Friday, April 26, 2024

జైల్లో పుట్టిన గాలిపటాలు!

- Advertisement -
- Advertisement -

జైళ్ళలో నిర్బంధించిన కవుల గీతాలతో ఇంగ్లీషు అనువాదాల నూతన కవితా సంకలనం వెలువడింది. పాకిస్థాన్‌కు చెందిన ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్‌ను 1951 మార్చి 9వ తేదీన అక్కడి ప్రభుత్వం తొలిసారిగా అరెస్టు చేసింది. సోవియట్ యూనియన్ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంకోసం, ప్రధాన మంత్రి లియాఖత్ అలీఖాన్ ప్రభుత్వాన్ని కూల దోయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయనపైన ప్రభుత్వ ఆరోపణ. ఫైజ్ అహ్మద్ ఫైజ్ సహా ఆయన సహచరులందరిపైన ప్రసిద్ధమైన ‘రావల్ పిండి కుట్ర కేసు’ పెట్టడంతో ఆయన నాలుగేళ్ళు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది.

పాకిస్థాన్‌లో తొలిసారిగా అదే ఆయనను అరెస్టు చేయడం. తరువాత ఆయన్ను దేశం నుంచి బహిష్కరించారు. జైలులో ఉన్నప్పుడు ఫైజ్ ఆహ్మద్ ఫైజ్‌కు సంకెళ్ళు వేసి గుర్రపు బండీలో దంత వైద్యుడిదగ్గరకు తీసుకెళుతున్నారు. ఆయన్ని గమనించిన ప్రజలు ఆ గుర్రపు బండి వెంట నడిచారు. ఈ సంఘటనకు స్పందించిన ఫైజ్ ‘ఆజ్ బాజార్ మెన్ పాబాజవులాన్ చలో’ (సంకెళ్ళతో బజారుగుండా నడుచుకుంటూ వెళదాం) అన్న గజల్‌ను రాశాడు. దుఃఖ్ఖాతీతమైన తిరుగుబాటును ప్రబోధించే ఈ కవిత దక్షిణాసియాలోని తిరుగుబాటు దారులందరికీ చైతన్య గీతమైంది.

‘ఫర్ ఇన్ యువర్ టంగ్, ఐ కెనాట్ ఫిట్ : ఎన్‌కౌంటర్స్ విత్ ప్రిజన్’ అన్న శీర్షికన వచ్చిన ఈ కవితా సంకలనంలో ఈ ఫైజ్ కవితను కూడా చేర్చారు. కళాకారిణి శిల్పాగుప్త, కవి, పాత్రికేయుడు శలీల్ త్రిపాటి సంపాదకత్వంలో ఈ సంకలనం రూపుదిద్దుకుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం దిగజారే వాతావరణ లక్షణాలు కనిపిస్తున్న సమయంలో, వాటికి స్పందనగా 2017లో శిల్పాగుప్త, శలీల్ త్రిపాటి ప్రసిద్ధమైన ఈ కవితావతారానికి తెరతీశారు.

“రచయితలు, ఆలోచనాపరులు, చైతన్య వంతులు హత్యలకు గురవుతున్నారు. తొలుత నరేంద్ర ధబోల్కర్, తరువాత గోవింద్ పన్సారి, అతని భార్య ఉమలను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆ తరువాత రచయిత, హేతువాది ఎం.ఎం.కల్బుర్గీని హత్యచేశారు. గౌరీ లంకేష్‌ను బెంగుళూరులోని ఆమె ఇంటి బయటే కాల్చి చంపారు. కవులు, రచయితలను ఇలా చంపడం ఒక్క భారత దేశానికి పరిమితం కాదు. బంగ్లాదేశ్‌లో లౌకిక వాదులను, రచయితలను ఇస్లామిక్ వాదులుగా భావించేవారు నరికి చంపారు. పాకిస్థాన్‌లో బెలూచి కవి రెహమతుల్లా షోహాజ్‌ను అతని స్వగ్రామం బులెడ సమీపంలోనే 2015 జులై 21వ తేదీన కాల్చి చంపారు. చైనాకు చెందిన లియుగ్జియోబు 2009 నుంచి జైల్లో ఉన్నాడు. అతనికి 2010లో వచ్చిన నోబెల్ బహుమతిని స్వీకరించకుండా అడ్డుకున్నారు. అనారోగ్య కారణాలతో పెరోల్‌పై విడుదలైన ఆయన 2017లో క్యాన్సర్‌కు బలయ్యాడు.

