Wednesday, May 1, 2024

ఇన్నేళ్లకు ‘చే’జిక్కించుకున్నారు…!

- Advertisement -
- Advertisement -

కల నెరవేర్చుకున్న హస్తం నేతలు
40 నుంచి 50 ఏళ్లుగా గెలుపు కోసం పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల పోరాటం
ఈ ఎన్నికల్లో తీరిన కల

మనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని సంవత్సరాలుగా ఆ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు చెమటోడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎట్టకేలకు తమ పార్టీ జెండాను పాతి ఇన్నేళ్ల  తమ కలను నెరవేర్చుకుంది. ఈ క్రమంలోనే దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ పాగా వేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాతా, చేజిక్కని నియోజకవర్గాలను ఈసారి చేజిక్కించుకుంది. దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని చోట పాగా వేయడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. కొన్ని చోట్ల 50, మరికొన్ని చోట్ల 40 సంవత్సరాలుగా గెలుపు కోసం అక్కడి అభ్యర్థులు చెమటోడ్చుస్తుండడం విశేషం.

నర్సంపేటలో 56 సంవత్సరాలకు పైగా…
నర్సంపేట నియోజకవర్గం 56 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి బిఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. చివరగా 1967లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డి సిపిఎం అభ్యర్థి ఎ.వెంకటేశ్వరరావుపై గెలిచారు.

1983లో పాలకుర్తిలో…
పాలకుర్తి నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇక్కడ కాంగ్రెస్ ఇదే తొలి విజయం. చివరగా ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పాత చెన్నూరు పరిధిలో(రద్దయిన) ఉండగా 1983లో హస్తం పార్టీ విజయం సాధించింది. 2009 నుంచి గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావుపై ఇప్పుడు యశస్వినిరెడ్డి గెలుపొందారు.

1983లో భువనగిరిలో…
భువనగిరి కోటపై నలభై సంవత్సరాల తర్వాత హస్తం పార్టీ జెండా రెపరెపలాడింది. హ్యాట్రిక్ ప్రయత్నంలో ఉన్న బిఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై కుంభం అనిల్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. ఇక్కడ చివరగా 1983లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.నర్సింహారెడ్డి విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్‌లో 34 సంవత్సరాలు…
నాగర్కర్నూల్‌లో 34 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ చేజిక్కించుకుంది. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి విజయం సాధించారు. చివరగా ఇక్కడ 1989లో కాంగ్రెస్ తరఫున వంగా మోహన్‌గౌడ్ గెలుపొందారు.

రామగుండంలో 34 సంవత్సరాలు…
రామగుండం నియోజకవర్గాన్ని 34 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ నుంచి మాతంగి నర్సయ్య గెలిచారు.

ఖానాపూర్‌లో 30 సంవత్సరాలకు పైగా…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధి ఖానాపూర్ (ఎస్టీ) ఎట్టకేలకు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు తన సమీప బిఆర్‌ఎస్ అభ్యర్థి, జాన్సన్ నాయక్‌పై 4,976 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.

వేములవాడలో 25 సంవత్సరాలకు పైగా…
25 సంవత్సరాల క్రితం మెట్‌పల్లి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ విజయం సాధించింది. 1998 ఉపఎన్నికలో కొమ్మిరెడ్డి జ్యోతి గెలిచారు. వేములవాడ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ప్రస్తుతం హస్తం పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపొందారు.

వరంగల్ పశ్చిమలో 25 ఏళ్లు…
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 25 సంవత్సరాల అనంతరం హస్తం పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ గెలుపొందారు. చివరిసారి 1998 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పివి రంగారావు ఇక్కడ విజయం సాధించారు.

చొప్పదండిలో 24 సంవత్సరాలకు పైగా…
చొప్పదండి నియోజకవర్గాన్ని 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హస్తం పార్టీ అభ్యర్థి మేడిపల్లి సత్యం సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ గెలుపొందారు. చివరిగా 1999లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సత్యనారాయణ గౌడ్ గెలిచారు.

ధర్మపురిలో 24 సంవత్సరాలకు పైగా…
ధర్మపురిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎ.లక్ష్మణ్‌కుమార్ బిఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపొందారు. నాలుగు ఎన్నికల అనంతరం లక్ష్మణ్‌కు విజయం దక్కింది. ధర్మపురి ఇందుర్తిగా ఉన్నప్పుడు 1999లో హస్తం పార్టీ అభ్యర్థి బొమ్మా వెంకటేశ్వర్ గెలిచారు. 2009లో ధర్మపురి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News