Sunday, May 19, 2024

ఐటి విశ్వరూపం

- Advertisement -
- Advertisement -

 IT sector

 

రాష్ట్రంలోని అన్ని ద్వితీయశ్రేణి పట్టణాలకూ విస్తరణ

కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండలో ఈ ఏడాదే ఐటి పార్కులు

గత ఐదేళ్లలో రాష్ట్రానికి
12వేల పరిశ్రమలు వచ్చాయి

సిఎం కెసిఆర్ విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే కారణం
ఐటి పురోగతితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది
వరంగల్ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి
వరంగల్ ఐటి సెజ్‌లో టెక్ మహీంద్ర, సైయింట్ ఐటి ఇన్‌క్యూబేషన్ సెంటర్లను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

హైదరబాద్/వరంగల్ : రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటిని విస్తరించనున్నట్లు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఐటి పురోగతితో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన ఐదేళ్ళలోనే రాష్ట్రంలో 12 వేల పరిశ్రమలు వచ్చాయన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్ తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలే ప్రధాన కారణమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటి రంగంలో తెలంగాణ సాధిస్తున్న ప్రగతి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ సూర్పితో రానున్న రోజుల్లో ఐటి రంగంలో మరింతగా తెలంగాణ దూసుకపోయే విధంగా పనిచేస్తామన్నారు.

మంగళవారం వరంగల్ అర్భన్ జిల్లా మడికొండ ఐటి సెజ్‌లో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్ర, సైయింట్ ఐటి ఇంక్యూబేషన్ సెంటర్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఐటి రంగంలో ప్రపంచస్థాయిలో దూసుకపోతుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక రంగాలకు పెద్దపీట వేసి మౌళిక వసతులను కల్పించడమేనని అన్నారు. గతంలో పరిశ్రమలు అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే గుర్తుకు వచ్చేదన్నారు.

కానీ ప్రస్తుత టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటి విస్తరిస్తోందన్నారు. తద్వారా తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ తరహాలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జౌళి పార్కును వరంగల్‌లోనే ఏర్పాటు చేశామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ పార్కులో అతి త్వరలో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో అక్షరాస్యతను పెంచేలా కృషి చేస్తున్నాం. యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో కంపెణీలను నెలకొల్పాలని తాను అడిగిన మరుక్షణం ఒకే చెప్పిన టెక్ మహీంద్రా సిఇఒ గురునాని, సియేట్ ఎండి మోహన్ రెడ్డిలకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండలో ఈ సంవత్సరం ఐటి పార్కులు ప్రారంభిస్తామన్నారు. వరంగల్ యువత ప్రతిభ చూసి ఐటిని మరింత విస్తరించాలని నిర్ణయించామన్నారు. వరంగల్‌లో ఊహించిన దానికంటే వేగంగా ఐటి విస్తరిస్తోందన్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. గ్రామీణ నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ – వరంగల్ మధ్య స్కైవేల నిర్మాణంతో పాటు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి వర్ధిల్లుతుందన్నారు. వరంగల్‌లో మూతపడిన ఆజంజాహి మిల్లు స్థానంలోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్,వరంగల్ కు రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోందన్నారు. ఘట్‌కేసర్ దగ్గర జరుగుతున్న స్కైవే నిర్మాణం తో కేవలం గంటన్నరలో వరంగల్‌కు చేరుకునేలా పనులు జరుగుతున్నాయని మంత్రి కెటిఆర్ వివరించారు. అలాగే యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘనపూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తామన్నారు. మహబూబాబాద్ లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెక్ మహీంద్రా సిఇఒ గురునాని ఇచ్చిన సలహా మేరకు మామూనూర్ ఎయిర్ పోర్టు పునరుద్దరణతో పాటు హెలిపాడ్ సెంటర్‌ను సిఎం కెసిఆర్‌తో మాట్లాడి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

అలాగే ఖమ్మం,కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌లో త్వరలో ఐటిహబ్ ను ప్రారంభిస్తామన్నారు. నీళ్ళు, నిధులు , నియామకాలు నినాదంతో తెలంగాణ ఆవిర్భవించందన్నారు. కాళేశ్వరం … సిఎం కెసిఆర్ డ్రీమ్ ప్రాజెక్టుగా ఆయన అభివర్ణించారు. ఆ ప్రాజెక్టును కాలంతో పోటీ పడి మరీ నిర్మిస్తున్నామన్నారు. సిఎం ఆలోచన విధానంతో అన్నిరంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమం రంగానికి పెట్టాలనేది సిఎం కెసిఆర్ ఆలోచన అని మంత్రి కెటిఆర్ అన్నారు.

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇంకా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 12 నుంచి13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవల్పమెంట్ కోసం శిక్షణ ఇస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయన్నారు. తెలంగాణ లోని గ్రామీణ యువత మంచి స్కిల్స్ తో విద్యను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. కొత్తగా వస్తున్న పరిశ్రమల్లో సింహ భాగం ఉద్యోగాలు తెలంగాణ యువతకు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్‌ఎలు అరురి రమేష్, తాటికొండ రాజయ్య, నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎంపిలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్, జెడ్‌పి చైర్మన్‌లు సుధీర్, గండ్ర జ్యోతి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Telangana is making progress in IT sector
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News