Friday, May 10, 2024

బోణీ ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

second T20

 

సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో లంక, నేడు ఇండోర్‌లో రెండో టి20

ఇండోర్: తొలి ట్వంటీ20 వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడంతో ఇండోర్ వేదికగా జరిగే రెండో టి20 ఇటు భారత్‌కు అటు శ్రీలంకకు కీలకంగా మారింది. సిరీస్‌ను గెలవాలంటే ఇకపై జరిగే రెండు మ్యాచుల్లో కూడా గెలవక తప్పదు. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్‌ను ఇరు జట్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్‌ను చేజార్చకుండా చూసుకోవాలనే లక్షంతో ఇరు జట్లు ఉన్నాయి. ఇక, ఈసారి కూడా ఆతిథ్య టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా సిరీస్‌లో ఆధిక్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు లంక కూడా ఇదే లక్షంతో పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ధావన్‌కు కీలకం
గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ రద్దుకావడం భారత ఓపెనర్ శిఖర్ ధావన్‌కు పెద్ద అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల్లో హోల్కర్ స్టేడియంలో జరిగే రెండో టి20 ధావన్‌కు సవాలుగా మారింది. రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో కూడా మెరుగ్గా ఆడక తప్పదు. అయితే తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ధావన్ ఎలా ఆడుతాడనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ధావన్‌కు ఛాన్స్ దొరికింది. మరోవైపు లోకేశ్ రాహుల్ ఓపెనర్‌గా అందివచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నిలకడగా రాణించి జట్టులో స్థానాన్ని మరింత సుస్థరం చేసుకున్నాడు. ఇక, మిగిలిన మ్యాచుల్లో కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒకవేళ రెండు మ్యాచుల్లో రాహుల్ రాణిస్తే ధావన్‌కు కష్టాలు తప్పక పోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ధావన్‌కు సిరీస్ సవాలు వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కోహ్లి మెరవాలి
మరోవైపు టీమిండియాకు కెప్టెన్ విరాట్ కోహ్లి కీలకంగా మారాడు. రోహిత్ దూరమైన నేపథ్యంలో జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసే బాధ్యత కోహ్లిపై పడింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే లంక బౌలర్లకు కష్టాలు ఖాయం. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈసారి కూడా బ్యాట్‌ను ఝులిపించేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఈ మ్యాచ్‌లో విజయం భారత్‌కు నల్లేరుపై నడకేనని చెప్పాలి.

పంత్‌పైనే అందరి కళ్లు
ఇక, కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే పంత్ తన ఆటను మరింత మెరుగు పరుచుకోక తప్పదు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు లభించినా దాన్ని అనుకూలంగా మార్చుకోవడంలో పంత్ విఫలమయ్యాడనే చెప్పాలి. ఆట మెరుగు పడక పోతే రానున్న రోజుల్లో జట్టులో స్థానాన్ని కాపాడు కోవడం చాలా కష్టం. ఇప్పటికే సంజు శాంసన్ రూపంలో పంత్‌కు గట్టి పోటీ నెలకొంది. ఏమాత్రం విఫలమైన జట్టులో చోటు గల్లంతు కావడం ఖాయం. దీంతో పంత్ ఇటు బ్యాటింగ్‌లో, అటు వికెట్ కీపింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచాల్సిందే. ఇందులో ఎంత వరకు సఫలమవుతాడో చూడాల్సిందే.

బౌలింగే బలం
ఈసారి కూడా భారత్ బౌలర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. బుమ్రా చేరికతో బౌలింగ్ బలోపేతంగా తయారైంది. ఫార్మాట్ ఏదైనా వికెట్ల పంట పండించడం బుమ్రా అలవాటుగా మార్చుకున్నాడు. కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న బుమ్రా ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి వచ్చాడు. ఇందులో రాణించడం ద్వారా రానున్న సిరీస్‌లకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తున్నాడు. శార్ధూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, శివమ్ దూబే తదితరులతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం చాలా బలంగా తయారైంది. ఇక, స్పిన్ విభాగంలో కూడా భారత్‌కు తిరుగేలేదు. చాహల్, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ రాణించిన భారత్‌కు విజయం ఖాయం.

తక్కువ అంచన వేయలేం
కాగా, పర్యాటక శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచన వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ప్రతిభావంతులైన క్రికెటర్లు లంకకు అందుబాటులో ఉన్నారు. కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, గుణతిలక, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, డిక్వెల్లా వంటి ఆటగాళ్లతో లంక చాలా బలంగా ఉంది. అంతేగాక, మలింగ, మాథ్యూస్ రూపంలో అనుభవజ్ఞులు ఉండనే ఉన్నారు. దీంతో లంక కూడా భారీ ఆశలతో మ్యాచ్‌కు సిద్ధమైంది.

జట్ల వివరాలు:

భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, సంజు శాంసన్, బుమ్రా, చాహల్, సైనీ, ఠాకూర్, కుల్దీప్ యాదవ్.

శ్రీలంక: లసిత్ మలింగ (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, భానుక రాజపక్సె, ఒశాడా ఫెర్నాండో, ధనుష్క గుణతిలక, మాథ్యూస్, దాసున్ శనక, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, డిక్వెల్లా, వనిండు హరసంగా, లహిరు కుమార, సండకాన్, కాసున్ రజిత.

రాత్రి 7 గంటల నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం..

The second T20 in Indore
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News