Tuesday, April 30, 2024

జమ్ము కశ్మీర్‌కు యూటీ హోదా శాశ్వతం కాదు : కేంద్రం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆగస్టు 31న ధర్మాసనం ముందు ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి ఏదైనా కాలపరిమితి ఉందా ? అని భారత సర్వోన్నత న్యాయస్థానం అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈవిధమైన సమాధానం ఇచ్చింది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని రాజ్యాంగ ధర్మాసనం, జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఎంతో కీలకమన్న ధర్మాసనం, ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఎటువంటి ప్రణాళిక ఉందని ప్రశ్నించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిచ్చారు.

Also Read: పంజాగుట్టలో బస్సు ఢీకొని మహిళ మృతి

‘జమ్ముకశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదు. లద్దాఖ్‌కు సంబంధించినంత వరకు యూటీ హోదా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది ’అని తుషార్ మెహతా పేర్కొన్నారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరణను ఆగస్టు 31న ధర్మాసనానికి తెలియజేస్తానని అన్నారు. సొలిసిటర్ జనరల్ అభ్యర్థనను విన్న సుప్రీం ధర్మాసనం, జాతీయ భద్రత అంశం దృష్టా రాష్ట్ర పునర్వవస్థీకరణను అంగీకరిస్తున్నప్పటికీ, ప్రజాస్వామ్యం ముఖ్యం. సరైన కాలపరిమితితో ప్రస్తుత పరిస్థితికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఎప్పటి లోగా వాస్తవిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తారో మాకు చెప్పాలి” అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతోపాటు అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిలకు సుప్రీం ధర్మాసనం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News