Thursday, March 28, 2024

గల్ఫ్‌లో ట్రంప్ చిచ్చు

- Advertisement -
- Advertisement -

 invasion

 

యుద్ధ మేఘాలు
బాగ్దాద్‌పై అమెరికా దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక అధికారి మృతి
తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్ అధినేత
అమెరికా ఇరాన్‌ల మధ్య ఇంతకాలం నివురగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్త వాతావరణం ఒక్కసారిగా భగ్గుమన్నది. శుక్రవారం వేకువజామునే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో పెంటగాన్ వైమానిక హెలీకాప్టర్‌లు ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన రాకెట్ దాడులలో ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి సైనిక కమాండర్ ఖాసెమ్ సులేమానీ మృతిచెందారు. దాడి జరిగిన వెంటనే ట్రంప్ విజయసంకేతంగా ట్విట్టర్‌లో అమెరికా జెండాను ఉంచారు. బాగ్దాద్ విమానాశ్రయం రోడ్డులో వెళుతున్న సులేమానీ కారుపై అమెరికా దాడులు జరిగాయని ఇరాన్ ప్రతినిధి చెప్పారు. దాడిలో సులేమానీతో పాటు డిప్యూటీ చీఫ్ కమాండర్ అబూ మహదీ కూడా మృతి చెందినట్టు ఇరాన్ రెవల్యూషనరీ భద్రత దళాలు ప్రకటించాయి. ఇందుకు తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం అధినేత ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.

 

బాగ్దాద్ : శుక్రవారం అమెరికా వైమానిక బలగాలు ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడికి దిగాయి. ఇరాన్‌కు చెందిన అగ్రశేణి సైనిక నేతను హతమార్చాయి. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఈ దాడిలో ఇరాన్ సైనిక బలగాల కీలక దళ నేత ఖాసీం సోలెమన్ హతులయ్యారు. ఇరాన్ టాప్ కమాండర్, ఇరాక్‌కు చెందిన మిలీషియా నేతలు కూడా మృతులలో ఉన్నారు. ఇరాక్ మిలీషియా కమాండర్ ఒకరు కూడా చనిపోయినట్లు వెల్లడైంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ బలగాలకు చెందిన అత్యంత ప్రధానమైన ఖుడ్స్ ఫోర్స్‌కు అధిపతిగా ఉన్న కమాండర్ ఖాసీం సోలెమన్ ఇరాన్‌లో రెండో అత్యున్నత స్థాయి నేతగా చలామణిలోకి వచ్చారు. అమెరికా వైమానిక బలగాలకు చెందిన హెలికాప్టర్లు రాకెట్లతో బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్షంగా చేసుకుని దాడికి దిగాయి. ఈ దాడిలో ఎనమండుగురు మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత వెలువడ్డ వార్తలలో ఈ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ సోలెమన్ కూడా మృతి చెందినట్లు ధృవీకరించారు.

దీనితో ఇప్పుడు గల్ఫ్‌లో యుద్ధ జ్వాలలు రగులుకున్నాయి. అమెరికాపై ప్రతీకారం తప్పదని ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమనెయ్ వెనువెంటనే హెచ్చరించారు. ఇరాన్ అమెరికా మద్య రగులుకుంటున్న ఉద్రిక్తతల్లో ఇప్పుడు జరిగిన విమాన్రాశయ దాడి అత్యంత నాటకీయ పరిణామం అయింది. ఇరాన్ సేనలైన రెవెల్యూషనరీ ఫోర్స్‌కు అత్యంత కీలక వ్యక్తిగా ఖాసీం సోలెమన్ వ్యవహరిస్తున్నారు. గత వారం అమెరికా ఎంబస్సీని ఇరాన్ అనుకూల గుంపు ముట్టడించిన ఘటనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ దాడికి ఆదేశించినట్లు వెల్లడైంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు పెంటగాన్ స్పష్టం చేసింది. ఇరాక్ విమానాశ్రయంపై దాడిలో టాప్ కమాండర్ మృతి చెందిన కొద్ది నిమిషాలలోనే ట్రంప్ తమ ట్విట్టర్‌లో అమెరికా జాతీయ జెండాను ఉంచారు. ఎటువంటి సందేశం వెలువరించకుండా వదిలేశారు. శుక్రవారం తెల్లవారుజామునే దాడులకు దిగారు. టాప్ కమాండర్ మృతిని ఇటు అమెరికా అటు ఇరాన్ వర్గాలు అత్యున్నత స్థాయిలో ధృవీకరించాయి. దేశవ్యాప్తంగా మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించిన ఇరాన్ నేత ఖమనెయ్ ఈ దాడికి తీవ్ర ప్రతీకార చర్య తప్పదని హెచ్చరించారు.

