Monday, April 29, 2024

భారత్ దే సిరీస్

- Advertisement -
- Advertisement -

Teamindia

 

శార్దూల్ ఆల్‌రౌండ్ షో.. చెలరేగిన నవ్‌దీప్, ధావన్, రాహుల్ మెరుపులు
ధనంజయ పోరాటం వృథా, మూడో టి20లో లంక చిత్తు

పుణే: శ్రీలంకతో జరిగిన మూడో, చివరి ట్వంటీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్ కోహ్లి సేన 20తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 15.5 ఓవర్లలో కేవలం 123 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగి పోయారు. తొలుత ఓపెనర్ దనుష్క గుణతిలక (1)ను బుమ్రా వెనక్కి పంపా డు. ఆ వెంటనే మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (9)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ పెరీరా (7)ను నవ్‌దీప్ సైని ఔట్ చేశాడు. దీంతో లంక 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చెలరేగి ఆడిన మాథ్యూస్ మూడు సిక్సర్లు, ఫోర్‌తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ 36 బంతుల్లోనే 8 ఫోర్లు, సిక్స్‌తో వేగంగా 57 పరుగులు చేశాడు. అయితే మిగతావారు విఫలం కావడంతో లంక ఇన్నింగ్స్ 123 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో సైని మూడు, శార్దూల్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

శుభారంభం
అంతకుముందు తొలుతు బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. చాలా రోజుల తర్వాత ధావన్ తన మార్క్ బ్యాటింగ్‌తో అలరించాడు. కొంతకాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న ధావన్ ఈసారి ధాటిగా ఆడాడు. లంక బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. రాహుల్ కూడా దూకుడును ప్రదర్శించాడు. ఇద్దరు అద్భుత బ్యాటింగ్‌ను కనబరచడంతో భారత్ పటిష్టస్థితికి చేరుకుంది. రెండో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపని ధావన్ ఈసారి మాత్రం దూకుడును ప్రదర్శించాడు. చూడచక్కని షాట్లతో కనువిందు చేశాడు. మునుపటి ధావన్‌ను తలపిస్తూ ముందుకు సాగారు.

కీలక ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 36 బంతుల్లోనే ఏడు ఫోర్లు, సిక్స్‌తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. మరోవైపు చాలా రోజుల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టిన శాంసన్ రెండో బంతికే ఔటయ్యాడు. ఆ వెంటనే రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 54 పరుగులు చేసి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 25 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

చివర్లో మెరుపులు
అయితే ఆఖరి ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన మనీష్ పాండే 18 బంతుల్లోనే 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, చివరి వరుసలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా దూకుడును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన కోహ్లి రెండు ఫోర్లు, సిక్సర్‌తో 17 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. మరోవైపు శార్దూల్ ఠాకూర్ కూడా చెలరేగి ఆడాడు. ధాటిగా ఆడిన శార్దూల్ 8 బంతుల్లోనే రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులకు చేరింది. చివరి రెండు ఓవర్లలోనే భారత్ 40 పరుగులు దండుకోవడం విశేషం.

Teamindia huge success in 3rd T20
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News