Tuesday, April 30, 2024

రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయ కుటుంబాలకు షాక్

- Advertisement -
- Advertisement -

ఫ్యామిలీ వీసా కటుతరం
వార్షిక వేతన పరిమితి పెంపు
55 శాతం మేర హెచ్చింపు అమలు
కనీస వార్షిక వేతనం 29000 పౌండ్లు
రిషి సునాక్ అత్యంత కీలక నిర్ణయం
భారతీయ కుటుంబాలకు షాక్

లండన్ : బ్రిటన్ ప్రభుత్వం కుటుంబ వీసా నిబంధనలను కటుతరం చేసింది. బ్రిటన్‌లో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్న వారు భారతీయ సంతతివారైనా ఇతరులైనా తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడం ఇప్పుడిక సులువు కాదు. ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయ పరిమితిని 55 శాతానికి పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి వలసలను అరికట్టాలనే విధాన నిర్ణయాలలో భాగంగా ఈ నిర్ణయం అమలులోకి తీసుకువచ్చారు. వేతన లేదా ఆదాయ పరిమితి వార్షిక స్థాయి పెంపుదలతో ఇక ఫ్యామిలీవీసాకు దరఖాస్తు చేసుకునే వారి కనీస వార్షిక వేతనం ఇకపై 29000 పౌండ్లు (జిబిపి) ఉండాల్సిందే.

ఇంతకు ముందు ఇది 18,600 పౌండ్లు ఉండేది. ఫ్యామిలీ వీసా వార్షిక వేతన పరిమితిని పెంచాలని రిషి సునాక్ ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. దీనిని స్కిల్డ్ వర్కర్స్ వీసాతో సమానం చేయాలని తలపెట్టారు. కాగా ఈ విషయం ఇప్పుడు ఈ నెల 11వ తేదీ నుంచి అమలులోకి వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. బ్రిటన్‌లో ఆదాయం స్థాయిని బట్టే ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను దేశానికి తీసుకురావడం లేదా ఇక్కడ వారికి ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. దేశంలోకి చట్టపరమైన వలసల ప్రక్రియతోనే తలెత్తుతున్న పలు సమస్యల నియంత్రణకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమని వెల్లడైంది.

రిషి సునాక్ ప్రభుత్వం తమ దేశంలోని టాక్స్ పేయర్స్‌కు వలసదార్ల వల్ల అదనపు భారం పడకుండా చేసేందుకు సంకల్పించిందని అధికారవర్గాలు తెలిపాయి. సామూహిక వలసలు చట్టబద్ధంగానే జరుగుతున్నాయి. దీనికి సహేతుక పరిష్కారం అవసరం. బ్రిటిషర్లందరికి ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి నిర్ణయం తప్పడం లేదని హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు. కాగా వచ్చే సంవత్సరం నుంచి వార్షిక వేతన పరిమితిని 38000 పౌండ్లకు పెంచాలని కూడా ముందుగా నిర్ణయించారు.

దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ప్రతిపాదనను సవరించారు. ఇక ఇప్పుడు తీసుకున్న వార్షిక వేతన పరిమితి పెంపుదలతో వలసల సంఖ్య ఏడాదికి కనీసం మూడు లక్షల వరకూ తగ్గుతాయని అధికార వర్గాలు విశ్లేషించాయి. అయితే ఈ క్రమంలో ఈ నిర్ణయ ప్రభావం ఎక్కువగా భారతదేశం నుంచి ఈ ఫ్యామిలీ వీసాలపై వచ్చే వారిపైనే పడుతుంది. బ్రిటన్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. 2022లో ఈ ఫ్యామిలీ వీసాల ద్వారా బ్రిటన్‌లోకి చట్టబద్ధంగానే, నిబంధనల పరిధిలోనే ప్రవేశించిన వలసదార్ల సంఖ్య రికార్డు స్థాయిలో 7,45,000కు చేరారు. ఇది దేశ పౌరులకు పలు స్థాయిల్లో ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దీనితో పలు విషయాలను విశ్లేషించుకుని ఈ నిర్ణయానికి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News