భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాకిస్థాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులను సద్ధుమణిగించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. ఇరు దేశాలతో చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేలా చేసింది. ఈ నిర్ణయం తర్వాత భారత సైన్యం పలు కీలక విషయాలు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయంలో పాకిస్థాన్ ఎన్నో అబద్ధాలను(Lies) ప్రచారం చేస్తోందని భారత సైన్యం పేర్కొంది.
ఎస్-400, బ్రహ్మోస్ వ్యవస్థపై దాడి చేశామని పాక్ చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని భారత సైన్యం తెలిపింది. సిర్సా, జమ్ము, భటిండా, భుజ్‌పై దాడి చేశామని పాక్(Pakistan) చెప్పుకుంటున్న మాటలు కూడా అసత్యాలు అని స్పష్టం చేసింది. నలియా, పఠాన్‌కోట్ వాయుసేన స్థావరాలకు నష్టం కలిగించామన్న మాట కూడా అవాస్తవమని తేల్చి చెప్పింది. చండీగఢ్ ఆయుధాగారంపై దాడి చేసినట్లు పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలిపింది. ప్రార్థన మందిరాలపై భారత్ దాడి చేసినట్లు పాక్ అసత్యాలను(Lies) ప్రచారం చేస్తోందని మండిపడింది. భారత్ లౌకిక దేశమని.. ప్రార్థనా మందిరాలపై ఎప్పుడూ దాడి చేయదని పేర్కొంది.
భారత్ చేసిన ప్రతిదాడులతో పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరిగిందని.. పాకిస్థాన్ రాడార్, క్షిపణి రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసిందని భారత సైన్యం వెల్లడించింది. కర్దు, సరోదా, జకోబాబాద్‌లోని పాక్ వాయుసేన స్థావరాలను భారత్ ధ్వంసం చేసినట్లు తెలిపింది. నియంత్రణ రేఖ పొడవునా.. పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర నష్టం కలిగించిందని స్పష్టం చేసింది.