Friday, April 26, 2024

నలుదిక్కులా మొబిలిటీ క్లస్టర్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. ఈ క్లస్టర్‌ను సుమారు 1200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్రానికి రూ.50వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. తద్వారా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. దీని కోసం హైదరాబాద్, దాని చుట్టు పక్కల రాష్ట్ర ప్రభుత్వం 4 మెగా క్లస్టర్‌లను అభివృద్ధి చేస్తోందని వివరించారు. ఇందులో- జహీరాబాద్‌లో ఇవి మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, సీతారాంపూర్‌లో ఇవి మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ఇఎస్‌ఎస్) క్లస్టర్,యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని కెటిఆర్ వెల్లడించారు.

సోమవారం మాదాపూర్ హెచ్‌ఐసిసిలో మొబిలిటీ నెక్స్‌ట్ హైదరాబాద్ సమ్మిట్ ….2023 కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికిల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ క్లస్టర్ నమూన బిల్డింగ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ, యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల వనరుల ఉండడం వల్లే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఇ..మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్‌లో… ఎలెక్ట్రిక్ వెహికిల్స్ బెస్ట్ క్లాస్ ఇన్‌ప్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, రీసర్చ్ అండ్ డెవెలప్‌మెంట్ కార్యకలాపాలు జరగనున్నాయన్నారు. ప్రతి క్లస్టర్ అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుందన్నారు. వీటిల్లో రూ. 3వేల కోట్లకుపైగా పెట్టుబడులను ప్రకటించేందుకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటి వివరాలను రాబోయే 2 వారాల్లో అందజేస్తామన్నారు.

ఈ పెట్టుబడులు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ త్రి-వీలర్, ఎలక్ట్రిక్ టూ-వీలర్, ఛార్జింగ్ పరికరాల తయారీ ఏకో సిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుస్థిరతపై దృష్టి పెట్టిందన్నారు. దేశంలో క్లీన్ ఎనర్జీకి తెలంగాణ ఇప్పటికే కేంద్రంగా మారిందన్నారు. దేశంలో ఒక యూనిట్ భూభాగానికి సౌరశక్తిని ఉత్పత్తి చేసే 2వ స్థానంలో రాష్ట్రం కొనసాగుతోందన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో 20 శాతం సౌరశక్తి ద్వారానే లభిస్తోందన్నారు. ఫలితంగా రాష్ట్రం 4.6 గిగావాట్ల స్థాపన సామర్థ్యం కలిగి ఉందని వెల్లడించారు. తెలంగాణ ఇప్పుడు మొబిలిటీ పరంగా దేశంలోనే అత్యధిక విద్యుదీకరణ రాష్ట్రంగా మారాలని ఆకాంక్షిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇతర పెట్టుబడులతో ఆటోమోటివ్ పరిశ్రమకు ప్రాధాన్యతను ఇస్తూ, ఇ-మొబిలిటీ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించడం బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇ..-మొబిలిటితో పాటు పర్యావరణ అనుకూల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆటోమోటివ్ పరిశ్రమ ఇలాంటి ప్రోత్సాహకాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వంలోని పాలసీ రూపకర్తలు మరియు పరిశ్రమలోని ఇతర భాగస్వాములు కలిసి నడవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో ఇవి కంపెనీల కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీల తయారీతో పాటు బ్యాటరీ పరికరాలు కూడా తయారవుతాయని కెటిఆర్ చెప్పారు. ఈ మొబిలిటి వీక్‌లో 100కి పైగా స్టార్టప్స్ స్టార్ ఆఫ్ ఛాలెంజ్‌లో తమ ఆలోచనలు పంచుకోనున్నాయన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలందిస్తామని ఆయన ధీమా వక్తం చేశారు.

ఇండియాలోనే బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్ లో ఈ మొబిలిటీ వీక్ ఈవెంట్ జరగడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈ మొబిలిటీ వీక్ ఘనంగా ప్రారంభమైందని చెప్పారు. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ఫార్ములా రేస్ ఈ నెల 11న జరగనుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇవి రంగాన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం మంత్రి కెటిఆర్ సమక్షంలో మూడు అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎటిఎస్‌టియువి
రైన్‌ల్యాండ్, బిట్స్ హైదరాబాద్‌తో బోష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, షెల్ కంపెనీతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News