Saturday, April 27, 2024

మీ హక్కులను దుర్వినియోగం చేశారు

- Advertisement -
- Advertisement -

సనాతన ధర్మంపై మీ వ్యాఖ్యల పర్యవసానం తెలియదా

మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా వ్యవహరిస్తారా?
ఉదయనిధి స్టాలిన్‌ను తప్పుపట్టిన సుప్పీంకోర్టు

న్యూఢిల్లీ: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు మం త్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. భావ ప్రకటనా స్వేచ్ఛను, వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేసిన తర్వాత మళ్లీ సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఆయనను ప్రశ్నించింది. మీరొక మంత్రి..మీ వ్యాఖ్యల పర్యవసానాలు మీకు తెలియదా అని ఉదయనిధిని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కలిపి ఒకే చోట విచారించాలని కోరుతూ ఉదయనిధి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ మీరు(ఉదయనిధి) మీ హక్కులను దుర్వినియోగం చేశారు. మీరు ఏం మాట్లాడారో మీకు తెలుసు. వాటి పర్యవసానాలను కూడా మీరు గ్రహించి ఉండాలి. .మీరు ఒక మంత్రిగా ఉన్నారు. సామాన్య వ్యక్తి కాదు అని పేర్కొన్నారు. ఉదయనిధి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదన వినిపిస్తూ వివిధచోట్ల నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కలిపి విచారణ చేయాలని కోరుతూ అర్నబ్ గోస్వామి, మొహమ్మద్ జుబేర్, తదితరుల కేసులను ఉటంకించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ తమ వద్దకు కాకుండా హైకోర్టుకు వెళ్లి ఉండాల్సిందని సూచించింది. తాము అనేక కోర్టులలో పిటిషన్లు వేయవలసి ఉంటుందని, ఇది తమను ప్రయాసతో కూడిన పని అని సింఘ్వి చెప్పారు. ఇది విచారణ కన్నా ముందుగానే వేధింపుల వంటిదని ఆయన చెప్పారు. ఈ కేసుపై వచ్చేవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ 2023 సెప్టెంబర్‌లో సనాతన ధర్మాంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కుల వ్యవస్థ, వివక్షతపై ఆధారపడిన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన పిలుపునివ్వడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ అనేక చోట్ల ఆయనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News