Thursday, October 10, 2024

ఫిరాయింపుల తెనేతుట్టె

- Advertisement -
- Advertisement -

స్పీకర్ నిర్ణయంపై జోరుగా ఊహాగానాలు
నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్లపై తేల్చాలన్న హైకోర్టు ఆదేశాలతో సర్వత్రా ఉత్కంఠ 
గత అనుభవాలపై రాజకీయ, న్యాయ పరిశీలకుల చర్చ

మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి /హైదరాబాద్: ముగ్గురు భారత రాష్ట్ర సమితి శాసన సభ్యులు దా నం నాగేందర్ , కడియం శ్రీహరి ,తెల్లం వెంకట్ రావులు పార్టీ ఫిరాయించిన కేసులో సోమవారం నాడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ పార్టీ లో కోత్హ ఉ త్సాహాన్ని నింపింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను హై కోర్టు ఆదేశించింది. లేకపోతే తామే సూమోటాగా కేసు విచారణ జరుపుతామని అనడం బీఆర్‌ఎస్ ను సంతోష పరిచినా న్యాయ వ్యవస్థ, శాసన వ్య వస్థకు మధ్య వైరుధ్యాలకు కారణమయ్యే అవకాశాలున్నట్టు న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే స్పీకర్ ఈ నాలుగు వారాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ కొనసాగుతున్నది. అధికార పక్షానికే చెందిన శాసన సభ్యుడు స్పీకర్ స్థానం లో ఉండగా ఆ పార్టీ ప్రయోజనానికి భిన్నంగా ఫిరాయించిన ముగ్గురు సభ్యుల మీద వేటు వేస్తారా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

వీరితో బాటే, పార్టీ ఫిరాయించిన మరో ఏడుగురి మీద కూడా చర్య ఉండాలని కోర్ట్ తీర్పు వెలువడిన మరు క్షణం నుండి ప్రతిపక్షం డిమాండ్ చెయ్యడం మొదలు పెట్టింది .మరి కొంత మంది పార్టీ ఫిరాయించనున్నారన్న ప్రచారం కొద్ది రోజుల క్రితం వరకూ జరిగింది. ప్రతిపక్షం నుండి మూడింట రెండొంతుల మంది ఫిరాయిస్తే తప్ప ఆ గ్రూప్ కు చట్టబద్దత రాదు. అది జరగని పక్షంలో స్పీకర్ హై కోర్ట్ నిర్ణయాన్ని అమలు చెయ్యకపోతే ముందే చెప్పినట్టు కోర్ట్ ఈ ముగ్గురు సభ్యత్వాన్ని రద్దు చేస్తే శాసన సభ అధికారాలకు భంగం కలిగి రెండు వ్యవస్తల మధ్య ఘర్షణకు దారి తియ్యనుందా?

దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీల పార్టీ ఫిరాయింపులు ఇవ్వాళ కొత్త గా ఏం జరగడం లేదు. ఇందులో మోడీ, కేసీఆర్, చంద్రబాబు, రేవంత్ ఎవరూ మినహాయింపు కాదు. అధికారమో, డబ్బో, కాంట్రాక్టులో, మరికొన్ని ప్రయోజనాలో ఆశించి చట్టసభల్లోకి అడుగుపెడుతున్నవారు ఎక్కువ మంది ఉన్నందున పార్టీ ఫిరాయింపులకు వెనుకాడడం లేదన్నది వాస్తవం. చాలామంది రాజకీయ నాయకులు నైతిక విలువలు, రాజ్యాంగ సూత్రాలకు జంకూ గొంకు లేకుండా సులభంగా వెన్నుపోటు పొడిచేస్తున్నారు. మహారాష్ట్ర ఉదంతాన్ని తాజా ఉదాహరణగా చెప్పుకోవొచ్చు. అక్కడ అధికారం లో ఉన్న శివ సేన, ఎన్‌సిపి పార్టీలను నిలువునా చీల్చి బీజేపీ తన అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తరచూ చెప్పే పదాలు ’ఇకమత్’,’ఇగురం’.అంటే తెలివితేటలతో ఏదైనా చెయ్యాలి. ’ఇగురం’తో చెయ్యడమంటే చట్టబద్దత కలిగే సంఖ్యలో అవతలి పక్షం శాసన సభ్యులను తమ పార్టీ లో చేర్చుకోవడం. ప్రస్తుతం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అంత మంది ఫిరాయించకపోవడాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిఆర్‌ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే న్యాయపోరాటానికి నడుం బిగించింది.
గతంలో తెలంగాణలో ప్రతిపక్షాలను మట్టికరిపించి ప్రజాస్వామ్యాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల ఫిరాయింపులపై దుమ్మెత్తిపోయడం విడ్డూరంగా ఉన్నది. 2014లో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేసీఆర్ ఫిరాయింపు సంస్కృతిని ప్రారంభించారు.