‘కవిత్వం ఏమీ చేయలేదు. అది కొనసాగుతుంది. తనను తాను నిర్మించుకోవడంలో నిమగ్నమై ఉంటుంది’ అని డబ్ల్యు హెచ్ ఎయుడెన్ తన కవితలోఅంటాడు. నియంతృత్వ ప్రభుత్వాలు మరోలా ఆలోచిస్తాయి. నిరంతర హెచ్చరికగా కవులను, రచయితలను జైల్లో పెడుతుంటాయి. ‘కెమరోన్, క్యుబా, చైనా, భారత్, ఇరాన్, కజకిస్థాన్, మయన్మార్, సౌదీ అరేబియా, టర్కీ, ఉగాండా, వియత్నాం వంటి అనేక దేశాలలో ఇటీవల కవులను జైళ్ళలో పెట్టారు.’ అని త్రిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపాటి జైళ్ళలో ఉండే రచయితల కమిటీకి ఇటీవల వరకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ‘ద పొయట్స్ వర్క్’ అన్నతన వ్యాసంలో పై విషయం పేర్కొన్నారు.

రష్యా కూడా ఈ జాబితాలో చేరింది. యుక్రైన్‌యుద్ధాన్ని అవహేళన చేస్తూ, ఒక కవితను చదువుతూ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఆర్టియన్ కమరడిన్‌ను, అతని స్నేహితురాలు అలెగ్జాండర్‌పొపొవ ఇంటి తలుపులు పగుల గొట్టిన సాయుధులైన పోలీసులు కమరడిన్‌ను తీవ్రంగా కొట్టారు. అతని స్నేహితురాలిని సామూహిక అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈమేరకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు ఫిర్యాదు అందింది. అతను కవిత చదివినందుకు క్షమాపణలు చెపుతూ వీడియో పోస్టు చేయమని పోలీసులు ఒత్తిడి చేయడమే కాకుండా గుర్తించలేని ప్రాంతానికి అతన్ని తరలించారు. సోవియట్ యూనియన్ కాలంలో కూడా కవులు, రచయితలు అదృశ్యమయ్యారు.

జైళ్ళలో ఉన్న కవుల రచనలను ఒక దగ్గర సంకలనం చేయడం చరిత్రాత్మకమైంది ‘ఎనిమిదవ శతాబ్దం నాటి నుంచి రాసిన కవితలు ఇందులో చేర్చాం. ఇప్పటికీ జైళ్ళలో ను, రహస్యంగాను ఉన్న కవుల రచనలు ఇందులో చేర్చాం’ అని సంపాదకులు ముందు మాటలో చెప్పారు. పదహారవ శతాబ్దంలో క్యాథలిక్ విచారణ అనంతరం సజీవ దహనమైన ఇటలీకి చెందిన జార్డినో బ్రూనో రాసిన కవిత కూడా ఇందులో ఉంది.

స్త్రీ, పురుషుల మధ్య ఉన్న లైంగికతను వర్ణిస్తూ 1950లో ‘హౌల్’ అన్న కవితను రాసినందుకు అమెరికాకు చెందిన అలెన్ గిన్స్‌బర్గ్ పైన, బెంగాల్‌కు చెదిన మలె రాయ్ చౌదరి 1960లో ‘స్టార్క్ ఎలక్ట్రిక్ జీసెస్’ అన్న కవిత రాసినందుకు ఆశ్లీలత కింద కేసులు పెట్టారు. వీరి కవితలను కూడా ఈ సంకలనంలో చేర్చారు. గిన్స్ బర్గ్ భారత దేశంలో పర్యటించిన సందర్భంలో రాయ్ చౌదరిని కలిశాడు.

