Thursday, April 25, 2024

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి నుంచే ఓటు !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే రాష్ట్రంలో దివ్యాంగులు, వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో స్పందన ఆశాజనకంగా ఉండటంతో ఆ విధానాన్ని కొనసాగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటర్లల్లో మరింత చైతన్యాన్ని తీసుకురాగలిగితే రానున్న కాలంలో ఎక్కువ మంది ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలో ఈ విధానాన్ని అమలు చేశారు.

ఆ రాష్ట్రంలో దివ్యాంగులు, 80 ఈ సంవత్సరాలు దాటిన ఓటర్లు 18.02 లక్షల మంది ఉన్నారు. అందులో 99,529 మంది పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకున్నారు. వారిలో సుమారు 97 శాతం మంది వినియోగించుకోవటం విశేషం. రాష్ట్రంలో 4,99,536 మంది దివ్యాంగ ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన వృద్ధ ఓటర్లు 4,86,257 మంది ఉన్నారు. మొత్తంగా 9,85,793 మంది అర్హులు ఉన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా మునుగోడు ఉప ఎన్నికలో ఈ విధానాన్ని అమలు చేశారు. ఆ నియోజకవర్గంలో 8.131 మంది అర్హులు ఉండగా.. 739 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకున్నారు.

వారిలో 686 మంది ఓటు వేశారు. ఈ విధానాన్ని అమలు చేయాలా? లేదా? అన్న తుది నిర్ణయం కేంద్ర ఎన్నికల సంఘానిదేనని అధికారులు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి అయిదు రోజుల్లోగా ఆయా ఓటర్లు ఈ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందించిన 12-డి దరఖాస్తును భర్తీ చేసి ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారికి అందజేయాలి. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు.

అధికారులు ఓటర్ల వద్దకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని అందజేస్తారు. రహస్య విధానంలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. రహస్య ఓటు మినహా మిగతా ప్రక్రియనంతా అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ను ఎంచుకున్న వారు ఏ కారణంతోనైనా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేని పక్షంలో ప్రత్యక్షంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసే అవకాశం ఉండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News