Tuesday, April 23, 2024

రాయ్‌పూర్ డిక్లరేషన్ ఫలిస్తుందా?

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తిరోగమనం ప్రారంభమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వయో భారం, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ రాజీనామా చేసినా, ఆయనకు తెలియకుండా సోనియా ఏ చిన్న నిర్ణయం తీసుకునేవారు కాదంటారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ గందరగోళ పరిస్థితి చూసి బడాబడా నాయకులు కూడా పార్టీకి గుడ్ బై కొట్టారు.

మొత్తానికి ప్లీనరీ సమావేశాల పుణ్యమా అంటూ కాంగ్రెస్‌లో కాస్తంత కదలిక వచ్చింది. చత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్లీనరీ సమావేశాలు విజయవంతమయ్యాయి. చివరి రోజు జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ భవిష్య కార్యాచరణకు సంబంధించి అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించారు. నితీశ్ కుమార్ సలహా పని చేసిందో ఏమో కానీ లోక్‌సభ ఎన్నికల్లో తమతో కలిసి వచ్చే భావసారూప్యత గల పార్టీలతో జతకడతామని రాహుల్ చెప్పారు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లాంటి బలమైన నేతలు కాంగ్రెస్‌తో ఏమేరకు కలిసి వస్తారన్నది అనుమానమే. మేఘాలయ ఎన్నికల ప్రచారం సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయడాన్ని రాహుల్ తప్పుపట్టారు. బిజెపిని గెలిపించడానికే మేఘాలయలో మమతా బెనర్జీపార్టీ బరిలో నిలిచిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

మమతా బెనర్జీ వీటన్నిటినీ మనసులో పెట్టుకునే మనిషే. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆమ్‌ఆద్మీ పార్టీ బరిలో నిలవడం ఇటీవల సాధారణమైంది. ఆప్‌ను విస్తరించే కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. కాంగ్రెస్‌తో ఇప్పటి వరకు కేజ్రీవాల్ అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. మరో వైపు మన దేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. భారత్ జోడో యాత్రలో అన్నదాతల కష్టాలు స్వయంగా చూసిన నేపథ్యంలో ఆరు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని డిక్లేర్ చేశారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్. ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారిన కీలక అంశం జిఎస్‌టి. చిన్న, చితకా వ్యాపారుల బతుకులు జిఎస్‌టి వల్ల ఘోరంగా దెబ్బతిన్నాయని గతంలో మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. దీంతో జిఎస్‌టిని చిన్న వ్యాపారులకు మేలు జరిగేలా సరళీకరిస్తామన్నారు రాహుల్. రోహిత్ వేముల చట్టం తీసుకు వస్తామని మరో సంచలన నిర్ణయం ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత. రోహిత్ వేముల తెలుగువాడు. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకున్నారు.

అప్పట్లో రోహిత్ వేముల కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. దేశ రాజకీయాల్లో కులగణన మరో కీలక అంశం. కులాల వారీగా జనాభాను లెక్కించాలని దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క బీహార్ ప్రభుత్వమే కుల గణనను చేపట్టింది. గతంలో కుల గణనకు జై కొట్టిన బిజెపి ఆ తరువాత ప్లేటు ఫిరాయించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు నెలల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ యాత్రతో జనం ముందు ఒక సరికొత్త రాహుల్ గాంధీ ఆవిష్కరణ జరిగిందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారత్ జోడో యాత్ర కొనసాగింది. భారత్ జోడో యాత్ర సక్సెస్ అవడంతో రాహుల్ గాంధీ మరో యాత్రకు ఉత్సాహం చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల కథనం. అరుణాచల్ ప్రదేశ్‌లోని పాసిఘాట్ నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకు ఈసారి యాత్ర జరిగే అవకాశాలున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జై రాం రమేశ్ సంకేతాలు ఇచ్చారు. జై రాం రమేశ్ సమాచారం మేరకు రెండో విడత పాదయాత్ర గుజరాత్‌లో ముగుస్తుంది. వ్యూహాత్మకంగానే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను యాత్రకు ముగింపు ప్రాంతంగా ఎంపిక చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మొత్తంగా రెండో విడత భారత్ జోడో యాత్రపై స్పష్టత రావలసి ఉంది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిజాయితీకి మచ్చలా తయారైన ప్రముఖ వ్యాపారవేత్త అదానీ వివాదాన్ని కొనసాగించడానికే కాంగ్రెస్ నిర్ణయించుకుంది.అదానీ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ నోరు తెరచి సమాధానం ఇచ్చేంత వరకు ప్రశ్నలు వేయడానికే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు జరపాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. గతంలో జీ -23 బ్యాచ్ కూడా ఇదే విషయమై పట్టుబట్టింది. అయితే సిడబ్ల్యుసికి ఎన్నికల్లేవని ప్లీనరీ తేల్చి చెప్పింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కు అప్పగించింది ప్లీనరీ.

ఖర్గే నాయకత్వాన్ని బలోపేతం చేయడానికే నామినేషన్ల పద్ధతికి వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు వివరణ ఇవ్వడం విశేషం. క్రియాశీల రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్లీనరీ సమావేశాల సాక్షిగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2004లో భావసారూప్యం గల పార్టీలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ఏర్పాటులో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. యుపిఎ రెండు దఫాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా నిన్న మొన్నటి వరకు సోనియానే కొనసాగారు. కిందటేడాది కన్నడ రాజకీయవేత్త మల్లికార్జున ఖర్గే ఎఐసిసి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక పార్టీ బాధ్యతల నుంచి సోనియా కాస్తంత రిలాక్స్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమై చాలా కాలమైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్ల్లో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ తిరోగమనం ప్రారంభమైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో వయో భారం, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ రాజీనామా చేసినా, ఆయనకు తెలియకుండా సోనియా ఏ చిన్న నిర్ణయం తీసుకునేవారు కాదంటారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ గందరగోళ పరిస్థితి చూసి బడాబడా నాయకులు కూడా పార్టీకి గుడ్ బై కొట్టారు. గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ లాంటి హేమాహేమీలు కాంగ్రెస్ నుంచి వైదొలగారు.దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక గమ్మత్తయిన పరిస్థితి నెలకొంది. జాతీయ పార్టీలపై ప్రజలకు నమ్మకం సడలడంతో కొన్నేళ్లుగా దేశంలోనిఅన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. వీటికి రకరకాల కారణాలున్నాయి. తెలుగువారి ఆత్మాభిమానంపేరుతో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవిస్తే, తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి లాంటి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.

మరికొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి విడిపడి ప్రముఖులు సొంత పార్టీలు పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నాయకత్వంలో వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, ఎపిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన గల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాలోకి వస్తాయి. అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రాంతీయ పార్టీలు శక్తివంతమయ్యాయి. అలా ఇలా కాదు జాతీయ పార్టీలనే సవాలు చేసే రేంజ్‌కు ఎదిగాయి. ఈ ప్రాంతీయ పార్టీలే తమ తమ రాష్ట్రాల్లో బిజెపిని దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉనికి నామమాత్రమైంది. ఈ నేపథ్యంలో రాయ్‌పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెడుతుందా? లోక్‌సభ ఎన్నికలకు ఎంత వరకు మేలు చేస్తుంది? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News