇంటర్యూలు చేయడం, సినిమా వార్తలను శరవేగంగా సేకరించడం గమనించిన సంపాదకులు పిరాట్ల వెంకటేశ్వర్లు ఆ పత్రికలో ‘కృష్ణ చిత్ర’ అనే ఫిల్మ్ కాలమ్ ప్రారంభించారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం ‘తెలుగు వీర లేవరా’ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సురేష్ కొండేటి ఆధ్వర్యంలో కృష్ణాపత్రిక ఓ ప్రత్యేక సంచికను వెలువరించింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కృష్ణగారిపై తమ అభిప్రాయాలను తెలియచేశారు. సరిగ్గా పత్రిక విడుదలకు ముందు షూటింగ్ నిమిత్తం సింగపూర్ వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవితో సురేష్ కొండేటి ఫోన్ లో మాట్లాడి కృష్ణగారితో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని ఫ్యాక్స్ ద్వారా తెప్పించారు. ఆ ఫాక్స్ ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందంటారు సురేష్ కొండేటి. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు హైదరాబాద్ చిక్కడపల్లిలోని కృష్ణాపత్రిక కార్యాలయానికి వచ్చి ఆ ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం విశేషం.

‘వార్త’ మరో మజిలీ
కృష్ణపత్రికలో ఫిల్మ్ రిపోర్టర్ గా వచ్చిన గుర్తింపుతో 1996లో ‘వార్త’ దిన పత్రికలో ఫిల్మ్ రిపోర్టర్ గా చేరారు. అప్పటివరకూ ‘కృష్ణాపత్రిక సురేష్’ అనే పేరు కాస్తా వార్త సురేష్ అయిపోయింది. అదే సమయంలో చిత్రసీమలోని ప్రముఖులందరికీ తలలో నాలుకగా మారిపోయారు. అక్కడ సురేష్ కొండేటి కలం కదం తొక్కింది. ‘వార్త’లో సినిమాల పరంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది సినీ ప్రముఖులకు ‘వార్త’ దిన పత్రికతో అనుబంధాన్ని కల్పించారు. సినిమా పంపిణీదారుడిగా మారాలన్న ఆలోచన అక్కడే వచ్చింది.

తన భార్య మహేశ్వరి పేరు మీద ‘మహేశ్వరి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమా పంపిణీని మొదలు పెట్టారు. ఆ తర్వాత ఎస్.కె. పిక్చర్స్ పేరుతో జూ. ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నం 1’తో పంపిణీదారుడిగా గొప్ప గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్‌ కళ్యాణ్, రవితేజ తదితరుల చిత్రాలు ”ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీయస్, పల్నాటి బ్రహ్మనాయుడు, నేనున్నాను, సంతోషం, ఘర్షణ, బంగారం, ఇడియట్, నరసింహుడు, అల్లరి రాముడు..” ఇలా దాదాపు 85 సినిమాలను వెస్ట్ గోదావరిలో పంపిణీ చేశారు. అలానే తూర్పు గోదావరి, కృష్ణాజిల్లాతో పాటు ఆ తర్వాత నైజాంలోనూ కొన్ని సినిమాలను పంపిణీ చేశారు.

సంతోషం శకం ప్రారంభం
సొంతంగా పత్రిక పెడితే.. ఈ ఆలోచన సురేష్ కొండేటి ను నిద్రపోనివ్వలేదు. సినిమా రంగం తనకు ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు సంతోషం పేరుతోనే పత్రిక పెట్టాలనుకున్నారు. అంతే బాపు చేతిరాతతో రూపుదిద్దుకున్న సంతోషం టైటిల్ తో  2002 ఆగస్టు లో స్వీయ సంపాదకత్వంలో సినిమా వార పత్రికను ప్రారంభించారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా  విజయవంతంగా ప్రచురిస్తున్న ఆ పత్రిక పేరే సంతోషం. ఇంటి పేరుగానూ మారిపోయి సంతోషం సురేష్ అని పిలిచేలా చేసింది. క్వాలీటీలో బెస్ట్ అనే కాన్సెప్ట్ తో పాఠకులను నేటికీ అలరిస్తున్న పత్రిక అది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ పత్రిక ఆవిష్కృతమైంది. దాదాపు 18 లక్షల ఖర్చుతో శిల్పకళావేదికలో అత్యద్భుతంగా ఆ వేడుకను నిర్వహించారు.

