Saturday, December 3, 2022

కరెంట్‌షాక్‌తో ముగ్గురు మృతి

- Advertisement -

డోర్నకల్ మండలం అందనలపాడు గ్రామంలో నెలకొన్న విషాదం

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఉత్సవాలకు సంబంధించి రామాలయం వద్ద ఇనుప స్తంభానికి మైక్‌లను అమర్చేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ వైర్ల ద్వారా ఇనుప స్తంభానికి విద్యుత్ ప్రసారం కావడం, అదే సమయంలో ఆ వైరును తాకిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గ్రామానికి చెందిన గొర్రె వెంకయ్య, మిర్యాల మస్తాన్‌రావు, దుంపల సుబ్బారావు అనే ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముగ్గురు ప్రమాదంలో మృతిచెందడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.

వెంకయ్యకు ఇద్దరు కుమారులు, మస్తాన్‌రావుకు ఇద్దరు కుమారులు, సుబ్బారావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. వీరంతా అనాధాలుగా మిగిలారు. మృతుల కుటుంబాల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. విద్యుత్ అధికారుల నిర్లక్షం మూలంగా ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులు గ్రామానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల కుటుంబాలకు అర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మంత్రి సత్యవతి, ఎర్రబెల్లి దిగ్భ్రాంతి

డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందడం పట్ల రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి సత్యవతి కలెక్టర్ కె. శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. గ్రామంలో పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని మంత్రి ప్రకటించారు.

 

 

Related Articles

- Advertisement -

Latest Articles