Monday, April 29, 2024

మోరంచపల్లి ప్రజలను ఆదుకుంటాం

- Advertisement -
- Advertisement -

బాధితులను చూసి చలించి పోయిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 900 కోట్లు సహాయ నిధులు
మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు ఎక్స్‌గ్రేషియా
నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలమైన మోరంచపల్లి గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బురదమయైన ఇళ్లను, కొట్టుకుపోయి చెట్లకు ఇరుక్కుపోయిన వాహనాలను పరిశీలించి గ్రామంలో పరిస్థితిని చూసి చలించిపోయారు. వరదలకు గల్లంతైన గడ్డం మహాలక్ష్మి, గంగిడి సరోజన, ర్యాకం విజయ, నర్సారెడ్డితో పాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నాటి ఘటనను వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అన్నింటిని వదలి పరిగెత్తిన పరిస్థితిని కిషన్‌రెడ్డికి బాధితులు గ్రామస్తులు వివరించారు. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది, ఒక ఇల్లు కూడా మళ్లీ ఉండేందుకు పనికిరాకుండా పోయిందని, గూడు, గొడ్డు అంతా పోయిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో వస్తువులేని పనికిరాకుండా పోయాయని విలపించారు. వారి బాధను చూసి ఉద్వేగానికి గురైన కిషన్‌రెడ్డి బాధితులతో మాట్లాడి వారి బాధలను విని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు ఉన్నాయని ఆనిధులతో బాధితులను విధాల ఆదుకోవాలన్నారు. మృతులకు ఇచ్చే రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాలో 75 శాతం (3లక్షలు) కేంద్రం ఇచ్చినవేనని తెలిపారు. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లిష్టపరిస్థితిలో బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాధితులను కేంద్ర ప్రభుత్వం కూడా అనుకుంటుందని తెలిపారు. కేంద్ర బృందాలు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తాయని చెప్పారు.

కోలుకోని మోరంచుపల్లి:

వర్షాలు తగ్గినా మోరంచపల్లి ఇంకా కోలుకోలేదు. రెండు రోజుల నుంచి వరద బురదలోనే మోరంచపల్లి వాసులు కాలం గడుపుతున్నారు. అధిక వర్షాలతో వరదలతో అనేక గ్రామాలు నీటముని ఇళ్ళు, రోడ్లు చెబ్బతిన్నాయి. పంటపొలాలు వరదలో కొట్టుకుపోయాయి బురదను కడుక్కుంటూ సాయం కోసం గ్రామస్తులు – ఎదురుచుస్తున్నారు. మరో వైపు మోరంచపల్లిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంటింటా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక వర్షాలకు గల్లంతైన వజ్రమ్మ, మహాలక్ష్మీల అచూకీ ఇంకా లభించలేదు.

తెలంగాణకు కేంద్ర బృందం:
సోమవారం తెలంగాణకు కేంద్ర బృందం రానుంది. తెలంగాణలో వరద నష్టం అంచనా వేయనుంది. మొత్తం 8 శాఖల అధికారులతో తెలంగాణ కేంద్ర బృందం రానుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో కేంద్ర అధికారుల బృందంలో నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర అధికారుల బృందంలో ఆర్థిక, వ్యవసాయ, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, స్పేస్ డిపార్టుమెంట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News