Wednesday, October 9, 2024

అత్యాచారాలకు మరణశిక్షలే పరిష్కారమా!

- Advertisement -
- Advertisement -

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో దేశం మొత్తం ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా పుష్కరకాలం క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ్ ఘటన సైతం ఇటువంటి ఆందోళనలకే దారితీసింది. మన దేశంలో ప్రతి గంటలో నలుగురు మహిళలు అత్యాచారం సంబంధిత ప్రమాదాలు ఎదుర్కొంటున్నట్లు స్వయంగా జాతీయ క్రైమ్ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి ఆందోళనకర పరిణామాలకు అత్యం త సులువైన పరిష్కారాలు కనుగొని, మొత్తం సమస్యను పక్కదారి పట్టించడంలో మన రాజకీయ నేతలు ఆరితేరారు.

నిర్భయ్ సందర్భంగా ప్రధానంగా వినిపించిన నినాదం నిందితుడిని ఉరితీయాలని. ఆ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ చట్టంలో అత్యాచారానికి మరణశిక్షను కూడా ప్రతిపాదించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అదే పని చేస్తున్నారు. వైద్యురాలి దుర్ఘటన వెలుగులోకి రాగానే ఆమె చేసిన మొదటి ప్రకటన నిందితుడికి ఉరితీయాలని కోరడమే. అసలు అటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వ్యవస్థాగతంగా ఉన్నలోపాలు ఏమిటి? మహిళలకు రక్షణ కల్పించే మార్గాలు ఏమిటి? అనే అంశాలవైపు ఎవ్వరూ వెళ్లడం లేదు. మన దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలలో 80 శాతానికి పైగా వారి ఇళ్లల్లో, వారు పని చేస్తున్న ప్రదేశాలలో, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వారికి తెలిసిన వారి నుండే జరుగుతున్నాయి. అపరిచితుల నుండి ఎదురవుతున్న ప్రమాదాలు తక్కువ. నిర్భయ్ తర్వాత అత్యాచారం నేరానికి మరణశిక్ష విధించడం ద్వారా దేశంలో మహిళలపై అత్యాచారాలను తగ్గించగలిగారా? అత్యాచారం తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా చేయడం కోసం మహిళలను హత్య చేయడం దేశంలో మరింతగా పెరుగుతూ వస్తోంది.

అందుకు కారణాలు ఏమిటో ఆత్మపరిశీలన చేసుకొనే ప్రయత్నం జరగడం లేదు. ఇప్పుడు వైద్యురాలి మృతి దుర్ఘటనకు విరుగుడుగా మమతా బెనర్జీ అపరాజిత బిల్లు తీసుకొచ్చారు. అందులో నిందితుడికి మరణశిక్ష విధించడం కీలక అంశం. ఈ విధంగా మరణశిక్ష విధింపుకు అవకాశం వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు లభించడం కష్టం అవుతూ ఉండడంతో కోర్టులలో కేసులు నిలబడటం లేదు. మరోవంక, ప్రభుత్వం కేటాయిస్తున్న నిర్భయ్ నిధులు సక్రమంగా ఖర్చు కావడం లేదు. 70 శాతం వరకు కేటాయింపులు జరుగుతున్నా, వాటిని ఏమేరకు ప్రయోజనకరంగా ఖర్చు పెడుతున్నారో పర్యవేక్షణ కనిపించడం లేదు. సాధారణ మహిళా, శిశుసంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఖర్చు పెడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు ఓ అలజడిగామార్చి, రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేయడమే గాని, సమస్య లోతుపాతులు వెళ్లి, పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం జరగడం లేదు.

