Saturday, September 30, 2023

రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు.

క్రేన్ల ద్వారా పట్టాలు తప్పి పడిపోయిన బోగీలను ట్రాకుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం వెనుక మూల కారణాన్ని వెలికితీసేందుకు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని వైష్ణవ్ చెప్పారు. భవిష్యుత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

కాగా..ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరులతో మాట్లాడుతూ సహాయక, పునరుద్ధరణ చర్యలలో రైల్వే ఉద్యోగులకు సహకరించవలసిందిగా స్థానికులు పిలుపునిచ్చారు. సహాయక చర్యలలో తోడ్పడుతున్నందుకు స్థానికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇదిలా ఉండగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమాద స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యల గురించి సమీక్షించనున్న ఆమె ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ ప్రయాణికులను పరామర్శించనున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరుకున్నట్లు ఆగ్నేయ రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని వారు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వారు వివరించారు.

ప్రమాదంలో 900 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని గోపాల్‌పూర్, ఖాంతాపర, బాలాసోర్, భద్రక్, సోరో, కటక్ ఎస్‌సిబి ఆసుపత్రులలో చేర్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News