Tuesday, April 30, 2024

అతివేగానికి ఏడుగురు బలి..

- Advertisement -
- Advertisement -

అడ్డగూడూరు:  కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు.. గమ్యస్థానాలకు సమీపంలోనే ఉన్నారు.. కానీ అతివేగం వారిని మృత్యుఒడికి చేర్చింది. ఓచోట కారు ప్రయాణం ముగ్గురు అమాయకులను బలితీసుకోవడంతో పాటు కారులోని మరో ఇద్దరిని బలిగొంది. మరో చోట గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ఆర్‌టిసి బస్సు ఓవర్‌స్పీడ్‌గా నడపటం.. బస్సు పక్కనే ఉన్న గుంటలో పడిపోవడంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకేరోజు రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలతో అందరూ ఉలిక్కిపడ్డారు. నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో ద్విచక్రవాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఐదురుగు మృతిచెందారు. అతివేగంగా ఉన్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

ద్విచక్రవాహనంపై వెళుతున్న పి.ఏ.పల్లి మండలం అక్కంపల్లికి చెందిన మద్దిమడుగు ప్రసాద్(38), మద్దిమడుగు అవినాష్(12) తండ్రికొడుకులు అక్కడికక్కడే చనిపోయారు. ద్విచక్రవాహనంపై ఉన్న మృతుడు ప్రసాద్ భార్య రమణ(35) చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడటం అందరినీ కలచివేసింది. అంతేకాకుండా కారులోని పట్నం మణిపాల్(18), వనం మల్లిఖార్జున్(18)లు దేవరకొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. పులి పవన్, వరాల మణివర్థన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. కారు టైరుపేలడం ఎదురుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న అమాయకులు మృతి చెందడం.. ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం సమీపంలో ఆర్‌టిసి బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంటలో ఫల్టీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

బీబీనగర్ గ్రామానికి చెందిన కోటమర్తి గ్రామకార్యదర్శిగా పని చేస్తున్న కొండా రాములు(56), అడ్డగూడూరు మండలం చినపడిశాలకు చెందిన చుక్క యాదమ్మ(50)లు మరణించారు. ఆర్‌టిసి బస్సు డ్రైవర్ అతివేగమే ఇద్దరి ప్రాణాలను బలిగొందని ప్రయాణికులు చెపుతున్నారు. బస్సు ఫల్టీ కొట్టిన సమయంలో బస్సులో 33మంది ప్రయాణిస్తున్నారు. అయితే ఇద్దరు చనిపోగా మరికొందరికి గాయాలయ్యాయి. పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఓ పక్క కారు అతివేగం.. మరోపక్క ఆర్‌టిసి డ్రైవర్ ఓవర్‌స్పీడ్ ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News