శుక్రవారం వరుస క్షిపణుల దాడులు
తెల్లవారుతూ ఉండగానే కీలక ఎయిర్‌పోర్టుపై అమెరికా రాకెట్లు వరుస క్షిపణి దాడులకు దిగాయి. అక్కడి పారామిలిటరీ , సైనిక సిబ్బంది శకటాలను లక్షంగా చేసుకుని దాడులు జరిగాయి. దాడులు తరువాత కొద్ది గంటలకు రెవల్యూషనరీ గార్డ్ బలగాల ప్రతినిధి ఒకరు తమ ప్రకటనలో టాప్ కమాండర్ సోలెమన్ మృతి చెందిన విషయాన్ని ధృవీకరించారు. సోలెమనీ, ఖుడ్స్‌ఫోర్స్ ఉప దళాధిపతి అబూ మహదీ అల్ ముహందీస్ కూడా హతులయినట్లు అధికారులు తెలిపారు. వీరి వాహనాన్ని ఎంచుకునే అమెరికా దాడికి దిగినట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రాంతంలోని ఇరాకీ పారామిలిటరీ బలగమైన హషె ద్ అల్ షాబీకి చెందిన కాన్వాయ్‌పై కూడా దాడి జరిగిం ది. హషెద్ షియా ప్రాబల్య సాయుధ విభాగంగా ఉంటో ంది. ఈ దళానికి ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాక్ భద్రతా బలగాలలో అనుబంధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దళాలు ఐసిస్‌ను దెబ్బతీసేందుకు కలిసికట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు అమెరికా దాడులలో మృతి చెందిన టాప్ క మాండర్ సోలెమన్ ఇరాన్ తరఫున తరచూ ఇరాక్‌తో సంధానకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. సంక్షోభాల సమయంలో ఇరాన్ ప్రతినిధిగా ఇరాక్‌కు వెళ్లి వస్తుంటారు.

అమెరికా దౌత్యవేత్తలపై దాడి చర్యలకు ప్రతిగా
ఖుడ్స్ ఫోర్స్ అధినేత ఇటీవలి కాలంలో అమెరికా దౌత్యవేత్తలపై దాడులకు వ్యూహాలు పన్నుతున్నట్లు నిర్థారించుకుని ఈ చర్యకుదిగినట్లు పెంటగాన్ తెలిపింది. పలుచో ట్ల ఉన్న అమెరికా సేనలకు ఆయన ముప్పుగా మారుతున్నందున దాడికి దిగినట్లు వివరించారు. అమెరికా సిబ్బ ంది పరిరక్షణకు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాత్మక రక్షణ చర్యగా దీనిని ప్రకటిస్తున్నామని పెంటగాన్ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నాటి దాడిని ఇరాన్ విదేశాంగ మంత్రి మెహమ్మద్ జావెద్ జరిఫ్ తీవ్రంగా ఖండించారు. ఇది చాలా ప్రమాదకరమైన, తెలివితక్కువ చర్య అని విమర్శించారు. ఇప్పటి దాడిపై ఇరాక్ నుంచి వెనువెంటనే ఎటువంటి సత్వర స్పందన వెలువడలేదు.

మూడు రాకెట్లతో విధ్వంసం
శుక్రవారం తెల్లవారకముందే అమెరికా సేనలు హెలీకాప్టర్లతో మూడు రాకెట్లను ప్రయోగించాయి. దీనితో అక్కడున్న మూడు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తతను రగిలించిన దాడిపై ప్రపంచ దేశాలు స్పందించాయి. పూర్తి సంయమనం పాటించాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశాయి. ఈ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టినట్లు అవుతుందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కవ్వింపు చర్యలకు దిగరాదని సూచించారు. సైనిక చర్యకు దిగడం సముచితం కాదని చైనా తెలిపింది. దాడిని ఇరాక్ ఆపద్ధర్మ ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ ఖండించారు. ఇది దురాక్రమణ వాదం అని, వినాశకరమైన యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. దాడిని సిరియా ఖండించింది.

