కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బాండ్ పేపర్లు రాసి ఎన్నికల్లో గెలిచిన భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. శుక్రవారం కెటిఆర్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మిట్టపల్లిలో రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఉన్న స్కీంలను ఎత్తివేసిన ప్రభుత్వం కొత్త స్కీంలను ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కెసిఆర్ కిట్టు, రైతుబంధు, రుణమాపీ, పెన్షన్ల పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయన్నారు. మార్పు కోసం తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాలన్నారు.
రేవంత్ రెడ్డి లాంటి దివలాకోరు ముఖ్యమంత్రి మరొకరు లేరని కెటిఆర్ ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తమను ఓ దొంగాల చూస్తున్నారని చెప్పడం సిగ్గుచేటని అన్నారు.ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్నందుకు ఈ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిందేనని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు దిమ్మతిరిగే షాక్ ఇవాలని కోరారు. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేకత చాటాలని చెప్పారు. భద్రాచలంలో ఎమ్మెల్యే ఎన్నికకు ఉప ఎన్నిక తప్పదని.. బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని కెటిఆర్ పిలపునిచ్చారు.