Tuesday, April 16, 2024

నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు

- Advertisement -
- Advertisement -

నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లు
పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు
హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో 10 వేలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ పడకలు
మనతెలంగాణ/హైదరాబాద్: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) విస్తరణకు రూ.1,571 కోట్ల నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ ఆసుపత్రికి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రిలో ప్రతి రోజు కొన్ని వేల మంది వైద్యం చేయించుకుంటుంటారు. నిమ్స్ ఆసుపత్రి అభివృద్ధి ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలతో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
10 వేలకు చేరువలో సూపర్‌ స్పెషాలిటీ పడకలు
రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తాజాగా 2 వేల పడకల నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు రూ.1,571 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే నిమ్స్‌లో 1,800 పడకలు ఉండగా, 4 వేల పడకలతో నగరం నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రులను ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే వరంగల్‌లో 2 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తోంది. దాంతో రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ పడకలు 10 వేలకు చేరువ కానున్నాయి. నిమ్స్ విస్తరణలో భాగంగా 2 వేల ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయనుండగా, అందులో 500 ఐసియు పడకలు, 42 స్సెషాలిటీ విభాగాలు ఉంటాయి. వీటితోపాటు సూపర్‌స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సెస్ శిక్షణ అందుబాటులోకి రానున్నాయి.
ఆరోగ్య తెలంగాణ కోసం మరో ముందడుగు: మంత్రి హరీశ్‌రావు
నిమ్స్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,571 కోట్ల నిధులు కేటాయించడంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చర్యల్లో ఈ నిర్ణయం మరో ముందడుగు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజనరీ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

TS Govt allocates Rs 1571 crore to expansion of NIMs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News