పాకిస్థాన్‌కు చెందిన హబిబ్ జలిబ్‌ను, మన దేశానికి చెందిన మజ్రూహ్ సుల్తాన్‌పురిని కూడా ఆయా ప్రభుత్వాలు జైళ్ళలో పెట్టాయి. స్వాతంత్య్రోద్యమ సమయంలో విప్లవ కార్యమ్రాలలో పాలుపంచుకున్నాడని కవి రావ్‌ు ప్రసాద్ బిస్మిల్ ను బ్రిటిష్ ప్రభుత్వం 1927 డిసెంబర్ 19ను ఉరితీసింది. బెంగాల్‌కు చెందిన విప్లవ కవి కజిల్‌నజ్రుల్ ఇస్లాంను బ్రిటిష్ ప్రభుత్వం చాలా సంవత్సరాలు జైల్లో పెట్టింది. వీరి కవితలు కూడా ఇందులో చేర్చారు.
ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఉర్దూలో రాసిన ‘బోల్’ అన్న కవితను వి.జి. కిరనన్ ఇంగ్లీషులోకి అనువాదం చేసిన ‘స్పీక్’ అన్న కవితను ఇందులో చేర్చారు.

“మాట్లాడు, నీ పెదాలు స్వేచ్ఛగా ఉన్నాయి
మాట్లాడు, నీ నాలుక నీదే
నిటారుగా ఉన్న నీ శరీరం నీదే
మాట్లాడు, నీ జీవితం ఇప్పటికీ నీదే”
బీమా కోరెగాన్ కేసులో 2018లో అరెసె్టైన వరవరరావు కవిత, కార్తీక్ నాయర్ రాసిన ‘హ్యాండ్ బుక్ ఫర్ అస్పైరింగ్ అటోక్రాట్’ అన్న కవిత ఇందులో ఉన్నాయి. నవలాకారుడు నిలంజన ఎస్.రాయ్, రాజ్యాంగ న్యాయవాది గౌతం భాటియా, జైలుపాలైన దేవనగనకలిత, నటాష్ నర్‌వాల్‌ల వ్యాసాలు కూడా ఇందులో చేర్చారు. ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లను ప్రోత్సహించాడన్న ఆరోపణపై జైల్లో పెట్టిన ఉమర్ ఖలీద్ రాసిన వ్యాసం కూడా ఇందులో ఉంది. జైల్లో ఉన్న కవులకు పరిమితమైన స్వేచ్ఛ విషయంలో, కవిత్వం రాయడంలో పరిమితులుంటాయి.

‘జైలు రచనల్లో సాధారణ విషయలతోపాటు, పునరావృతమైనవి, అంతర్గతమైన లక్షణాలుంటాయి’ అని సాహిత్య పండితుడు డోరన్ లార్‌సన్ ‘జైలు కవిత్వం వైపు(2010) అన్న వ్యాసంలో పేర్కొంటాడు. యాత్రా సాహిత్యం, యుద్ధ రచనలు, జైలు రచనలు కూడా ఇతరులతో పంచుకునే వైయుక్తిక అనుభవాల కళాప్రక్రియలే. నియంతృత్వ పాలనలో కవులు, రచయితలను జైళ్ళలో పెట్టడం కొనసాగినంత కాలం ఈ సాహిత్యం వస్తూనే ఉంటుంది.

జైలు భాషలో ‘గాలిపటాలు’ రాస్తున్న బ్లాక్ పాంథర్ కవయిత్రి ఎరికా హుగ్గిన్స్ రాసే రచనలను ఇతర ఖైదీలకు పంపే సందేశంగా భావించిన జైలు అధికారులు తరచూ ఆ రచనలను స్వాధీనం చేసుకునేవారని అమి వాష్‌బర్న్ ‘పెన్ ఆఫ్‌ద పాంథర్’(చిరుత కలం) అన్న తన వ్యాసంలో రాశారు. జైలులో ఉండే కవులు రాసిన గీతాలు జైలు గోడలకతీతంగా బైట ప్రపంచానికి నిర్బంధం లేని ఆకాశాలలో గాలిపటాల్లా ఎగురుతాయి.

‘నీ గొంతులో నేను ఇమడలేను’
ఉత్తరం దాస్ గుప్త,
ఓ.పి. జిందాల్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు
అనువాదం : రాఘవ శర్మ, ‘ద వైర్’ సౌజన్యంతో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News