Friday, March 31, 2023

బిఆర్‌ఎస్సే మహిళల కోటా తెస్తుంది

- Advertisement -

‘మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం’ బిఆర్‌ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ నాందేడ్ మీడియా సమావేశంలో అన్ని మాటలివి. దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. భారత రాజ్యాంగం మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొని 73 సంవత్సరాలు అవుతున్నా నేటికీ మహిళల సమానత్వం, సమాన పనికి సమాన వేతనం, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కాకపోవడం శోచనీయం. ఎన్నికలకు ముందు మహిళల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం అని అనేక వాగ్దానాలు చేసిన బిజెపి, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలను గాలికొదిలేసింది. బిజెపి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న బేటీ పడావో.. బేటీ బచావో నినాదం కేవలం మాటలకే పరిమితం అయింది తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కథువా, ఉన్నావ్, హథ్రాస్ లాంటి ఎన్నో ఘటనలు చూస్తే ఈ దేశాన్నేలుతున్న ప్రభుత్వాలు మహిళలకు సరైన రక్షణ కల్పించడం లేదని స్పష్టమవుతున్నది.

భారత దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రాష్ట్రాల శాసన సభలలో, పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజన తెగల నుంచి యువతులు చట్టసభల్లోకి వచ్చేలా సమ్మిళిత రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిల్లు తెస్తామని హామీ ఇచ్చింది. అయినా ఇంత వరకూ కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమం కోసం చేపట్టిన ప్రత్యేక పథకాలు, ఇచ్చిన అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. మహిళలకిచ్చిన వాగ్దానాల అమలు విషయంలో కాంగ్రెస్ చెప్పిన మాటలకు, వారి చేతలకు పొంతన లేనట్లే వ్యవహరించింది.

Sreeja demonstrated world's largest women's organization
ఈ క్రమంలో సమాజంలో సగ భాగమైన స్త్రీలు అన్నిరంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమౌతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారు. మహిళలకు విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ,- ఆర్థిక సాధికారత కల్పించేందుకు, తద్వారా సురక్షితమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆయన సంకల్పించారు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. స్త్రీ శక్తికి సామాజిక గౌరవాన్ని మరింతగా పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మహిళల కోసం ప్రతి ఏటా వేల కోట్ల నిధులతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తూ, వారి అవకాశాలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతను సాధిస్తున్నది. మహిళా హక్కులే మానవ హక్కులనే మాటను నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తున్నది. సిఎం కెసిఆర్ హయాంలో తొమ్మిదేండ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతున్నదనడంలో సందేహం లేదు. ఆడబిడ్డ తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డను కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటున్నది. మహిళా సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థవంతమైన కార్యాచరణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది.

తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథలకాలను పలు రాష్ట్రాలు అధ్యయనం చేస్తూ, వారి రాష్ట్రాల్లో వివిధ పేర్లతో అమలు చేయడం రాష్ట్రానికే గర్వకారణం. ఇదిలా ఉండగా, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు కోసం కోసం టిఆర్‌ఎస్ తొమ్మిదేండ్లుగా పోరాటం చేస్తున్నది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలైతే దేశంలో దాదాపు 180 ఎంపి స్థానా లు మహిళలకు దక్కుతాయి, ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిళ్లలో రిజర్వేషన్లు లభిస్తాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి, ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ స్వయంగా అందజేశారు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిం ది, కానీ, లోక్‌సభలో మాత్రం ఆమోదం పొందలేదు. కేంద్రంలోని బిజెపి పెద్దలు తలుచుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది. కానీ వారికి ఆ చిత్తశుద్ధి లేదు, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం లేదు.

ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందని సిఎం కెసిఆర్ చెబుతున్నారు. భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేయడం గమనార్హం. మహిళలను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం. అన్నిరంగాల్లోనూ మహిళల ప్రాధాన్యం పెంచుతాం. బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఆ హామీని ఏడాదిలోపే అమలు చేస్తామని ప్రకటించడాన్ని ఈ దేశంలోని మహిళలంతా స్వాగతించి, బిఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఆడబిడ్డలను కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదన్న చారిత్రక సత్యం ఈ దేశంలో పునరావృతమవుతుంది. దశాబ్దాలుగా మహిళలు కలలుగంటున్న రిజర్వేషన్ల బిల్లును బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే, తప్పక ఆమోదింపజేస్తుంది. 14 ఏండ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న నాటి టిఆర్‌ఎస్, నేటి బిఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ కలను సాకారం చేసినట్లుగానే, మహిళల రిజర్వేషన్ల బిల్లు కలను కూడా తప్పక సాకారం చేస్తుంది.

గోపాల విజయలక్ష్మి
9010201614

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News