Wednesday, September 18, 2024

తెలంగాణ పోలీసుశాఖలో మరో మైలు రాయి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సైబర్ నేరస్థుల చేతుల్లో అమాయకులు కోట్లాది రూపాయలు కోల్పోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలపై విస్కృతంగా అవగాహన కల్పించడమే కాకుండా, సైబర్‌నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా సైబర్ నేరాలను అడ్డుకునేందుకు ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలను అడ్డుకోవడమే కాకుండా మిగతా రాష్ట్రాల పోలీసులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మొదటి సారిగా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు.

బాధితులు వచ్చి ఇక్కడ ఫిర్యాదు కూడా చేయవచ్చు, లేదా వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా పెద్ద ఎత్తున సైబర్ నేరాలు జరిగితే వెంటనే ఆ కేసును ఇక్కడి పోలీసులు తీసుకుని విచారణ చేయనున్నారు. రాష్ట్ర ప్రజలు సైబర్ నేరస్థుల భారినపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రను నియమించారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుండడంతో టెక్నాలజీ వాడకం పెరిగింది, దానికి అనుగుణంగానే సైబర్ నేరాల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంది, దీనిని అడ్డుకునేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని టవర్ బిలో ఏర్పాటు చేశారు.

ముందే హెచ్చరించనున్న పోలీసులు
రానున్న రోజుల్లో ఇక్కడి సైబర్ క్రైం విభాగం పోలీసులు సైబర్ దాడులకు గురయ్యే కంపెనీలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎప్పటికప్పుడు సైబర్ నేరస్థుల కార్యకలాపాలను గమనించడమేకాకుండా వారి మోడ్ ఆఫ్ అపరండిని పరిశీలిస్తున్నారు. దానిని బట్టి ముందుగానే సైబర్ నేరస్థుల బారినపడే కంపెనీలకు అలర్ట్‌లను జారీ చేయనున్నారు. చాలా కంపెనీలు ఇంటర్నేషనల్ హ్యాకర్లకు చిక్కి వారు డిమాండ్ చేసిన డబ్బులు చెల్లించి తమ కంపెనీకి సంబంధించిన డాటాను వెనక్కి తీసుకుంటున్నారు. కానీ చాలా కంపెనీలు ఈ విషయం చెప్పడంలేదు, ఇలాంటి దాడులకు గురికాకుండా ఇక్కడి అధికారులు ముందుగానే అలర్ట్ చేయనున్నారు.

ఇలా అన్ని రంగాల్లో సైబర్ సెక్యూరిటీ ముందుకు వెళ్లి దేశానికి రోల్‌మోడల్‌గా నిలవనుంది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టనున్నారు. సైబర్ సేఫ్టీ గురించి కంపెనీలు, ఇనిస్టిట్యూట్ లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వనుంది.ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, బ్యాంకులు తదితర సంస్థలకు సైబర్ నేరాలపై ముందుగానే అవగాహన కల్పించి, వారిని సైబర్ నేరాల నుంచి కాపాడటమే లక్ష్యంగా పనిచేయనుంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ట్రాలతో సమన్వయం పరుచుకునేందుకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రీజనల్ కేంద్రంగా కూడా పనిచేయనుంది. రాష్ట్ర అభివృద్ధిలోనూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్రియాశీల పాత్ర పోషించనుంది.

నివారణే మార్గం….
సైబర్ నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేయడం కంటే ముందుగానే దానిని అడ్డుకోవాలనే లక్షంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1930 కాల్స్‌ను స్వీకరించడమే కాకుండా, సైబర్ నేరాలు జరగకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 700 సైబర్ క్రైం ఫిర్యాదులు వస్తున్నాయి. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరగనుంది, దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. విచ్చలవిడిగా పుట్టకు వస్తున్న నకిలీ యాప్‌లు, వెబ్ సైట్లు, ఫిషింగ్ మెయిల్స్, మాల్వేర్‌ను ముందే గుర్తించడంలో టీఎస్‌సీఎస్సీబీ చాలా కీలకంగా పనిచేస్తుంది. సమాజానికి హాని కలిగించే, యాప్‌లు, మోసాలకు గురిచేసే యూఆర్‌ఎల్ ను గుర్తించి వాటిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి వాటిని సుమోటోగా అధికారులు స్వీకరిస్తారు. ఆయా యాప్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గూగుల్ సంస్థలకు సమాచారం చేరవేస్తారు.

దీంతో ఎంతోమందిని వాటి బారిన పడకుండా ముందే కాపాడగలుగుతారు. అన్ని సైబర్ నేరాలకు కారణమయ్యే యూఆర్ ఎల్ లను ముందుగానే గుర్తించి బ్లాక్ చేయడంలో బ్యూరో సిబ్బంది కీలకంగా పనిచేస్తారు. ఫేక్ కాల్స్ పై ట్రాయ్ కి లేఖలు రాయడం, సైబర్ ను అడ్డాగా చేసుకుని ఇతర శాఖల పేర్లతో జరిగే మోసాలను అరికట్టడంలోనూ టీఎస్‌సీఎస్సీబీ అన్ని విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటుంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింక్ సంస్థలతో అనేక రకాల సంస్థల డేటాను ఎలా సర్వర్లలో భద్రపరుచుకోవాలి, సైబర్ నేరాలకు గురికాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తుంది.

ముందు కాపాడడమే మా ధ్యేయం : స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ సిపి, టిఎస్‌సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో రాష్ట్రం ఓ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశారని టిఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో పలు కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి, అందులో పనిచేస్తున్న వారు సైబర్ నేరస్థుల బారినపడకుండా ఉండేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు.నేరం జరిన తర్వాత దర్యాప్తు చేయడం కాకుండా నేరం జరగకముందే కంపెనీలు అలర్ట్ చేసే వ్యవస్థను ముందు ముందు తీసుకుని రానున్నాం అని తెలిపారు.

అన్ని వర్గాల వారిని సైబర్ నేరాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ నేరాలపై ముందుగానే అవగాహన కల్పిస్తే ప్రతి ఒక్కరికి లాభం చేసిన వారమవుతామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ సర్వర్లను ఏర్పాటు చేశాయి, అవి సైతం సైబర్ దాడులకు గురికాకుండా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇరవై నాలుగు గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News