ముఖ్యంగా మహిళలపై దారుణమైన హింసాయుత ఘటనలు జరిగినప్పుడు వ్యవస్థలు, అధికారుల జవాబుదారీతనం గురించి, బాధితులకు సత్వర న్యాయం కలిగించడం గురించి ఆలోచించడం లేదు. మరణశిక్షను చట్టంలో చేర్చడం ద్వారా కేవలం ‘త్వరిత పరిష్కారం’ కనుగొన్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. బెంగాల్‌లో, ఇతరత్రా వైద్యులు జరుపుతున్న ఆందోళనలతో సైతం ఇటువంటి ప్రశ్నలే ప్రాథమికంగా తలెత్తుతున్నాయి. భారతదేశంలో అత్యాచారంతో సహా లైంగిక హింసకు సంబంధించిన నేరాలకు సంబంధించిన చట్టాలు , నేర న్యాయ విధానాలను సంస్కరించడానికి 2012లో ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ, భారత లా కమిషన్ కూడా మహిళలపై హింసాత్మక కేసుల్లో మరణశిక్షను వ్యతిరేకించాయి. నేరాలకు మూలకారణాలను నివారించే విధానపరమైన, సంస్థాగత సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశాయి.

అయితే, ప్రభుత్వాలకు అటువంటి దూరదృష్టి గాని, ఆలోచనలు గాని ఉన్నట్లు కనిపించడం లేదు.నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన జస్టిస్ వర్మ కమిటీ ఎంతో లోతైన పరిశీలన జరిపి చేసిన సూచనలను అమలు పరచే ప్రయత్నాలు జరగడం లేదు. ఈ సందర్భంగా పోలీసు శిక్షణలో చేయవలసిన మార్పులు, చేపట్టాల్సిన పోలీస్ సంస్కరణలు, లైంగిక హింసకు సంబంధించిన నివేదికలు నమోదు చేయడం, దర్యాప్తు జరిపే విధానాల గురించి నిర్దుష్టమైన సిఫార్సులు చేశారు. కానీ ఇటువంటి సిఫార్సులను చెత్తబుట్టలో పడవేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు అనవసరమైన జాప్యాలు, భయం, శిక్షార్హత, అనిశ్చితి వాతావరణాన్ని మరింత పెంచేందుకే దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతాలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యఘటనలో కేసు నమోదు దగ్గర నుంచి, విచారణ ప్రారంభం మొదలుకొని, సాక్ష్యాధారాలు చెరిపివేసే ప్రయత్నాలు నగ్నంగా జరపడంతో మన నేర న్యాయ వ్యవస్థ ఎంత దుర్బలంగా ఉందో స్పష్టంగా వెల్లడైంది.

ఇటువంటి ప్రమాదకరమైన వ్యవస్థాగత దుర్మార్గాలను సరిదిద్దే ప్రయత్నం చేయకుండా చట్టంలో కేవలం మరణశిక్ష విధించే అవకాశం కల్పించడం వల్లన ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, 2023, భారతీయ న్యాయ సురక్ష సంహిత, 2023, లైంగిక నేరాల నుండి పిల్లల నిరోధక చట్టం, 2012 సవరణలను కఠినతరం చేసే ‘అపరాజిత’ బిల్లును తీసుకురావడం ద్వారా పరిస్థితుల్లో చెప్పుకోదగిన మార్పు తీసుకొచ్చే అవకాశం ఏమాత్రం లేదు.
కేవలం మహిళలపై అత్యాచారాలు, నేరాల విషయంలోనే కాకుండా చట్టాల నుండే మరణశిక్షలను తొలగించడం ద్వారా మొత్తం ప్రపంచం మరణశిక్షలు లేని సమాజం వైపు నేడు ప్రయాణం సాగిస్తోంది. ఇప్పటికే సుమారు 80 శాతం దేశాలలో మరణశిక్షను చట్టాల నుండి తొలగించడమో లేదా అమలు జరపకపోవడమో చేస్తున్నాయి. మన దేశంలో సైతం అతి అరుదైన కేసులలో మాత్రమే మరణశిక్షలను విధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రపంచంలోని అన్ని మానవ హక్కుల సంస్థలు మరణ శిక్షలు వంటి అత్యంత అమానుషమైన శిక్షలను, మనుషుల ప్రాణాలను కాపాడాల్సిన నాగరిక ప్రభుత్వాలు స్వయంగా వారి ప్రాణాలను తీసుకోవడం తగదని స్పష్టం చేస్తూ వస్తున్నాయి. అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిగా, మరణశిక్షలు విధించడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని ప్రపంచంలో ఎటువంటి అధ్యయనం నిరూపించలేదు. మరణశిక్షలను రద్దు చేసిన దేశాలలో నేరాల సంఖ్య పెరిగినట్లు గాని, మరణశిక్షను అమలు పరచడం ద్వారా నేరాల సంఖ్య తగ్గాయని గాని నిరూపితం కాలేదు. మరోవంక, న్యాయస్థానాలలో అమాయకులకు శిక్షలు విధించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కొద్దీ కాలం తర్వాత వారిపై ఆపాదించిన సాక్ష్యాధారాలు తప్పని, వారు నిర్దోషులని తేలితే అప్పటికే మరణశిక్ష విధిస్తే ఆ వ్యక్తికి తీవ్ర అన్యాయం జరిపినట్లే కాగలదు. అమెరికా వంటి దేశాలలో సైతం ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి.