ఆ తర్వాత సంవత్సరం నుంచి ‘సంతోషం’ పేరుతో సినిమా అవార్డులనూ ప్రదానం చేయడం మొదలు పెట్టారు.అలా సంతోషం ఫిల్మ్ వీక్లీ అండ్ సౌతిండియన్‌ ఫిల్మ్ అవార్డ్స్ కు ఓ ప్రత్యేకత వచ్చింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోని సినీ ప్రముఖులను, సినిమాలను ‘సంతోషం సౌతిండియన్ ఫిల్మ్ అవార్డ్స్’ వేదికపైకి అపూర్వ గౌరవాన్ని కలిగించారు సురేశ్ కొండేటి. సినీ అభిమానుల సమక్షంలో ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్స్’ను ఇవ్వడం ప్రారంభించిన సురేశ్ కొండేటి… దుబాయ్ లోని సినీ అభిమానులను అలరించడం కోసం ఓ యేడాది అక్కడా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరిపారు. తెలుగు సినిమా రంగానికి చెందిన హేమాహేమీలు ఆ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం విశేషం. కరోనా కారణంగా ఓటీటీ సినిమాలు ఊపందుకున్న నేపథ్యంలో సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ కూ సంతోషం అవార్డులు దక్కుతున్నాయి.

చిత్ర నిర్మాణ రంగంలోనూ…
విజయవంతమైన పంపిణీదారుడిగా గుర్తింపు పొందిన తర్వాత సురేశ్ కొండేటి ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించిన ‘కాదల్‌’ చిత్రాన్ని ‘ప్రేమిస్తే’ పేరుతో డబ్‌ చేశారు. అలా సినీ నిర్మాతగా ఆయన ప్రస్థానం సక్సెస్ ఫుల్ మూవీ ‘ప్రేమిస్తే’తో మొదలైంది. ఇక అక్కడ నుండి వెనుకడుగు వేయాల్సిన అవసరం కలగలేదు. నిర్మాతగా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం తనదైన అభిరుచిని చాటుకున్నారు. ‘జర్నీ, షాపింగ్ మాల్, నాన్న, పిజ్జా’ వంటి భిన్నమైన చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మెగా పీఆర్ఓగా… నటుడిగా…
ఫిల్మ్ పీఆర్ఓగా సురేశ్ కొండేటిది ఓ విశేష ప్రస్థానం. సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి  సినిమాల మొదలు కొని అగ్ర కథానాయకులు, నిర్మాతల చిత్రాలకు ఆయన పీఆర్ఓగా పనిచేసి, తెలుగు సినిమా రంగంలో మెగా పీఆర్ఓగా గుర్తింపు పొందారు. కొత్త దర్శక నిర్మాతలు తమ చిత్రానికి సురేష్ కొండేటిని పీఆర్వోగా పెట్టుకుంటే ఇక నిశ్చింతగా ప్రమోషన్ పరంగా తిరుగులేదు  అనేలా  ఉండొచ్చనే అభిప్రాయాన్ని కలిగించారు. పాత్రికేయ మిత్రులతో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధానికి, తన అనుభవాన్ని జత చేసి సినిమాలను ప్రమోట్ చేయడానికివిశేషంగా కృషి చేయడమే దానికి కారణం. అలానే చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలోనే నల్ల శ్రీను మాస్టర్ దగ్గర డాన్స్ లో శిక్షణ తీసుకుని నటుడిగానూ తన సత్తా చాటారు.  వార్త పత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తూనే అనేక సినిమాల్లో నటించిన సురేష్ కొండేటి ‘దేవినేని’ చిత్రంలో వంగవీటి మోహనరంగా ఆయన పోషించిన పాత్రల్లో ఒకటి. వన్ ఆఫ్ ది లీడ్ గా చేసిన ఈ పాత్ర సురేష్ కుండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈమధ్య దాదాపు పదికి పైగా చిత్రంలో నటిస్తూ నటుడుగా కూడా తన కెరియర్  ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.

