Thursday, May 2, 2024

పరుగుల రారాజు రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

Rohit Sharma

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కెరీర్‌లో 2019 సంవత్సరం తీపి జ్ఞాపకంగా మిగిలి పోవడం ఖాయం. ఈ ఏడాది రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. ఓపెనర్‌గా టెస్టుల్లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన హిట్‌మ్యాన్ రోహిత్ ప్రపంచ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో అసాధారణ బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించాడు. వన్డేల్లో, టెస్టుల్లో ఈ ఏడాది రోహిత్ శర్మ చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఎన్నో రికార్డులను రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ అసాధారణ రీతిలో రాణించాడు. అతని దెబ్బకు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వరల్డ్‌కప్‌లో రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర పేరిట ఉన్న నాలుగు శతకాల రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. అంతేగాక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ సరసన నిలిచాడు. సచిన్ కూడా ప్రపంచకప్‌లో ఆరు సెంచరీలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా రోహిత్ కూడా ఈ రికార్డును అందుకున్నాడు. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ నిలిచాడు. వరల్డ్‌కప్‌లో మొత్తం 9 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ ఐదు శతకాలు, మరో అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

ఈ క్రమంలో 81 సగటుతో 648 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ మొత్తం 28 వన్డేలు ఆడాడు. ఇందులో 1490 పరుగులు సాధించాడు. 57.30 సగటుతో రోహిత్ ఈ పరుగులు సాధించడం విశేషం. ఇక, రోహిత్ ఈ ఏడాది వన్డేల్లో ఏడు శతకాలు, ఆరు అర్ధ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనర్‌గా కూడా రోహిత్ శర్మ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును రోహిత్ తిరగ రాశాడు. 2019లో రోహిత్ ఓపెనర్‌గా 2388 పరుగులు సాధించి జయసూర్య రికార్డును చెరిపేశాడు.

టెస్టుల్లోనూ జోరు..
ఇక, టెస్టుల్లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ ఇందులో కూడా అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. విశాఖ పట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ చారిత్రక ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లోనే తనదైన ముద్ర వేశాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ రోహిత్ శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176, రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లోనే రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇక, రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో కూడా రోహిత్ శర్మ చెలరేగి పోయాడు. ఈసారి ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. సఫారీ బౌలర్లను హడలెత్తించిన రోహిత్ 212 పరుగులు సాధించాడు. మొత్తం మీద రోహిత్ ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కలిపి రికార్డు స్థాయిలో 2442 పరుగులు సాధించాడు. అంతేగాక ఈ సంవత్సరం ఏకంగా 78 సిక్సర్లు బాది కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

రికార్డులే..రికార్డులు
మరోవైపు ఈ దశాబ్దంలోనే రోహిత్ శర్మ ఎన్నో కళ్లు చెదిరే రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా కూడా రోహిత్ నిలిచాడు. 2014లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు సాధించాడు. ఇది ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది. ఇక, 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఇక, 2017లో శ్రీలంకపై మరోసారి డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఇలా మూడు సార్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.

2019 is best year in Rohit Sharma career
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News