ఇరాక్‌లో ఇరాన్ నేతను మట్టుపెట్టారు

2020 ఆరంభంలోనే అమెరికా దూకుడు
2020 ఆరంభంలోనే అమెరికా సైనికపరంగా దూకుడు ప్రదర్శించింది. ఇరాన్ ఇరాక్‌లకు చెక్‌పెట్టేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ సైనిక చర్యకు దిగారు. అమెరికా దౌత్య సిబ్బందిపై జులుంకు దిగుతున్నాడనే అక్కసుతో ఇరాన్ సైనిక నేత ఖాసెం సులేమాన్‌ను లక్షంగా చేసుకుని, ఆయన ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఉన్నట్లు పసికట్టి వైమానిక దళాలతో రాకెటు దాడులకు ట్రంప్ ఆదేశించారు. ఈ ఘటనలో ఇరాన్ అగ్రస్థాయి సైనిక నేతతో పాటు ఇరాక్‌కు చెందిన కీలక సైనికాధికారులూ మృతి చెందారు. విమానాశ్రయ సమీపంలోని కాన్వాయ్‌ను కూడా ఎంచుకుని అమెరికా రాకెటు దాడులు సాగాయి. ఈ ప్రాంతంలో ఆధిపత్యం చాటుకునేందుకు అమెరికా సాగించిన ఈ సైనిక చర్య, దీనికి తదనంతర పరిణామంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దాడి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎయిర్‌పోర్టు రాదారిలోని వారే టార్గెట్
ఇరాన్ సేనల కీలక నేత బాగ్దాద్‌కు వచ్చినట్లు తెలుసుకుని, తగు సమాచారాన్ని క్రోడీకరించుకుని అమెరికా వైమానిక బలగాలు దాడులకు దిగాయి. బాగ్దాద్ విమానాశ్రయం లక్షంగా చేసుకుని రాకెట్లను ప్రయోగించారు. ఈ క్రమంలో అక్కడి ప్రధాన సైనికాధికారుల కాన్వాయ్ దెబ్బతింది. ఈ క్రమంలోనే ఇరాక్ సైనిక టాప్ కమాండర్, ఇరాక్ మిలిషియా నేతలు మృతి చెందినట్లు వెల్లడైంది.

శాంతి.. సంయమనం : ఇండియా

న్యూఢిల్లీ : బాగ్దాద్ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడిపై భారతదేశం స్పందించింది. ఖాసీం సోలేమాని హతంతో తలెత్తిన పరిణామాలలో ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని భారతదేశం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు భారతదేశానికి కీలకమని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ఇప్పటి పరిణామాలతో ఉద్రికతలు పెరిగాయని, సంయమనం అవసరం అని విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ సీనియర్ నేత ఒకరు అమెరికా దాడిలో మృతి చెందినట్లు తెలిసిందని, ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యవసరం అని భారతదేశం తరచూ చెపుతూ వస్తోందని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. ఇప్పుడు కూడా ఇదే సూచనను వెలువరిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్ ఆదేశాల మేరకు జరిగిన దాడులపై ఇరాన్ తీవ్రంగానే స్పందించింది. ప్రతీకారం తప్పదని ఇరాన్ అగ్రనేత హెచ్చరించారు. దీనిపై భారతదేశం స్పందించింది. సంయమనం అవసరం అని పేర్కొంది.

తీవ్ర పరిణామాలుంటాయి : రష్యా ఆందోళన
ఇరాక్ విమానాశ్రయంపై అమెరికా దాడి పట్ల భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాలైన చైనా, రష్యా, ఫ్రాన్స్‌లు స్పందించాయి. అమెరికా దాడితో తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా పేర్కొంది. మధ్యప్రాచ్యంలో సంక్లిష్ట పరిస్థితిని పరిష్కరించేందుకు ఇటువంటి చర్యలు ఏ విధంగా కూడా ఉపకరించబోవని, పైగా మరింత చిచ్చుకు దారితీస్తాయని రష్యా తెలిపింది. ఈ చర్యతో గల్ఫ్‌లో పరిస్థితి దిగజారుతుందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్ షూయాంగ్ స్పందించారు. బ్రిటన్ , జర్మనీలు అమెరికా చర్య సరైనదే అని పరోక్షంగా అభిప్రాయపడ్డాయి.