సంతోషం ఫిల్మ్ డిజిటల్ న్యూస్…
కరోనా సమయంలో ప్రతికారంగం అతలాకుతలమైంది. పలు దిన, వార, మాస పత్రికల ప్రచురణ సైతం ఆగిపోయింది. అయినా సురేష్ కొండేటి ‘సంతోషం’ ఫిల్మ్ వీక్లీ ప్రచురణను ఆపివేయలేదు. కానీ ముద్రణా సౌకర్యంలేని కారణంగా పత్రికను ప్రచురించి, ప్రజల వద్దకు రెండు వారాలపాటు  పంపలేని నిస్సహాయ పరిస్థితి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే యూట్యూబ్ లో ‘సంతోషం ఫిలిం న్యూస్’. సినిమా రంగంలోని కరోనా పరిమితులకు లోబడి జరిగిన కార్యక్రమాలను సినీ అభిమానులకు, తోటి సినిమా రంగంలోని వారికి పంపి, తద్వారా వారిలో ఓ చైతన్యం తీసుకురావడానికి సురేష్ కొండేటి ప్రారంభించిన మహాయజ్ఞం ఇది. విశేషం ఏమంటే… కరోనా సమయంలో దానికి లభించిన ఆదరణ కారణంగా… తదనంతరం కూడా అప్రతిహతంగా ఒక్కరోజు విరామం ప్రకటించకుండా… సురేశ్ కొండేటి ఈ సంతోషం డిజిటల్ న్యూస్ ను అందిస్తున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తున్నారు… విశేషంగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటికి 1288కు పైగా న్యూస్ బులిటెన్స్ ను సురేశ్ కొండేటి స్వయంగా ప్రెజెంట్ చేయడం ఓ విశేషం… ఓ రికార్డ్!!

సినీరంగానికి సేవలు…
‘సంతోషం’ వీక్లీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ గానూ, ఫిల్మ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గానూ ఉంటూనే చిత్రసీమలోని వివిధ విభాగాలలోనూ సురేశ్ కొండేటి తన సేవలను అందిస్తూ వస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్ సెక్టార్ కు సెక్రటరీగా పనిచేసిన సురేశ్ కొండేటి, మూడు పర్యాయాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికలలో నిలబడి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు. ఎఫ్.ఎన్.సి.సి. మేనేజింగ్ కమిటీ సభ్యుడిగానూ వ్యవహరించిన  సురేష్ కొండేటి  ప్రస్తుతం ఎఫ్ ఎన్ సి సి కి  కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిల్మ్ అవార్డుల నిర్వహణ కోసమై వేసిన కమిటీలోనూ సురేశ్ కొండేటి సభ్యునిగా ఉన్నారు. వార్త దినపత్రికలో ఉండగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యునిగా చేరిన సురేశ్ కొండేటి… యాభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ అసోసియేషన్ కు రెండుసార్లు అధ్యక్షుడుగా ఉన్నారు.  ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలను ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు.

మారిన పరిస్థితులను అర్థం చేసుకుని, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తనను తాను దానికి అనువుగా మలుచుకోవడం సురేష్ కి అలవాటు. అందుకే ఆయన కాలంతో పాటు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంటారు. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సురేశ్ కొండేటి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. తన మూలాలను మర్చిపోరు అందుకే… ఇప్పటికీ మూవీ ప్రెస్ మీట్స్ లో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరిపైనా తన ప్రశ్నాస్త్రాలను సంధిస్తూనే ఉంటారు. వారి నుండి నికార్సనైన జవాబును రాబడుతూనే ఆ సినిమాకి ప్రమోషన్ పరంగా హెల్ప్ అయ్యే విధంగానే ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

కేవలం సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న కారణంగానే కొన్ని సినిమాలు విపరీతమైన క్రేజ్ ను  సంపాదించుకొని  సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిన ఈ సమయంలో సురేశ్ కొండేటి వేసే ప్రశ్నలు, తద్వారా రాబట్టే సమాధానాలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. ఇవాళ సురేశ్ కొండేటి ట్రెండింగ్ స్టార్ అయ్యారు. యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలూ  ఓ కొత్త ట్రెండ్. వ్యక్తిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యవస్థగా మారిన సురేష్ కొండేటి జీవిత ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News