అది 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయే వరకు కొనసాగింది. 2014 జూన్ 2 న తెలంగాణ అధికారికంగా ఏర్పడిన రోజున బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. 2014 డిసెంబర్ 16న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా నియమితులయ్యారు .
నిబంధనల ప్రకారం శ్రీనివాసయాదవ్ రాజీనామా చేసి ఆరు నెలల్లో ఉప ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్నది. కానీ ఆయన అలా చేయకుండానే తన పదవిలో కొనసాగారు. అదే సంవత్సరం 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు టిఆర్ ఎస్ లోకి ఫిరాయించారు. 2016న టీడీపీ శాసన సభాపక్షం అధికారికంగా బీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు ప్రకటించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ లో (2014-2018) నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి 18 మంది ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. మొత్తం 47 మంది ఫిరాయింపులు జరిగాయి. రెండో టర్మ్ (2018-2023)లో కాంగ్రెస్‌కు చెందిన 12 మంది, టీడీపీకి చెందిన ఇద్దరు సహా మరో 14 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి దళిత నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు. ముస్లిం మైనారిటీ నాయకుడు షబ్బీర్ అలీకి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుని హోదా రాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించేలా కేసీఆర్ ప్రేరేపించారు. 2018 ఎన్నికల అనంతరం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలది ’ఫిరాయింపు’ కాదు. ఎందుకంటే మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలేసి టీఆర్‌ఎస్ లో చేరడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు కింద విలీనమే అవుతుంది. గానీ ఫిరాయింపు కాదు. ఒక్కరు పార్టీ మారితే అనర్హత వేటు పడి ఎమ్మెల్యే పదవి ఊడుతుంది. కానీ, 12 మంది మారితే వారు గౌరవప్రదంగా విలీనమైనందున వారిపై అనర్హత వేటు పడదు. కేసీఆర్ ’ఇకమత్’ తో నడిపిన ప్రక్రియ అది.

కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద జనం ఓట్లేస్తే గెలిచి ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్‌తో కలిశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పు అంటున్నది.
టీడీపీ గుర్తు మీద 2014లో ఎన్నికయి టీఆర్‌ఎస్ లో చేరి మంత్రిగానూ అవకాశం దక్కించుకున్న తలసాని శ్రీనివాసయాదవ్ ”2004 ఎన్నికల తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం రాజ్యంగబద్ధమైనపుడు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితే రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుంద”ని అప్పట్లో అన్నారు.

అయితే డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు టీ ఆర్ ఎస్ నుండి బయటికి వచ్చిన 10 మంది శాసన సభ్యులను అధికారికంగా కాంగ్రెస్ లో చేర్చుకోకుండా ప్రత్యేక బ్లాక్ గా చివరి సమావేశాల దాకా గుర్తించి చివరి సెషన్ లో అప్పటి స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి వారి మీద వేటు వేసిన విషయం ఇక్కడ గుర్తు చెయ్యాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం వల్ల టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా వచ్చిన లాభమేదీ లేదు. కానీ, ప్రతిపక్షాన్ని బలహీన పరచడం దాని వెనుక ఉన్న ఎజండా. ఇక ఎంఐఎం మిత్రపక్షమే కనుక శాసనసభలో ఎదురులేని రాజకీయ శక్తిగా 2023 వరకు టీఆర్‌ఎస్ కొనసాగింది.

శాసనసభలో ఓటింగ్ సమయంలో విప్ ఉల్లంఘించడం ఒక్కటే ఫిరాయింపునకు నిదర్శనం కాదని, ఉన్న పార్టీకి రాజీనామా చేసినా, వేరే పార్టీలో చేరుతున్నట్టు బాహాటంగా ప్రకటించినా, అదికూడా ఫిరాయింపు కిందికే వస్తుందని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో తీర్పునిచ్చింది. కానీ ఆచరణలో ఫిరాయింపులు విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నవి. ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరతామని చెప్పి, మరికొందరు కూడా వస్తారని బహిరంగంగా చెప్పినప్పుడే వారు ఫిరాయించినట్టు కాదు. ఆ ఎమ్మెల్యేల సంఖ్య 12 అయ్యే దాకా ఆగి, తరువాత తీరిగ్గా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నది. విలీనం పేరిట ఫిరాయింపులు జరిగాయి. విలీనానికి కావలసిన సంఖ్య కన్నా తక్కువ మంది ఫిరాయించినట్టు ప్రకటించినపుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన స్పీకర్ ఈ ఫిర్యాదులను పక్కన బెట్టి, 12 మంది రాగానే విలీనమని ప్రకటించేశారు. ఒకరు ఇద్దరు చొప్పున వస్తూ ఉంటే పార్టీ ఫిరాయింపు నిషేధం కింద అనర్హుడిగా ప్రకటించకుండా 12 మంది కాగానే విలీనం అని స్పీకర్ ఆమోదించారు.

1995లో టీడీపీలో ఎన్.టి.రామారావు,చంద్రబాబు మధ్య ‘వైస్రాయి’ సంక్షోభం తలెత్తినప్పుడు నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు లాగే, 2018 తర్వాత తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యహరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి తగినంత ఆధిక్యత వచ్చినా 23 మంది వైఎస్‌ఆర్సిపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలో చేర్చుకున్నారు. ఒకరిద్దరికి మంత్రిపదవి కూడా లభించింది. ఎమ్మెల్యేలుగా గెలిచే వారిలో చాలా మందికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. పెట్టిన ఖర్చులను లాభాలతో సహా వసూలు చేసుకోవడానికి అధికార పార్టీలో ఉండడమే మంచిదనుకునే వారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

తెలంగాణ వాదమే ఎజండాగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ’ఫక్తు రాజకీయ పార్టీ’గా అవతరించడంతో మిగతా పార్టీల అవలక్షణాలన్నీ వచ్చి చేరాయి.అవకాశవాదులకు పెద్ద పీట వేయడం,సంపన్నులను వెతికి, గాలించి టికెట్లు ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి భారీగా వలసలను ప్రోత్సహించడం, టిఆర్‌ఎస్ మినహా మరో పార్టీ తెలంగాణలో బతికి బట్ట కట్టకూడదని నిర్ణయించుకోవడం…. వంటి చర్యలతో ఆ పార్టీ ఎంత దెబ్బ తిన్నదో చూస్తున్నాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News