Saturday, April 27, 2024

జాతీయ కాంగ్రెస్ శంఖారావం

- Advertisement -
- Advertisement -

14 ఎంపి స్థానాల్లో గెలుద్దాం..
సోనియమ్మకు కానుకగా ఇద్దాం
సర్వేలు, అభిప్రాయాల తర్వాతే
అభ్యర్థుల ఎంపిక పదేళ్లలో
తెలంగాణకు మోడీ ఏంచేశారో
చెప్పాలి కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే
మనకు ప్రత్యేక నిధులొస్తాయి
సమన్వయ కమిటీలు వేసుకోండి..
భవిష్యత్‌లో వాటినే ఇందిరమ్మ
కమిటీలుగా మారుస్తాం
చేవెళ్ల నియోజకవర్గ స్థాయి
ముఖ్యనేతల సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వచ్చే నెల 6 లేదా 7న తుక్కుగూడలో
జనజాతర సభ, అక్కడి నుంచే జాతీయ గ్యారంటీలు
హాజరుకానున్న ఎఐసిసి చీఫ్ ఖర్గే, రాహుల్‌గాంధీ

మా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం

మనతెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచే దేశ రాజకీయాలకు, పార్లమెంట్ ఎన్నికల జైత్రయాత్రకు శంఖారావం పూరించబోతున్నామని సిఎం, పిసిసి చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జూబ్లీహిల్స్ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నామని, మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7 న జాతీయస్థాయి గ్యారంటీలను ప్రకటించుకోబోతున్నామని ఆయన తెలిపారు.

ఈ జనజాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలన్న పట్టుదలతో ఉన్నామన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని, పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.

పదేళ్లలో తెలంగాణకు మోడీ ఏమీ చేయలేదు..?

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు రాష్ట్రంలో తమ పార్టీ వంద రోజుల పాలనకు రెఫరెండంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. పదేళ్లపాటు ప్రధానిగా ఉన్న మోడీ మన ప్రాంతానికి ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు. మూసీలో చెత్త పేరుకుపోయినా పట్టించుకోని మోడీ, సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్‌లో కట్టుకున్నారని, మన మూసీకి నయాపైసా ఇవ్వలేదని సిఎం రేవంత్ ఆరోపించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్రం మోకాళ్లు ఎందుకు అడ్డుపెట్టిందో బిజెపి నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఐటిఐఆర్ ఇస్తే మోడీ దానిని అడ్డుకున్నారని సిఎం రేవంత్ ఆరోపించారు. గుజరాత్‌కు అనేక రైళ్లు తీసుకుపోయిన ప్రధాని వికారాబాద్‌కు ఎంఎంటిఎస్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. పదేళ్లు అదికారంలో ఉన్న మనకు ఎలాంటి న్యాయం చేయని మోడీని చూసి మరోసారి ఓటెయ్యమని బిజెపి నేతలు అడుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇవ్వరని బిజెపి నేతలు గుర్తుంచుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతారని అన్నారు. చేవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి మంచోడు చూసి ఓటెయ్యాలని ఆయన కోరారు.

అందరి అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక

అందరి అభిప్రాయం సర్వే నివేదికల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన స్పష్టం చేశారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుందని రకాలుగా ఆలోచించి చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరిలో సునీతారెడ్డి, సికింద్రాబాద్‌కు దానం నాగేందర్‌కు టికెట్‌లు కేటాయించామన్నారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నందున మన ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి పార్టీ ఎంపి అభ్యర్థులను గెలిపించాలన్నారు. మన అభ్యర్థులు ఎంపిలుగా ఢిల్లీలో ఉంటే మనకు తోడుగా, అభివృద్ధికి నీడగా ఉంటారన్నారు. కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మనకు ప్రత్యేక నిధులు వస్తాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో సమన్వయ కమిటీని వేసుకోవాలన్నారు.

శాసనసభ, మండల, గ్రామ, బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు వేయాలని వాటినే ఇందిరమ్మ కమిటీలుగా గుర్తించి భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మనకు అవగాహన వస్తుందన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేసుకుందామని, వికారాబాద్‌కు ఎంఎంటిఎస్, పారిశ్రామిక అభివృద్ధి, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ రోడ్డు విస్తరణ పూర్తి చేసుకుందామని అన్నారు. కాగా, లోక్‌సభ పరిధిలోని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి, శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి, కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, డిసిసి అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News