ఉత్తరాఖండ్‌ను గురువారం మరోసారి వరద బీభత్సం దెబ్బతీసింది. ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో భారీ కుండపోత వర్షాలు తరువాత కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 11 మంది గల్లంతు అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.జిల్లాలోని నాలుగు గ్రామాల వర్షాల ధాటికి భీతిల్లాయి. ఎక్కడ చూసినా చెట్లు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, ఇళ్లపై కొండచరియలు కూలడంతో జనజీవితం అస్థవ్యవస్థం అయింది. కుంటారీ గ్రామంలో ఓ వ్యక్తి శవాన్ని అక్కడి చెత్తాచెదారంలో కనుగొన్నారు.
ఇద్దరు మహిళలు, ఓ బాలుడిని అతి కష్టం మీద రక్షించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు రాష్ట్ర అత్యయిక పరిస్థితులు నిర్వహణ కేంద్రం అధికారులు డెహ్రాడూన్‌లో తెలిపారు. మృతుడిని 42 సంవత్సరాల నరేంద్ర సింగ్‌గా గుర్తించారు. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది గల్లంతు అయినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లో తెలిపారు. వారి జాడ తెలుసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. గ్రామాలలో అనేక ఇళ్లు కుప్పకూలడం, పశువుల కొట్టాలు ధ్వంసం కావడం జరిగింది. డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలలో రెండు రోజులుగా కుండపోత వానలు కురుస్తూ ఉండటంతో జనజీవితం స్తంభించింది.
Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం