ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడిగుడ్ల లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు మండలం కొప్పోలులో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో ట్రాఫిక్ లో ఆగిన కారును వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహయాక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.