Sunday, April 28, 2024

ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!

- Advertisement -
- Advertisement -

TRS

హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్‌ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్‌ఎస్ నాయకులు ప్రచారకార్యక్రమాల్లో పాల్గొనవద్దని, అధికార లాంచనాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. అయితే స్థానిక నాయకులు అక్కడే ఉండి ఎన్నికలసరళిని పరిశీలించాలని ఇప్పటికే టిఆర్‌ఎస్ దిశానిర్దేశం చేసింది. అభివృద్ధి,సంక్షేమం నినాదాలుగా ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోయిన టిఆర్‌ఎస్ ప్రచారం ముగిసే సమయానికి ప్రతి ఓటరును స్థానిక శాసన సభ్యులు మంత్రులు కలిసి విజ్ఞప్తి చేయగలిగారు.

రాష్ట్ర మంత్రులు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లో మంత్రులు తమనియోజకవర్గాల్లోని మున్సిపాలిటీ పరిధిలో రోడ్‌షాలు, ఇంటింటికి ప్రచారం, ఆత్మీయసమ్మేళనాల్లో పాల్గొని ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సక్సెస్ అయినట్లు అధిష్ఠానం భావిస్తుంది. ప్రచారం ముగిసే సమయానికి వార్డులవారిగా అందిన నివేదికల ఆధారంగా టిఆర్‌ఎస్ అత్యధికస్థానాల్లో విజయం సాధించి మున్సిపాలిటీలపై గులాబి జెండా ఎగరవేస్తామనే విశ్వాసం నాయకుల్లో కలిగింది. ప్రధానంగా మహిళా ఓటర్లు అత్యధికశాతం టిఆర్‌ఎస్ వైపు ఉన్నట్లు అంచనావేసింది. పురుషఓటర్లు టిఆర్‌ఎస్‌ను ఆశ్వీర్వదించడంతో పాటు ఈసారి మహిళలు అత్యధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని టిఆర్‌ఎస్ భావిస్తుంది.

పోలింగ్ దాకా నియోజకవర్గాల్లోనే ఎంఎల్‌ఏలు

స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు పోలింగ్ అయ్యేంతవరకు నియోజకవర్గాల్లోనే ఉంటూ పార్టీ నాయకులను సమన్వయంచేస్తూ ముందుకు వెళ్లాలని టిఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.స్థానిక నాయకులు సంబంధిత ముమున్సిపాలిటీలను వీడిపోవద్దని టిఆర్‌ఎస్ ఆదేశించింది. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారంలో పాల్గొనవద్దని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధిష్టానం స్థానిక నాయకత్వానికి సూచించింది. పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉండటంతో స్థానిక మహిళా నాయకులు ఇప్పటికే ప్రచారంలో ముందువరుసలో నిలిచినట్లు టిఆర్‌ఎస్ భావిస్తుంది.

ప్రచారాన్ని ముగించిన మంత్రులు

ప్రచారం చివరిరోజైన సోమవారం రాష్ట్ర మంత్రులు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కొత్తకోట హిరంగసభలో పాల్గొనడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలుమున్సిపాలిటీల్లో మంత్రి నిరంజన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి సంక్షేమకార్యక్రమలను వివరించారు. ప్రతిఎకరానికి నీరు అందివ్వడంతో పాటు అర్హులైన వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయన హామీలు ఇచ్చారు. మధిర లో టిఆర్‌ఎస్ కార్యకర్తలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమకార్యక్రమాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు.తొర్రూర్ మున్సిపాలిటీలో పోటీలో ఉన్న 16 వార్డుల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థుల పక్షాన మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. సూర్యపేటలో నిర్వహించిన భారీ ప్రదర్శనలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్, బిజెపి పై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిజమాబాద్ జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్,బిజెపి రెచ్చగొట్టేవిధంగా వ్యవహరించినా టిఆర్‌ఎస్ నాయకులు రెచ్చిపోవద్దని ప్రజల మద్దతు టిఆర్‌ఎస్‌కుఉందని చెప్పారు. బిజెపి నాయకులు రాష్టాభివృద్ధికోసం ఏమాత్రం కృషి చేయకపోవడంతో పాటు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిందించారు. అలాగే కరీంనగర్ లో మంత్రి ఈటల, ఆదిలాబాద్‌లో ఇంద్రకరణ్‌రెడి, రంగారెడ్డి జిల్లాలో మంత్రి తలసాని, మైనారిటీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి మహబూబ్ అలీ,బూదాన్‌పోచంపల్లిలో ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్, చెన్నూరులో ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్ బాల్కసుమన్‌తో పాటు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మంత్రులు ప్రచారం చివరిరోజు తెల్లవారు జామునుంచి ప్రచారంలో పాల్గొన్నారు.

సమన్వయానికి ప్రాధాన్యత

మున్సిపాలిటీ ఎన్నికలను సమన్వయం చేసేందుకు టిఆర్‌ఎస్ నియమించిన సభ్యులు ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నాయకుల మధ్య సమన్వయం చేస్తున్నారు. ప్రచారం ముగిసే సమాయానికి ప్రజల నాడిని గమనిస్తే టిఆర్‌ఎస్ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సాధిస్తోందనే అంచనాలో సమన్వయ కమిటీ ఇప్పటికే నివేదికలను రూపొందంచింది.

9 కార్పొరేషన్లలో టిఆర్‌ఎస్ అధికమెజారిటీ సాధించి కార్పొరేషన్లపై టిఆర్‌ఎస్ జెండాను ఎగరవేసే అవకాశాలే అత్యధికంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ భావిసోంది. కాంగ్రెస్,బిజెపిల అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మెకాశాలు లేవనే ఆలోచన టిఆర్‌ఎస్ వర్గాల్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రతి ఓటరును కలిసి విజ్ఞప్తి చేసిన టిఆర్‌ఎస్ పోలింగ్‌లోనూ దూసుకువెళ్లనుందని పలువురు భావిస్తున్నారు.

Telangana municipal polls 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News