Friday, March 29, 2024

సరైన చికిత్స లేని నెలసరి రోగం ఎండోమెట్రియాసిస్

- Advertisement -
- Advertisement -

ఎండోమెట్రియాసిస్ మహిళల నెలసరితో సంబంధం ఉన్న రుగ్మత. గర్భకోశం లోపల మాత్రమే ఉండాల్సిన కణజాలంతో కూడిన పలుచని పొర… ఇతర అవయవాలతో కూడా ఏర్పడడమే ఈ రుగ్మతకు కారణం. ఫెలోపియన్ ట్యూబ్స్ (అండాలను అండాశయం నుండి గర్భాశయానికి తీసుకెళ్లే నాళం) , కటి భాగం ( పెల్విస్ ), పెద్ద పేగులు , చిన్నపేగులు, యోని (వ్జైనా)లలో ఎక్కడైనా ఈ పొర ఏర్పడవచ్చు. అరుదుగా ఊపిరితిత్తుల్లో, కళ్లల్లో, వెన్నెముకలో, మెదడులో కూడా ఏర్పడవచ్చు.ప్లీహం ( స్ప్లీన్ )లో మాత్రం ఇప్పటివరకు ఇది కనిపించడం లేదు.

ముఖ్యంగా కటి భాగంలో విపరీతమైన నొప్పి ఉండడం ఈ రుగ్మత ప్రధాన లక్షణం. దీంతోపాటు అలసట, నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావం కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 17.6 కోట్ల మంది మహిళలు ఈ వ్యాధితో సతమతమవుతున్నారని ఒక అంచనా వల్ల తెలుస్తోంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే పునరుత్పత్తి వయసులో ఉన్న ప్రతి పదిమంది మహిళల్లో ఒకరికి ఈ సమస్య ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

అయినప్పటికీ దీని పరిశోధనకు ఏడాదికి 6 మిలియన్ డాలర్లు ( రమారమి రూ,. 42.64 కోట్లు )మాత్రమే కేటాయిస్తున్నారు. ఎండోమెట్రియాసిస్ బాధితులు ఏడాదికి సగటున 8600 పౌండ్లు ( సుమారు రూ.7.82 లక్షలు ) అంటే రోజుకు 23.45 పౌండ్లు ( సుమారు రూ. 2132 ) ఆరోగ్యంపై ఖర్చు పెట్టాల్సి వస్తోందని పది దేశాల్లో జరిపిన పరిశోధనల వల్ల తేలింది. ఎండోమెట్రియాసిస్ నొప్పుల కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థలో మార్పులు జరగవచ్చని, శరీరం బలహీనమై, ఇతర రకాల నొప్పులు కలిగించే పరిస్థితి ఏర్పడవచ్చని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చెకొస్లొవేకియాకు చెందిన కార్ల్ వాన్ రోకితన్సీ ఈ వ్యాధిని మొదట 1860 లో కనుగొన్నారు. అంతకన్నా ముందే ఈ రోగ లక్షణాలను చాలా ప్రాచీన కాలం లోనే గుర్తించిన దాఖలాలు ఉన్నాయి. హిస్టీరియా లక్షణాలకు వీటికి దగ్గర పోలికలు కనిపిస్తాయి. హిస్టీరియా అనే పదానికి గర్భకోశ సంబంధమని అర్థం. హిస్టీరియాగా మొదట భావించి తరువాత కాదన్న కేసులు ఎండోమెట్రియాసిస్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎండో మెట్రియాసిస్‌ను తక్కువగా అంచనా వేస్తున్నారు. దీనిపై పరిశోధనలు అంతగా జరగడం లేదు. ఈ రుగ్మతకు కారణాలేమిటో ఇప్పటికీ చెప్పలేక పోతున్నారు.

అలాగే దీనికి చికిత్స కూడా సరిగ్గా తెలియడం లేదు. వైద్యులు దీన్ని ఎండోమెట్రియాసిస్ అని గుర్తించడానికి పదేళ్లు పడుతోంది. కచ్చితంగా తెలియాలంటే లాప్రోస్కోప్ తప్ప మరో మార్గం లేదు. ఇది సాధారణమైన నొప్పి అని నిర్లక్షం చేయడమే సమస్య ఇంతలా తయారవడానికి కొంత కారణం. రుతుస్రావం గురించి తప్పుడు అవగాహన వల్ల చాలా మంది స్త్రీలకు అది ఎంత నొప్పిగా ఉంటుందో తెలియడం లేదు. ఈ నొప్పి గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి.

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2017లో ఒక ప్రణాళిక రూపొందించింది. ఎండో మెట్రియాసిస్‌పై అవగాహన పెంచడం, కొత్త చికిత్స పద్ధతులను పెంపొందించడం, దీనికోసం వ్యయం 4.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లకు పెంచడం ఈ ప్రాజెక్టులో లక్షాలు. అంతేకాక కొత్త క్లినికల్ మార్గదర్శకాలను రూపొందించడం, మరీ ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య వైద్య విద్యలో దీన్ని భాగం చేయడం వంటి చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News