Monday, April 29, 2024

చిన్నారి క్షేమం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఘట్కేసర్ లో నిన్న రాత్రి కిడ్నాప్ కి గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని రాచకొండ పోలీసులు క్షేమంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకునివచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. బాధిత చిన్నారి ఇంటి దగ్గరలో నివసించే వ్యక్తి సురేష్, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చాక్లెట్ కోసం బయటికి వచ్చిన పాపను అపహరించడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న ఘట్కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని రక్షించి క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పాప కిడ్నాప్ కు గురైన ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పరిసరాల్లోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించి పాపను అపహరించిన సురేష్ కదలికలను గమనించామన్నారు. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సురేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నామని, పాపతో పాటు నిందితుడిని స్టేషన్కు తరలించిన అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించి సురక్షితంగా వారికి అప్పగించామని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు.

ఘట్కేసర్ గ్రామంలో ఉన్న యువకులంతా కూడా చిన్నారిని కాపాడేందుకు వెతకడం లో పాల్గొన్నారని, వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి నేరం జరిగినా 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని, నేరాలను అదుపుచేసే సంకల్పంతో పని చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఆడపిల్లలకు, మహిళల భద్రతకి పెద్ద పీట వేస్తున్నామని, మహిళ భద్రతకు సంబంధించి ఏ కేసు ఉన్న సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపారు.

గంటల వ్యవధిలోనే తమ బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పాపను సురక్షితంగా తల్లి దండ్రుల చెంతకు చేర్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ జిందాబాద్ అంటూ స్థానికుల నినాదాలు చేయడం గమనార్హం. చిన్నారిని రక్షించిన ఘట్కేసర్ పోలీసులను కమిషనర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News