Saturday, April 20, 2024

హడలెత్తించిన భారత బౌలర్లు: 41 ఆలౌట్.. ఐదుగురు డకౌట్

- Advertisement -
- Advertisement -

బ్లూమ్ ఫోంటిన్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌ 2020లో భారత యువ జట్టు అదరగొడుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్‌ను 41 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 4.5 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్‌ఎలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పసికూన జపాన్‌ను భారత బౌలర్లు హడలెత్తించారు. ఏమాత్రం అనుభవం లేని జపాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడి పోయింది. స్పిన్నర్ రవి బిష్ణోయి అసాధారణ రీతిలో చెలరేగి పోయాడు. అతని ధాటికి జపాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తి పోయారు. మరోవైపు స్పీడ్‌స్టర్లు కార్తిక్ త్యాగి, ఆకాశ్ సింగ్‌లు కూడా అద్భుత బౌలింగ్‌తో తమ వంతు పాత్ర పోషించారు. రవి బిష్ణోయి 8 ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో మూడు మెయిడిన్ ఓవర్లు కూడా వేశాయి. రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే రెండేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు కార్తీక్ కూడా అసాధారణ బౌలింగ్‌ను కనబరిచాడు. ఆరు ఓవర్లలో పది పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆకాశ్ సింగ్ కూడా మెరుగైన బౌలింగ్‌తో అలరించాడు. 4.5 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను తీశాడు.
ఐదుగురు డకౌట్
మరోవైపు జపాన్ జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. జపాన్ జట్టులో ఒక్కరూ కూడా రెండంకెలా స్కోరును అందుకోలేక పోయారు. ఓపెనర్ ఓపెనర్ షు నగోచి (7), కెంటో ఒటా (7), మాక్స్ క్లెమెంట్స్ (5) పరుగులు సాధించారు. మిగిలిన ముగ్గురు ఒక్కో పరుగు చొప్పున చేశారు. ఇక ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రం వరుస క్రమంలో ఒకరి వెంట ఒకరూ పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్ల తర్వాత వచ్చిన ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకరూ కూడా కనీసం ఖాతా తెరవకుండానే ఔట్ కావడం విశేషం. ఇక, ఈ మ్యాచ్‌లో జపాన్ బ్యాట్స్‌మెన్ అందరూ కలిపి చేసిన పరుగులు 22 మాత్రమే. మిగిలిన 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే లభించాయి. దీన్ని బట్టి భారత బౌలర్లు ఏ స్థాయిలో జపాన్‌ను హడలెత్తించారో ఊహించుకోవచ్చు. భారత బౌలర్ల ధాటికి జపాన్ 22.5 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. ఇదే సమయంలో అండర్19 క్రికెట్‌లో మూడో అత్యల్ప స్కోరును సాధించిన జట్టుగా జపాన్ నిలిచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29), కుమార కుశాగ్ర (13) పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు పది వికెట్ల విజయాన్ని అందించారు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన రవి బిష్ణోయికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది.

U19 World Cup 2020: Japan 41 All Out against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News