Thursday, April 18, 2024

కల్వకుంట్ల కన్నారావుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మన్నెగూడ భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలోని రెండు ఎకరాల భూ వివాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావును ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పి అనే వెంచర్లో మన్నెగూడలో సర్వే నంబర్ 32లో సుమారు రెండు ఎకరాల భూమి ఉంది. కాగా గత నెలలో తమకు చెందిన ఈ భూమిని కన్నారావు కబ్జాకి యత్నించారని, అడ్డువస్తే తనని తన కుటుంబాన్ని చంపేస్తానని బెదరించినట్లు బాధితుడు బండోజు శ్రీనివాస్ ఆదిభట్ల పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనా కూడా మళ్లీ కబ్జాకి యత్నించారని గత నెల 3న మరో ఫిర్యాదు చేశారు.

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం ఓఎస్‌ఆర్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ భూమిలో కంటైనర్‌లో నివసిస్తున్న సమయంలో, కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్, శివ, డానియెల్ సహా మరికొందరు వారిని బెదిరించారని, జెసిబితో భూమి కబ్జా చేయడానికి వచ్చారని తమకు ఫిర్యాదు చేశారన్నారు. వీరిపై మరో ఫిర్యాదు రావడంతో, మరో కేసు నమోదు చేసి, మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చినట్లుగా తెలిపారు. వీరిలో కన్నారావు పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కన్నారావుపై 147, 148, 447, 427, 307, 436, 506, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఈ కేసులో 9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కన్నారావు విదేశాల్లో ఉన్నట్లు తెలుసుకుని లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

అయితే కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు ప్రయత్నించగా కోర్టు తిరస్కరించింది. కాగా మంగళవారం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ‘తన భూమిని కబ్జా చేయడానికి యత్నించారని బండోజు శ్రీనివాస్ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదైనా కూడా మళ్లీ కబ్జాకి యత్నించారని, గత నెల 3న మరో ఫిర్యాదు చేశారు. ఇందులో కల్వకుంట్ల కన్నారావు, జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్, శివ, డానియెల్ సహా మరికొందరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించాము. ఈకేసులో ఇప్పటివరకు 9మందిని అరెస్టు చేశాము. కన్నారావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామ’ని ఆదిభట్ల సిఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News