Monday, May 5, 2025

సీట్లున్నా.. చేరేవారేరి?

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు మూడు లక్షలు…సీట్లు 5.5 లక్షలు

యుజి కోర్సుల్లో భారీగా
మిగులుబాటు
మెడిసిన్, ఇంజినీరింగ్‌లోనే
పూర్తిస్థాయిలో భర్తీ డిగ్రీలో
అత్యధికంగా సగానికిపైగా
ఖాళీలు డిమాండ్ ఉన్న
కోర్సులకు సీట్ల బదిలీ
మేలంటున్న నిపుణులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేషన్(యుసి) కోర్సుల్లో సీట్లు ఏటా భారీగా మిగులుతున్నాయి. మన రాష్ట్రంలో ఏటా సుమారు మూడు లక్షల మంది ఇంటర్మీడియేట్ లేదా తత్సమాన విద్య కోర్సు పూర్తి చేస్తుండగా, ఈ అర్హతతో ప్రవేశాలు పొందే యుజి కోర్సుల సీట్లు 5.5 లక్షల వరకు ఉన్నాయి. ఈ ఏడాది ఇంటర్‌లో రెండో సంవత్సరంలో 5,08,582 మంది పరీక్షలు రాయగా, 3,33,908 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి ఒపెన్ ఇంటర్ సహా ఇతర తత్సమాన కోర్సులు చేసిన విద్యార్థులు మరో 30 నుంచి 50 వేల వరకు ఉంటారు. అయితే ఇంటర్మీడియేట్ అర్హతతో ప్రవేశాలు పొందే డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబిబిఎస్, బిఎస్‌సి(నర్సింగ్), అగ్రికల్చర్ తదితర కోర్సులలో సీట్లు మాత్రమే 5.5 లక్షలకు ఉన్నాయి.

దీంతో డిమాండ్ కోర్సుల్లో మినహా ఏటా దాదాపు అన్ని రకాల సీట్లు మిగులుతున్నాయి. మన రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన వారిలో సుమారు 10 వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలలో ఉన్నత విద్య చదువుకునేందుకు వెళుతుండగా, 4 వేల మంది వరకు ఐఐటి, ఎన్‌ఐటి వంటి ప్రతిష్టాత్మక కళాశాలల్లో చేరుతున్నారు. వీరితో పాటు సుమారు 2 వేల మంది విద్యార్థులు ఇతర దేశాలకు వెళుతున్నారు. యుజి కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులైన విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు సీట్లు ఉండటంతో ఏటా భారీగా సీట్లు మిగులుతున్నాయి.

ఏటా లక్షల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో సీట్లు మిగులుతుండటం వల్ల మౌలిక వసతులు, వనరులు వృధా అమవుతాయని చెబుతున్నారు. అయితే ఏటా ఇంటర్మీడియేట్ అర్హతతో ప్రవేశాలు పొందే సీట్ల భర్తీని సమీక్షించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సీట్లు అందుబాటులో ఉంచాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో కొన్నేళ్లుగా భర్తీ కాని సీట్లను గుర్తించి వాటిని తొలగించడం లేదా ఇతర కోర్సులకు మార్పు చేసుకోవడం మేలని పేర్కొంటున్నారు.

వైద్య విద్య మినహా అన్ని కోర్సుల్లో సీట్ల మిగులు

ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ వంటి మెడిసిన్ యుజి కోర్సులతో పాటు బి.ఎస్‌సి(అగ్రికల్చర్) కోర్సులు మినహా దాదాపు అన్ని కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. బి.టెక్, వంటి వృత్తి విద్యా కోర్సులతో పాటు సాధారణ డిగ్రీలో కూడా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్‌లో కూడా కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా మొత్తం సీట్లలో ఏటా దాదాపు 30 శాతం ఖాళీగా మిగులున్నాయి. రాష్ట్రంలో 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా,కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిఫియల్ ఇంజనీరింగ్, దాని అనుబంధ బ్రాంచీల సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అవుతుండగా, మిగతా బ్రాంచీలలో సీట్లు మిగులున్నాయి.

డిగ్రీ ప్రవేశాలలో విచిత్రమైన పరిస్థితి

డిగ్రీ ప్రవేశాలలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక పక్క 50 శాతం సీట్లు కూడా భర్తీ కాక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటుంటే, మరోపక్క సీట్లు లభించక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) ద్వారా మూడు విడతల్లో ప్రవేశాలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా, ఈనెల 10 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ విద్యాసంవత్సరం దోస్త్ పరిధిలో 908 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో 3.93 లక్షల సీట్లు అందుబాటు ఉన్నాయి. దోస్త్ పరిధిలో లేని కాలేజీల్లో సీట్లు కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 4.58 లక్షల డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కళాశాలల్లో 50 శాతం కూడా భర్తీ కావడం లేదు. భర్తీ అయిన సీట్ల కంటే మిగిలిన సీట్లే అధికంగా ఉంటున్నాయి. ఏటా గరిష్టంగా మొత్తం 2.10 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందగా, సగానికిపైగా సీట్లు మిగులుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News