ఐక్యరాజ్య సమితి ఆమోదించిన చారిత్రాత్మక మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడిన, అత్యంత క్రూరమైన, అమానవీయ, అవమానకరమైన శిక్షలో గుర్తించిన విధంగా మరణశిక్షను జీవించే హక్కు ఉల్లంఘనగా భావించాల్సి ఉంటుంది. కఠిన శిక్షలు తీసుకొస్తున్నా కోర్టులలో శిక్షలు పడటం మాత్రం తగ్గిపోతున్నది. మూడు వంతుల కేసులలో నిందితులకు శిక్షలు పడటంలేదు. అంటే దర్యాప్తులో, ప్రాసిక్యూషన్‌లో తీవ్రమైన లోపాలను ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటువంటి మౌలిక అంశాల పట్ల ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదు. కలకత్తాలో వైద్యురాలి దుర్ఘటన జరగడానికి కొద్ది వారాల ముందు స్వయంగా గవర్నర్ రాజ్‌భవన్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు చేసింది. రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణలతో ఆ గవర్నర్ విచారణ నుండి తప్పించుకుంటున్నారు.

కనీసం ఓ మహిళగా బాధితురాలు తనకు ఫిర్యాదు చేసినప్పుడు రాష్ట్రపతి ఆయనను సంజాయిషీ అడిగే ప్రయత్నం చేయలేదు. గత ఏడాది ఓ ఎంపి తమను లైంగిక వేధింపులకు గురిచేశారని మహిళా రెజర్లు ఢిల్లీలో తీవ్రమైన ఆందోళన చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు వారి ఆరోపణలపై పోలీసులు కనీసం కేసు నమోదు చేయలేదు. ఈ నెలలోనే వడోదరలో బిజెపి కార్పొరేటర్ ఒకరు పార్టీ ప్రముఖులు పాల్గొన్న సభ్యత్వ కార్యక్రమంలో ఓ నేత తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణ చేస్తే ఆ పార్టీ స్పందించకపోవడంతో ఆమె మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. కేరళలో ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రాష్ట్ర శాసనసభలోని ప్రతిపక్ష నేత తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసే కనీసం విచారణ కూడా చేయకుండా ఆమెను పార్టీ నుండి బహిష్కరించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసంలో ఆయన పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపి తనపై ఆయన వ్యక్తిగత కార్యదర్శి అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేస్తే ఆమెను పార్టీ నుండి గెంటేశారు. మన దేశంలోని ఎంపిలు, ఎంఎల్‌ఎల్లో 151 మంది మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారు. వారిలో 15 మంది అత్యాచారం కేసులలో నిందితులు. అంటే మహిళలపై నేరాల విషయంలో మన రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మౌలికమైన మార్పులు తీసుకురాకుండా మరణశిక్ష విధించడం పరిష్కారం కాబోదని, సమస్య తీవ్రతను మరింత జటిలం కావిస్తోందని గ్రహించాలి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News