టరోబా (ట్రినిడాడ్ మరియు టొబాగో): పాకిస్తాన్ జరిగిన వన్డే సిరీస్ లో వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. 34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌పై ఆ జట్టు తొలి వన్డే సిరీస్ గెలిచింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను వెస్టిండీస్ 3-1తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండో మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది. ఈ క్రమంలో మూడో చివరి మ్యాచ్ లో విండీస్ సంచలన ప్రదర్శన చేసింది. మంగళవారం ట్రినిడాడ్‌లోని టరోబాలోని బ్రియన్ లారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 294 పరుగులు చేసింది. కెప్టెన్ షాయ్ హోప్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. కేవలం 94 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక, రోస్టన్ చేజ్ 29 బంతుల్లో 36 పరుగులు, ఎవిన్ లూయిస్ 37 పరుగులతో రాణించారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టును విండీస్ బౌలర్ జైడెన్ సీల్స్ దెబ్బ కొట్టాడు. ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి పాక్ వెన్ను విరిచాడు. అతనితోపాటు గుడకేష్ మోటీ రెండు వికెట్లు, రోస్టన్ చేజ్ ఒక వికెట్ తీసుకున్నారు. విండీస్ బౌలర్ల దెబ్బకు పాక్ విలవిలలాడింది. పాకిస్తాన్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌లు డకౌట్‌గా కాగా.. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ 9 పరుగులకే వెనుదిరిగాడు. ఇక, మొహమ్మద్ రిజ్వాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. పాకిస్తాన్ తరపున సల్మాన్ అఘా 30 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. వరుస వికెట్లతో విండీస్ బౌలర్లు చెలరేగడంతో పాకిస్తాన్ కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో వెస్టిండీస్ 202 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 34 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్‌పై విండీస్ సాధించిన తొలి ODI సిరీస్ ఇదే. వారు చివరిసారిగా 1991లో పాకిస్తాన్‌పై ODI సిరీస్ గెలుచుకున్నారు.