Tuesday, April 30, 2024

అయోధ్యరాముడి నుదుటిపై అద్భుత ‘సూర్యతిలకం’

- Advertisement -
- Advertisement -

అయోధ్య: శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య లో రామాలయంలో బాలరాముడి నుదుటిపై ‘సూర్యతిలకం’ అద్భుతంగా ఆవిష్కృతమైంది. అధునాతన సాంకేతిక సాయంతో సూర్యకిరణాలు గర్భగుడి లోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం రీతిలో 58 మిల్లీమీటర్ల పరిమాణంలో రెండు, రెండున్నర నిమిషాల పాటు ప్రసరించాయి. బుధవారం మధ్యాహ్నం 12.01 గంటల సమయంలో సాక్షాత్కరించిన ఈ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు.

శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఇదే తొలి నవమి కావడంతో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో సూర్యతిలకం ప్రత్యేక ఆకర్షణగా భక్తులను ఆకట్టుకుంది. మూడో అంతస్తు నుంచి గర్భగుడి లోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్య లోని భక్తులంతా ఈ సంఘటన సందర్శించేలా వంద ప్రదేశాల్లో భారీ ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి గర్భగుడి లోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయలో ఏర్పాట్లు చేశారు.

పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపించింది. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ) శాస్త్రవేత్తలు , పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజున శ్రీరాముడి విగ్రహంపై ఈ తిలకం దిద్దేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఏటా సూర్యకిరణాలు అక్కడే ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తుంటాయి కదా ? గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

ఈ సమస్యను అధిగమించేందుకు గడియారంలో ముల్లులు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్‌టీత్ మెకానిజం వినియోగించారు. సూర్యకాంతిని గ్రహించే పరికరం వద్దే మరోపరికరం ఉంచారు. ఇది కాంతిని గ్రహించే అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. మళ్లీ నవమి రోజు వారు అనుకున్న చోటుకు తీసుకొస్తుంది. అంతకు ముందే ఏటా శ్రీరామ నవమి వచ్చే కాలాన్ని సెకన్లతోసహా లెక్కలు వేశారు. ఈ లెక్కల సాయంతో సూర్యకిరణాలు ప్రసరింప జేసే పరికరాలు, వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ 19 ఏళ్లు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పసుపు పచ్చని వస్త్రాలంకరణలో రామ్‌లల్లా
పసుపు పచ్చని వస్త్రాలతో రామ్‌లల్లా ప్రతిమను అలంకరించారు. పంచామృతంతో స్నానం చేయించారు. స్వామి వారికి 56 రకాల సేవలు చేయడమైందని రామాలయ ప్రధాన పూజారి తెలిపారు.
500 ఏళ్ల తర్వాత ఈ వేడుక
అయోధ్యలో 500 ఏళ్ల తరువాత శ్రీరామ నవమి జరగడం దేశం మొత్తం మీద కొత్త వాతావరణం ఏర్పడిందని ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రపంచం మొత్తం మీద రామభక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూడగలిగారని పేర్కొన్నారు. అనేక సంవత్సరాల పాటు అనేక బాధలుకోర్చి త్యాగాలు చేసినందుకు ఈ ఫలితం లభించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News