Monday, May 6, 2024

ఉత్తరాది ‘ఉడుకు’

- Advertisement -
- Advertisement -

Temparatures high in Telangana for next 5 days

వేసవి జాగ్రత్తలపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత నీరు ఎక్కువగా
తీసుకోవాలి ఎండల నుంచి పిల్లలకు రక్షణపై సలహాలు

న్యూఢిల్లీ : ఎండవేడిమి తీవ్రతలు, మరింత ముదిరిపోయే ఉష్ణోగ్రతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సలహాలు సూచనలతో కూడిన లేఖలను పంపించింది. రికార్డు స్థాయి ఎండలను తట్టుకునేందుకు ఏవిధంగా సిద్ధంగా ఉన్నారనేది సమీక్షించుకుని , తగు విధంగా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుందని ఈ అడ్వయిజరీలో కేంద్రం సూచించింది. ఈసారి ఎండాకాలం మార్చి నెలారంభం నుంచి తన ప్రతాపం చూపింది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు సగటున చూస్తే 47 డిగ్రీల స్థాయి వరకూ చేరాయి. దీనితో ఆరోగ్య సౌకర్యాలు, సంసిద్ధత దిశలో సమీక్షకు కేంద్రం హుటాహుటిన లేఖలు పంపించింది. వచ్చే రోజులలో పశ్చిమ వడగాడ్పులు వీస్తాయి. దీని ప్రభావంతో మరింత వేడి వాతావరణం ఏర్పడుతుంది. తగు జాగ్రత్తల అవసరం ఉందని కేంద్రం తరఫున ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు పంపించారు. వీటిని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతాధికారులకు పంపించి వాటిలో తీసుకోవల్సిన జాగ్రత్తలు పొందుపర్చారు. ఈ సీజన్‌లో ఇప్పుడు ఉండాల్సిన స్థాయి కన్నా 6 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పెరిగాయి.

ఈ అసాధారణ స్థితిని తట్టుకుని తీరాల్సి ఉందని లేఖలలో తెలిపారు.వేడిమి సంబంధిత అస్వస్థతలు, జబ్బులపై తాము పంపించే మార్గదర్శకాల పత్రాల ప్రతులను తక్షణమే జిల్లాల అధికార యంత్రాంగానికి పంపించాలని ఈ లేఖల్లో సూచించారు. ఇంతకు ముందు ఏడాది జులైలో సంబంధిత అంశంపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను వెలువరించారు. ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉంటుంది. దీనిని పరిశీలించుకుని అన్ని స్థాయిలలో ఎండవేడిమి నివారణకు, ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఎండల నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా?

ఉత్తర పశ్చిమ భారతపు వడగాడ్పులతో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీత స్థాయికి చేరే ముప్పు ఉండటంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవల్సిన జాగ్రత్త చర్యల గురించి ఆరోగ్య నిపుణులు విశదీకరించారు. ఏడాదంతా కొవిడ్ సంబంధిత సమస్యల నడుమ చిన్నారి విద్యార్థులు ఆన్‌లైన్ చదువులతో ఇళ్లకు పరిమితం అయ్యారు, ఇప్పుడిప్పుడు పరీక్షలు, ఇంకా తరగతి చదువులకు భౌతికంగా హాజరవుతున్నారు. అయితే ఈ మండే ఎండలతో వారు తిరిగి ఇండ్లకు పరిమితం కావల్సి ఉంటుంది. శరీరంలో నీటి పరిణామం దెబ్బతిని సొమ్మసిల్లే ముప్పు ఉంటుంది.

నీరు ఎక్కువగా తీసుకోవాలి

పిల్లలు ఎక్కువగా నీరు తీసుకునేలా చేయాల్సి ఉంటుంది. వారికి ఆకర్షణీమైన రీతిలో ఉండే జ్యూస్‌లను అందించాలి. పిల్లలు ఎక్కువగా ఆటలకు బయటకు వెళ్లే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ దశలో వారికి ఎక్కువగా ఇంటి ఆటలు పట్ల ఆసక్తి పెంచాలి. ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్‌కు తీసుకువెళ్లాలి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు పిల్లల ఆహారంలో తగు కూరగాయలు ఉండాలి. కాలానుగుణంగా దొరికే పండ్లు ఇస్తే ఇమ్యూనిటి పెరిగి, వడదెబ్బల తీవ్రతకు అవకాశాలు తగ్గుతాయి. ప్రత్యేకించి ఈ వేసవిలో పిల్లలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తూ ఉండాలి. వేసవి తీవ్రతతో వారిలోఎలాంటి శారీరక మార్పులు వస్తున్నాయి? ఆలోచనలు అలవాట్లలో విభిన్నంగా ఉంటున్నారా? అనేది క్షుణ్ణంగా చూడాల్సి ఉంటుంది. అవాంఛనీయ అసాధారణ మార్పులు కనబడితే వెంటనే సంబంధిత వైద్యులకు చూపించి తగు విధంగా చికిత్స ఇప్పించాలని నిపుణులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News