Saturday, September 21, 2024

టిఎస్ ఆర్టీసి చరిత్రలో ఆల్ టైం రికార్డు ఆదాయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాఖీ పౌర్ణమి పర్వదినం రోజున రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సరికొత్త రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది. ఆర్టీసి చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డుగా అధికారులు తెలిపారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి రాఖీ పౌర్ణమికి కూడా సంస్థకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక్క రోజులో దాదాపు 41 లక్షల మంది ప్రయాణికులు సంస్థ బస్సుల్లో రాకపోకలు సాగించారు. గతేడాది రాఖీ పండుగ(12.08.2022) రోజున రూ.21.66 కోట్ల ఆదాయం రాగా, ఈ సారి దాదాపు రూ.కోటి వరకు అదనపు ఆదాయం ఈ సంస్థ ఆర్జించింది.

ఈ రాఖీ పౌర్ణమి రోజున రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది టిఎస్ ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించారు. గతేడాది కన్నా లక్ష మంది అదనంగా బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే, గత రాఖీ పండుగతో పోల్చితే 1.23 లక్షల కిలోమీటర్లు అదనంగా ఈ సారి ఆర్టీసి బస్సులు తిరిగాయని, 2022 సంవత్సరంలో రాఖీ పండుగ రోజున బస్సులు 35.54 లక్షల కిలోమీటర్లు తిరగ్గా ఈ సారి 36.77 లక్షల కిలో మీటర్లు మేర తిరిగాయని అధికారులు తెలిపారు.

20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్
ఆక్యుపెన్సీ రేషియా (ఓఆర్) విషయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా గతేడాది రికార్డును తిరగరాసింది. 2022 సంవత్సరం రాఖీ పండుగ రోజు 101.01 ఓఆర్ సాధించగా, ఈ సారి 104.68 శాతం రికార్డు ఓఆర్‌ను నమోదు చేసింది. ఆ జిల్లా పరిధిలోని 7 డిపోల్లో నార్కెట్ పల్లి మినహా మిగతా డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్ సాధించాయి. నల్లగొండ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రాఖీ పౌర్ణమికి 97.05 శాతం ఓఆర్ నమోదయ్యాయి. ఆ జిల్లాలో 9 డిపోలు ఉండగా 6 డిపోలు 100కిపైగా ఓఆర్ సాధించడం విశేషం. అలాగే, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓఆర్ నమోదైంది.

20 డిపోల్లో 100 శాతం ఓఆర్ నమోదు
రాఖీ పౌర్ణమి రోజున రాష్ట్రంలోని 20 డిపోల్లో ఓఆర్ 100 శాతానికి పైగా దాటింది. ఆయా డిపోల్లో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. హుజురాబాద్, నల్లగొండ, భూపాలపల్లి, హుస్నాబాద్, పరకాల, కల్వకుర్తి, తొర్రూర్, మహబుబాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, యాదగిరి గుట్ట, గజ్వేల్ -ప్రజ్ఞాపూర్, కోదాడ, నర్సంపేట, సూర్యాపేట, దుబ్బాక, జనగామ, సిద్దిపేట, గోదావరిఖని, షాద్‌నగర్ డిపోలు 100 శాతానికిపైగా ఓఆర్‌ను సాధించాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో అత్యధికంగా ఒక కిలోమీటర్‌కు రూ.65.94లను వరంగల్-1 డిపో, రూ.65.64ను భూపాలపల్లి డిపో సాధించింది. ఈ రెండు కూడా సంస్థ చరిత్రలోనూ ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ (ఈపీకే) ఆల్ టైం రికార్డు సాధించడం గమనార్హం.

ప్రయాణికులకు కృతజ్ఞతలు
అధిక రాబడి రావడానికి సహకరించిన ప్రయాణికులకు టిఎస్ ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండి విసి సజ్జనార్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, పోత్సాహం వల్ల ఈ సారి ఎన్నో రికార్డులు నమోదయ్యాయని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసిల చరిత్రలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రాలేదని, గతేడాది రాఖీ పండుగ రోజున 12 డిపోలు మాత్రమే 100 శాతానికిపైగా ఓఆర్ సాధించగా ఈ సారి 20 డిపోలు నమోదు చేశాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.

ప్రజలందరూ పండుగలు చేసుకుంటుంటే సంస్థ సిబ్బంది మాత్రం విధుల్లో నిమగ్నమై వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారన్నారు. అందుకు రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తున్నారని వారు కితాబునిచ్చారు. సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, దసరా, తదితర ప్రధాన పండుగల్లో సిబ్బంది త్యాగం ఎనలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రోత్సాహన్ని స్పూర్తిగా తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి భవిష్యత్ లోనూ మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలందించాలని చైర్మన్, ఎండిలు సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News