హైదరాబాద్: సూర్య హీరోగా నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. ‘రెట్రో’ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. గిరిజనులను అవమానపరిచేలా మాట్లాడారంటూ.. తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్, న్యాయవాది కిషన్‌రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా తన వ్యాఖ్యలపై విజయ్ స్పష్టత ఇచ్చారు. ‘రెట్రో’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బ తీసినట్లు తెలిసిందని.. ఏ వర్గాన్ని, ఏ తెగను బాధపెట్టాలనేది తన ఉద్దేశం కాదని విజయ్ వెల్లడించారు. ‘అందరిని నేను గౌరవిస్తాను. భారతదేశంలో ప్రజలంతా ఒక్కటే అని అనుకుంటాను. మనందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఐక్యంగా నిలబడాలి. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపలేదు. వారందరూ నా కుటుంబసభ్యులే. నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. నా లక్ష్యం శాంతి గురించి మాట్లాడడమే’ అని విజయ్ పేర్కొన్నారు.
‘చారిత్రక, నిఘంటు దృష్టికొణంలోనే నేను ఆ పదాన్ని ఉపయోగించాను. వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్ధేశం. ఆ సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగేవి. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలు పెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ జరిగింది. అది జరిగి కనీసం 100 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు’ అని విజయ వివరించారు.