Friday, March 29, 2024

ఆ కారణంతో ఆర్టీసి డ్రైవర్ రాజయ్య ఆత్మహత్య చేసుకోలేదు: సజ్జనార్

- Advertisement -
- Advertisement -

డ్యూటీ మార్పు చేయలేదన్న కారణంతో రాజయ్య ఆత్మహత్య చేసుకోలేదు
టిఎస్ ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవం
మృతుడు రాజయ్య అభ్యర్థన మేరకే ఆయన్ను జేబిఎస్‌కు బదిలీ చేశాం
రాజయ్య అంత్యక్రియలకు వారి కుటుంబసభ్యులకు రూ.20 వేలు అందచేశాం
టిఎస్ ఆర్టీసి విసి, ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి డ్రైవర్ ఆత్మహత్యపై వచ్చిన వార్తలు అవాస్తవమని టిఎస్ ఆర్టీసి విసి, ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో డ్రైవర్ జి. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు చేయకపోవడమే కారణమని వస్తున్న వార్తలు పూర్తి నిరాధారమని ఆయన తెలిపారు. రాజయ్య అభ్యర్థన మేరకే మూడు నెలల క్రితం జేబిఎస్‌కు బదిలీ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాజయ్య కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారని, తన కుటుంబం అక్కడే ఉంటోందని, జేబిఎస్‌కు బదిలీ చేయాలని రాజయ్యే అభ్యర్థించారని ఆయన తెలిపారు. జేబిఎస్ డ్యూటీని మార్పు చేయమని అధికారులను రాజయ్యను ఎప్పుడూ అడగలేదన్నారు. రాజయ్య కూతురు రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటుందని,
ఆమె ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిందని త్వరలోనే ఆమె ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాల్సి ఉందని ఆయన తెలిపారు. కూతురు వచ్చినందుకు రాజయ్య ఒక వారం సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేశామని, రాజయ్య ఈనెల 23వ తేదీ వరకు విధులు నిర్వర్తించారని సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులకు విజ్ఞప్తి
గోదావరిఖనిలోని తన స్వగృహంలో వ్యక్తిగత కారణాలతో రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం తమకు అందిందని ఎండి పేర్కొన్నారు. ఆత్మహత్య విషయం తెలియగానే గోదావరిఖని డిపో మేనేజర్, మృతుడు రాజయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారన్నారు. అంత్యక్రియల నిమిత్తం టిఎస్‌ఆర్టీసీ తరుపున స్వయంగా రూ.20 వేలను కుటుంబసభ్యులకు అందజేసినట్టు ఆయన తెలిపారు. రాజయ్య ఆత్మహత్యకు డ్యూటీ మార్పు కారణమని కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ప్రస్తావన రాలేదని, డ్యూటీ మార్పు కోసం గోదావరిఖని డిపోలో ఆయన ఎవరినీ సంప్రదించలేదని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, వాస్తవాలను తెలియజేయాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. డ్యూటీ మార్పు చేయలేదన్న కారణంతో రాజయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తోన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనమని ఆయన పేర్కొన్నారు.

సంస్థ నిబద్ధతతో కట్టుబడి ఉంది
టిఎస్ ఆర్టీసి సిబ్బంది సంక్షేమానికి సంస్థ నిబద్ధతతో కట్టుబడి ఉందని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలను చేపడుతోందని, సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ఏకపక్ష వార్తలను ప్రచురించడం సరికాదని ఆయన జర్నలిస్టులకు సూచించారు. ఆర్టీసి మీద నిరాధార వార్తలు రాసేముందు, ప్రచురించే ముందు సంబంధిత అధికారుల వివరణ తీసుకోవాలని మీడియా సంస్థల ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

TSRTC Driver Rajaiah Suicide in Peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News