Sunday, March 26, 2023

ఎండోమెట్రియాసిస్ నివారిణి “డైక్లోరోఎసిటేట్ ”… బ్రిటన్‌లో ట్రయల్స్

- Advertisement -

మహిళలకు ఇదో గొప్పవరం
మహిళల్లో ఎండొమెట్రియాసిస్‌కు సమర్ధమైన కొత్త చికిత్స లభించనుండడం ఒక విధంగా గొప్పవరం. ఈమేరకు జరుగుతున్న క్లినికల్ ట్రయల్‌పై డాక్టర్లు ఆశతో ఉన్నారు. డైక్లోరోఎసిటేట్ (dichloroacetate) ఔషధం ఎంతవరకు ఎండోమెట్రియాసిస్‌కు పనిచేస్తుందో అని తెలుసుకోడానికి ఎడిన్‌బర్గ్, లండన్‌ల్లో ట్రయల్స్ చేపట్టారు. ఇందులో వందమంది మహిళలను చేర్చారు. ఎండోమెట్రియాసిస్ వ్యాధి నెలసరితో సంబంధం ఉన్న ఒక రుగ్మత. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలుచని పొర (tissue ) ఇతర అవయవాలలో కూడా ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం. ఫెలోపియన్ ట్యూబ్స్ (అండాలను అండాశయం నుండి గర్భాశయానికి తీసుకెళ్లే నాళం ) , కటిభాగం (pelvis ), పెద్దపేగులు, చిన్నపేగులు, యోని (వ్జైనా) లలో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు.

అరుదుగా ఊపిరితిత్తుల్లో , కళ్లల్లో , వెన్నెముకలో, మెదడులో కూడా ఏర్పడవచ్చు. ఇప్పటివరకు అది కనబడని ఒకే ఒక చోటు ప్లీహం (spleen) . ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు విపరీతమైన నొప్పి ( ముఖ్యంగా కటి భాగంలో) . అలసట, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం. ఇప్పుడు చేపట్టిన ట్రయల్స్ సక్సెస్ అయితే ఇది మొట్టమొదటి నాన్ హార్మోనల్ (non hormonal ) అంటే హార్మోన్లతో సంబంధం లేని, నాన్ సర్జికల్ (non surgical) అంటే శస్త్రచికిత్సతో సంబంధం లేని మొట్టమొదటి గొప్ప ఎండోమెట్రియాసిస్ వైద్యచికిత్సగా చరిత్ర సృష్టిస్తుంది. ఎండోమెట్రియాసిస్‌తో బాధపడే మహిళలు చాలా రకాలైన వైద్యచికిత్సలను కోరుకుంటుంటారు. బలహీనపరిచే నొప్పిని తగ్గించే మార్గాల గురించి ఆలోచిస్తుంటారు. అయితే పరిశోధకులు చేపట్టిన ఈ ట్రయల్స్‌లో డైక్లోరోఎసిటేట్ ఔషధం సత్ఫలితాలు అందిస్తోందని, మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలదన్న ఆశ కలుగుతోందని పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ లూసీ విటాకర్ చెప్పారు.

ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీలో గైనకాలజీ క్లినికల్ లెక్చరర్‌గా లూసీ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సంప్రదాయ వైద్యంలో బాధను తగ్గించే మాత్రలు వాడుతుంటారు. అలాగే హార్మోనల్ కాంట్రాసెప్టివ్‌లు వాడుతుంటారు. అవసరమైతే సర్జరీ చేస్తుంటారు. హార్మోన్ ఆధారిత చికిత్సలో మాత్ర కానీ కాంట్రాసెప్టివ్ అమర్చడం కానీ చేయడంతో దుష్ప్రభావాలు ఎదురవుతున్నాయి. అదీకాక ప్రతివారికీ ఇవి అనుకూలం కావడం లేదు. సర్జరీ చేయించుకున్న వారిలో సగానికి సగం మందికి అయిదేళ్ల లోనే అవలక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనాల్లో బయటపడింది. ఎండోమెట్రియాసిస్ లక్షణాలపై సరైన అవగాహన చాలా మంది మహిళల్లో లేదు. మొట్టమొదటి సారి ఈ లక్షణాలు కనిపించిన మహిళ దీన్ని గుర్తించడానికి బ్రిటన్‌లో కొంతమంది మహిళలకు ఎనిమిదేళ్లు పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రపంచంలో 17.6 కోట్ల మంది ఎండొమెట్రియాసిస్ బాధితులు

ఎండో మెట్రియాసిస్ పై సరైన పరిశోధనలు జరగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 17.6 కోట్ల మంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. బ్రిటన్‌లో 1.5 మిలియన్ మంది మహిళలు దీనితో సతమతమవుతున్నారు. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే పునరుత్పత్తి వయసులో ఉన్న ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి ఈ రుగ్మత ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా దీని పరిశోధనకు ఏడాదికి 6 మిలియన్ డాలర్లు అంటే రూపాయిల్లో రూ. 42. 64 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఎండో మెట్రియాసిస్ వల్ల బాధపడే ప్రతిరోగి ఏడాదికి సగటున 8,600 పౌండ్లు (సుమారు రూ.7.82 లక్షలు ) ఆరోగ్యంపై ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంటే రోజుకు 23.45 పౌండ్లు (సుమారు రూ 2,132)… అంటే ఒక్కొక్కరు అన్ని రకాల మందులు వాడాల్సి వస్తోంది. అంతేకాదు దీనివల్ల పిల్లలు పుట్టకుండా పోయే ప్రమాదం ఉంది. ఎండోమెట్రియాసిస్ నొప్పుల కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు జరగొచ్చు. శరీరం బలహీనమై, ఇతర రకాల నొప్పులకు దారి తీయవచ్చని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News