Sunday, September 15, 2024

మేడారంలో అరణ్య రోదన

- Advertisement -
- Advertisement -

సుడిగాలులకు నేలకూలిన లక్ష వృక్షాలు
టోర్నడో తరహాలో వీచిన గాలులు 
200 హెక్టార్లలో నేలకూలిన చెట్లు
వేర్లతో సహా నేలకొరిగిన 50 వేల చెట్లు
అడవిని పరిశీలించిన పీసీసీఎఫ్ డోబ్రియాల్ 
నిపుణులతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక

వల్లాల వెంకట రమణ
మన తెలంగాణ/ వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంతుచిక్కని ప్రళయం మేడారం అడవుల్లో విధ్వంసం సృష్టించింది. సుడిగాలుల బీభత్సం అడవిని మింగేసింది. ఏళ్ల తరబడి పెరిగిన వేలాది చెట్లు నేలకూలాయి. ములుగు జిల్లా తాడ్వాయి – మేడారం రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఈ సంఘటన అటవీ శాఖ అధికారులకే అంతుచిక్కడం లేదు. టోర్నడో తరహాలో సృష్టించిన ప్రళయంపై అటవీ శాఖ అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. ములుగు జిల్లా ఏ టూరునాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలో తాడ్వాయి – మేడారం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది.

వేలాది ఎకరా ల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో అరుదైన వృక్షాలతోపాటు మెడిసినల్ మొక్కలు కూడా ఉన్నాయి. ప్రధానంగా టేపధానంగా, మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమ ద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చ గంధం మొక్కలన్నీ సుడిగాలి బీభత్సానికి నేలకూలాయి. 200 హెక్టార్లలో 50 వేల వృక్షాలు వేర్లతో సహా నేలకొరిగాయి. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మబ్బులు, గాలి పెద్దగా వీచడం వల్ల సుడిగాలిలా మారి ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. మేడారంలో సుడిగాలి బీభత్సం సృష్టించిన అటవీ ప్రాంతాన్ని స్థానిక డిఎఫ్‌ఓ రాహుల్ జాదవ్ తో కలిసి పీసీసీఎఫ్ డోబ్రియాల్ పరిశీలించారు.

వేలాదిగా వృక్షాలు వేర్లతో సహా నేలకొరగడంతో ఖంగు తిన్నారు. ఇలాంటి పరిణామాన్ని తన 38 ఏళ్ల సర్వీసులో చూడలేదని పేర్కొన్నారు. గతంలో కూడా ఎన్నిసార్లు భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. అటవీ శాఖ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘటనగా ఆయన పేర్కొన్నారు. అడవిలో జరిగిన ప్రళయంపై తేల్చడానికి అటవీ శాఖ రంగంలోకి దిగింది. ఇలా జరగడానికి కారణాలు తెలుసుకునేందుకు వివిధ శాఖలతో సమన్వయం చేసుకునే దిశగా ప్లాన్ చేసింది. ఇప్పటికే ఐఎండి అధికారులతో ప్రాథమికంగా చర్చించారు. క్లైమటాలజీ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నారు. మెట్రో లాజికల్ డేటా వచ్చిన తర్వాత అధ్యయనం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

టోర్నడో తరహాలో….
అడవిలో సృష్టించిన ప్రళయం అటవీ శాఖ అధికారులను షాక్ కు గురిచేసింది. కొద్దిమొత్తంలో జరిగిందని భావించిన నేపథ్యంలో డ్రోన్లతో పరిశీలిస్తే వందలాది ఎకరాల్లో వేలాది మొక్కలు నేలకొరిగాయి. అమెరికా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఈస్ట్రన్ చైనా, జపాన్, అర్జెంటీనా లాంటి దేశాల్లో టోర్నడో లు వస్తాయని, ఇక్కడ అలాంటి ఛాన్స్ లేదని అధికారులు చెబుతున్నారు. అయితే మనదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో సుడిగాలులు చుట్టుముట్టి అతలాకుతలం చేస్తాయని పేర్కొంటూ తొలిసారి ఇక్కడ వచ్చిందని చెబుతున్నారు. వర్షానికి తోడుగా మబ్బు, పెద్ద గాలి దగ్గరగా రావడంతో సుడిగాలిగా మారి ప్రళయం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నష్టం లెక్కల్లో అధికారులు..
అడవిలో జరిగిన బీభత్సంతో జరిగిన నష్టం అంచనాకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నాలుగు రోజుల పాటు అధికారులు అడవిలో తిరిగి నేలకొరిగిన ప్రతి మొక్కను పరిశీలిస్తారని డిఎఫ్‌ఓ రాహుల్ జాదవ్ తెలిపారు. సిబ్బందిని ఇప్పటికే రెడీ చేశామని, లెక్కల తర్వాత నష్టం అంచనాతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. ఏడాది మొక్కలతో పాటుగా 70 ఏళ్ల వయసు ఉన్న మొక్కలు కూడా వేర్లతో సహా నేలకొరిగాయని చెప్పారు. ఇదే సుడిగాలి కనుక మేడారం గ్రామాన్ని చుట్టుముడితే పెను ప్రమాదం సంభవించేదని, సమ్మక్క -సారలమ్మ దయతో ప్రమాదం తప్పిందని డిఎఫ్‌ఓ రాహుల్ జాదవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News