ఇరాన్‌కు చెందిన ఖుద్స్ బలగాలు దూకుడుగా సాగుతూ వచ్చాయని, వీటికి సారధ్యం వహించిన సోలేమని చర్యలపై అమెరికా స్పందనను తాము అర్థం చేసుకోగలమని బ్రిటన్, జర్మనీలు తెలిపాయి. కమాండర్ మృతితో తలెత్తిన పరిణామాలతో సంయమనం కీలకమని, అన్ని పక్షాలూ ఇప్పుడు పూర్తి సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని దారితప్పకుండా చూడాల్సి ఉందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డోమినిక్ రాబ్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితి ప్రమాదకర స్థాయిని దాటుతోందని, దీనిని నివారించాల్సి ఉందని జర్మనీ ఛాన్సలర్ ఆంగేలా మెర్కెల్ మహిళా ప్రతినిధి ఉల్రికే డిమ్మెర్ స్పందించారు. ఈ ప్రాంతంలో ఇరాన్ అతి చర్యలపై కూడా తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, అయితే దౌత్యమార్గాలలో ఘర్ణణల నివారణకు వీలుంటుందని తెలిపారు.

తీవ్రస్థాయి ప్రతీకారం : ఇరాన్

టెహ్రాన్ : కమాండర్‌ను అంతమొందించిన అమెరికాపై ఉధృత స్థాయి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై దాడిలో టాప్ కమాండర్ సోలెమన్ మృతి చెందడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్ జరీఫ్ స్పందించారు. అమెరికా చర్యను తాము తీవ్రంగా తీసుకుంటామని, దీనితో ప్రమాదకర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నామని జరీఫ్ శుక్రవారం తెలిపారు. రెవల్యూషనరీ గార్డ్ నుంచి కూడా ప్రకటన వెలువడింది. తమ నేత సోలెమన్ జీవితం దేశ సేవలోనే గడిచిందని , ఈ క్రమంలో బాగ్దాద్ విమానాశ్రమంలో అమెరికా జరిపిన దాడిలో ఆయన బలిదానం చేశారని కొనియాడారు.ఇరాన్ అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ స్పందిస్తూ నేరస్తులు దొంగదెబ్బతీసి ఆయన నెత్తుటితో చేతులు కడుక్కున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా దాడిని అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా ఇరాన్ గర్హించింది. దాడి తరువాతి దశలో పరిస్థితిని సమీక్షించుకునేందుకు ఇరాన్ భద్రతా విభాగం అత్యవసర భేటీ నిర్వహించింది.

అమెరికా క్రూరచర్య : రౌహనీ
అమెరికాకు వ్యతిరేకంగా ఇక ఈ ప్రాంత దేశాలు మరింత సంఘటితంగా ముందుకు సాగుతాయని ఇరాన్ అధ్యక్షులు హసన్ రౌహానీ ప్రకటించారు. అధికార టీవీ కార్యక్రమాలను అర్థాంతరంగా నిలిపివేసి, నలుపు రిబ్బన్ ప్రదర్శించి, టాప్ కమాండర్ సోలెమన్ సేవలను ప్రస్తుతించే కార్యక్రమం తరువాత రౌహనీ మాట్లాడారు. ఈ ప్రాంత స్వేచ్ఛాయుత దేశాలు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాయని ప్రకటించారు. తమ కమాండర్ మృతితో అమెరికా పట్ల ఇరాన్, ఇతర స్వేచ్ఛాయుత దేశాలు మరింతగా రగిలిపొయ్యే దశ వచ్చిందని , తప్పనిసరిగా దెబ్బకు దెబ్బ తీసి తీరుతామని ఇరాన్ అధ్యక్షులు తెలిపారు. స్విస్ ఎంబసీలోని ఒక అధికారిని పిలిపించి అమెరికా చర్యపై ఇరాన్ అధికార వర్గాలు నిరసన తెలిపాయి.

ఈ ఎంబసీ నుంచే అమెరికా సంబంధిత విషయాల ప్రతినిధి ఒకరు పనిచేస్తూ ఉంటారు. ఇక తమ ప్రతిఘటన దళం నూతన చర్యల అధ్యాయానికి దిగుతుందని ఇరాన్ తెలిపింది. తమ నేతను అమెరికా బలగాలు హతమార్చడంపై నిరసనగా ఇరాన్‌లో పలుచోట్ల వేలాది మంది నిరసనలకు దిగారు. కమాండర్ చిత్రపటాన్ని చేతబూని టెహ్రాన్ ఇతర చోట్ల ప్రదర్శనలు జరిగాయి. ఇక ఇరాన్ సైనిక అధినేత మృతి చెందారని తెలియగానే ఇరాక్‌లో పలు చోట్ల సంబరాలు జరిగాయని అమెరికా టీవీ ఛానళ్లు వార్తలు వెలువరించాయి.

US invasion of Baghdad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News