Monday, April 29, 2024

తమిళనాడు 146 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ముంబై: తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆతిథ్య ముంబై పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడును ముంబై బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 64.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సమష్టిగా రాణించి తమిళనాడు బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (0), జగదీశన్ (4) విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రదోష్ పాల్ (8), కెప్టెన్ సాయి కిశోర్ (1), ఇంద్రజీత్ (11) పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఒక దశలో తమిళనాడు 42 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్ మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. విజయ్ శంకర్ 8 ఫోర్లతో 44 పరుగులు చేయగా, సుందర్ 5 బౌండరీలతో 43 పరుగులు చేశాడు. మిగతావారిలో మహ్మద్ (17), అజిత్ రామ్ (15) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే మూడు, ముషీర్ ఖాన్, శార్దూల్, తనుష్ కోటియాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ముంబై శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

మధ్యప్రదేశ్ పైచేయి..
మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఆతిథ్య విదర్భ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన మధ్యప్రదేశ్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఓపెనర్ హిమాన్షు మంత్రి (26), హర్ష్ గావ్లి (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముదు తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో మధ్యప్రదేశ్ బౌలర్లు సఫలమయ్యారు. అవేశ్ ఖాన్ 49 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను పడగొట్టాడు. కుల్వంత్, వెంకటేష్ అయ్యర్‌లు రెండేసి వికెట్లను తీశారు. విదర్భ బ్యాటర్లలో కరుణ్ నాయర్ ఒక్కడే రాణించాడు. ఎంపి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నాయర్ 9 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. ఓపెనర్ అతర్వ టైడ్ (39) పరుగులు సాధించాడు. మిగతావారు విఫలం కావడంతో విదర్భ ఇన్నింగ్స్ 170 పరుగుల వద్దే ముగిసింది.కాగా, విదర్భ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే మధ్యప్రదేశ్ మరో 123 పరుగులు చేయాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News