Tuesday, October 15, 2024

కాదేదీ కల్తీకి అనర్హం?

- Advertisement -
- Advertisement -

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఏడుకొండల వాడి ప్రసాదం ఒక్కటే కాదు దేశంలో పాలు, జున్ను, పండ్లు, కూరగాయలు కూడా రసాయనాల కల్తీతో వినియోగదారులను అస్వస్థత పాలు చేసే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని వింటున్నాం. క్రిమి సంహారక మందులు, ఎరువులు అతిగా వాడడం వల్ల పంటలు, కూరగాయలు, పండ్లు విషతుల్యమవుతున్నాయని శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు, బెల్లం రంగు, రుచి రావడానికి రసాయనాలు వాడుతున్నారు. దీన్ని బట్టి కల్తీకి కాదేదీ అనర్హం అన్న సామెత సార్ధకమవుతోంది.

తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై మరింత శాస్త్రీయపరమైన దర్యాప్తు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇటువంటి ప్రఖ్యాత క్షేత్రాల్లో ప్రసాదం లేదా ఆహార నాణ్యతను పరీక్షించే వ్యవస్థ ఏ విధంగా ఉంటోంది? నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘించినప్పుడు ఏ చర్యలు తీసుకుంటారు? రాష్ట్ర స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో ఆహార కల్తీ నియంత్రణాధికారులు నాణ్యతను ఎలా పర్యవేక్షిస్తారు? ఇవన్నీ ఎదురయ్యే ప్రశ్నలు.. జాతీయ స్థాయిలో కల్తీ అన్నది వ్యవస్థీకృతమైపోతోంది. రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకం ఎంత విజయవంతంగా సాగుతున్నా కల్తీ కారణంగా ఒడిదుడుకులు తప్పడం లేదు. పౌల్ట్రీలో యాంటీబయోటిక్స్ ప్రభావం లేదా నీటిలో ఆర్సెనిక్, సీసం లోహాల మూలకాలు ఇవన్నీ ఆహారం నాణ్యతను దెబ్బతీస్తుంటాయి. సుగంధ ద్రవ్యాలు, వంటకు వినియోగించే పాత్రలు కూడా చాలా వరకు కల్తీకి దోహదకాలుగా ఉంటున్నాయి. దేశంలో లెడ్ క్రొమేట్ రసాయన మూలకం ఎంతవరకు వ్యాపించిందో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనం లో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి.

దేశంలోని 17 నగరాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించగా దాదాపు అన్ని నమూనాల్లో 14% వరకు లెడ్ క్రొమేట్ లోహం అత్యధిక స్థాయిల్లో ఉన్నట్టు తేలింది. పాట్నా, గువాహటి, చెన్నై నగరాల్లో లెడ్ అవశేషాలు బాగా కనిపించాయి. ఇక పాడి పరిశ్రమలో కీలక పాత్ర వహించే కోఆపరేటివ్‌ల్లో సగానికి సగం అసంఘటిత కార్మికులే ఉంటారు. నెయ్యి వంటి పదార్ధాలను ప్రాసెస్ చేసేది వీరే. 2016 లో పార్లమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం భారతీయులు ప్రతి ముగ్గురిలో ఇద్దరు వినియోగించే పాలలో డిటెర్జెంట్, కాస్టిక్ సోడా, యూరియా, పెయింట్ కల్తీలుగా ఉంటున్నాయని వెల్లడైంది. గత ఆగస్టులో పార్లమెంట్ అందించిన డేటా ప్రకారం 2022 23 లో పరీక్షించిన ఆహార పదార్ధాల నమూనాల్లో కల్తీలు ఉన్నాయని బయటపడింది. ఆహార తనిఖీలు తరచుగా జరగక పోవడం, కల్తీని కనుక్కునే సిబ్బందిలేకపోవడం ఇవన్నీ యథేచ్ఛగా సాగడానికి దోహదమవుతున్నాయి. ఎక్కడైనా, ఏదైనా కల్తీ జరుగుతున్నట్టు తెలిస్తేనే దాడులు చేస్తుంటారు. ఆ ఆహారాన్ని సీజ్ చేస్తుంటారు. ఇటీవల మాగ్గీ మసాలా కేసు, ఈథలిన్ ఆక్సైడ్ కుంభకోణం వెలుగులోకి వచ్చాయి.

అయితే ఏం జరిగిందో దాడులు ఎందుకు చేశారో ఎవరికీ తెలీదు. తిరుపతి లడ్డూ కల్తీ సంఘటన భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినప్పటికీ ఆ ఒక్క క్షేత్రంలోనే ఇలా జరుగుతోందనీ, దీనితో విస్తృతమైన తనిఖీలు, శాస్త్రీయ పరిశోధనలు వల్ల దేశంలో కల్తీ కాటుకు అకస్మాత్తుగా బ్రేకులు పడిపోతాయని కూడా నమ్మలేం. ప్రజల్లో అవగాహనతో పాటు సరైన తనిఖీ వ్యవస్థ ఉన్నప్పుడే కొంతవరకు దీన్ని నివారించగలం. నెయ్యి కల్తీ గురించి కొన్ని క్షేత్రస్థాయి వాస్తవాలు ప్రస్తావించవలసి ఉంది. డైరీ పరిశ్రమలో ఒక కిలో నెయ్యి తయారీకి ఉత్పత్తి వ్యయం రూ. 550 వరకు అవుతుండగా, ఎవరో ఒకరు కల్తీ చేసిన నెయ్యిని కిలో రూ. 345 కే విక్రయిస్తున్నారు. దీని వల్ల వాస్తవంగా నాణ్యమైన నెయ్యి ని తయారు చేసే రైతు, కల్తీ వ్యాపారస్తునితో పోటీ పడలేకపోతున్నాడని ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపీందర్ సింగ్ శోధీ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.

ఇప్పుడు తిరుపతి సంక్షోభం డైరీ ఉత్పత్తులపై వ్యతిరేక ప్రభావం చూపించినా మరోవైపు దీని వల్ల నాణ్యతను పాటించే ప్రముఖ వ్యాపార సంస్థలకు డిమాండ్ కూడా పెరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముక్కూముఖం తెలియని బ్రాండ్ల పాలను, పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనుకాడక తప్పదు. ఆలయాలు, గురుద్వారాలు వంటి ఆరాధనా వ్యవస్థలు తక్కువ ధరకు సరఫరా చేయడానికి సిద్ధపడే బిడ్డర్లను విడిచిపెట్టి, నాణ్యత కోసం ధర ఎక్కువైనా ప్రామాణికాలు పాటించే ప్రముఖ కంపెనీల వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా నాణ్యత పాటించే అసలైన ఉత్పత్తిదారులకు మేలు జరుగుతుందని రూపీందర్ సింగ్ ఈ సందర్భంగా ఉదహరించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News