Monday, April 29, 2024

సిరీస్ ఎవరికీ దక్కేనో?

- Advertisement -
- Advertisement -

India vs Australia

 

సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు బెంగళూరులో చివరి వన్డే

బెంగళూరు: సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో వన్డే కోసం ఇటు టీమిండియా, అటు ఆస్ట్రేలియా జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇరు జట్లు చెరో విజయంతో సిరీస్‌లో సమంగా నిలిచాయి. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతుంది. దీంతో రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా పోరుకు సిద్ధమయ్యాయి. బలబలాల్లో టీమిండియా, ఆస్ట్రేలియాలు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఈ విషయం స్పష్టమైంది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించగా, రెండో వన్డేలో టీమిండియా గెలిచి లెక్కను సరి చేసింది.

దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. కాగా, కీలక ఆటగాళ్ల గాయాలు టీమిండియాను కలవరానికి గురిచేస్తున్నాయి. రెండో వన్డే సందర్భంగా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు గాయాలకు గురయ్యారు. దీంతో ఆదివారం మ్యాచ్ నాటికి వీరిద్దరూ పూర్తిగా కోలుకుంటారా లేదా అనేది ఇంకా తేలలేదు. అయితే జట్టు యాజమాన్యం మాత్రం వీరిద్దరూ బరిలోకి దిగుతారనే నమ్మకంతో ఉంది. ఇదే జరిగితే లోకేశ్ రాహుల్‌తో జతగా ఎవరూ ఓపెనర్‌గా బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా తయారైంది.

రాహుల్‌పైనే ఆశలు
సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న స్టార్ ఆటగాడు లోకేశ్ రాహుల్‌పై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో రాహుల్ కీలక సమయంలో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా జట్టు అతని నుంచి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రాహుల్‌కు ఉంది. అతను విజృంభిస్తే మాత్రం టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

ఆ ఇద్దరూ డౌటే?
మరోవైపు రెండో వన్డేలో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఆఖరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారా లేదా అనేది ఇంకా తేలలేదు. కిందటి మ్యాచ్‌లో వీరిద్దరూ గాయాలకు గురైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వీరు చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగడంపై సందిగ్ధం నెలకొంది. అసాధారణ ఆటగాడిగా పేరున్న రోహిత్ సేవలు కోల్పోతే మాత్రం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా రోహిత్‌కు ఉంది.

అతను విజృంభిస్తే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇక కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ అందుబాటులో లేకపోతే మాత్రం భారత్ కష్టాలు రెట్టింపు కావడం తథ్యం. అంతేగాక ధావన్ కూడా సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. కిందటి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఒకవేళ చివరి మ్యాచ్‌లో ధావన్ బరిలోకి దిగకపోతే జట్టుకు సమస్యలు తప్పక పోవచ్చు.

కోహ్లిపైనే భారం
సీనియర్ ఆటగాళ్లు చివరి వన్డే ఆడడంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతలు మరింత పెరగడం ఖాయం. ఒకవేళ ధావన్, రోహిత్ అందుబాటులో లేక పోతే మాత్రం జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కోహ్లిపైనే ఉంటుంది. అతను బ్యాటింగ్ భారాన్ని తనపైనే వేసుకోక తప్పదు. అదే జరిగితే కోహ్లిపై ఒత్తిడి నెలకొనడం తథ్యం. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా కోహ్లి సొంతం. దీంతో అతన్ని తక్కువ అంచన వేయడం తగదు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. కిందటి మ్యాచ్‌లో కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు.

నిరాశ పరుస్తున్న అయ్యర్
ఇదిలావుండగా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. అంతకుముందు వెస్టిండీస్, శ్రీలంకలతో జరిగిన సిరీస్‌లలో కూడా అంతంత మాత్రంగానే రాణించాడు. ఆస్ట్రేలియాతో ఆడిన రెండు వన్డేల్లోనూ ఘోరంగా విఫమయ్యాడు. తుది జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం అయ్యర్‌కు పెద్ద ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముంది.

ఇప్పటికైనా బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువక తప్పదు. లేకుంటే రానున్న రోజుల్లో జట్టులో చోటును నిలబెట్టుకోవడం కష్టమనే చెప్పాలి. మరోవైపు మనీష్ పాండే కూడా కిందటి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పాండే ఘోరంగా విఫలమయ్యాడనే చెప్పాలి. ఇప్పటికే అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అయినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాడు. తీరు మారక పోతే రానున్న సిరీస్‌లలో జట్టుకు ఎంపిక కావడం దాదాపు అసాధ్యంగానే చెప్పాలి.

బౌలర్లు గాడిలో పడాల్సిందే
ఇక, ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా టీమిండియాకు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో బౌలర్లు బాగానే రాణించినా భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. బుమ్రా వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమి కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నాడు. కిందటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇటు షమి, అటు బుమ్రాలు మెరుగ్గా రాణించాల్సిన అవసరం జట్టుకు నెలకొంది. అంతేగాక యువ బౌలర్లు నవ్‌దీప్ సైని, శార్ధూల్ ఠాకూర్‌లు కూడా మెరుగైన ప్రదర్శన చేయక తప్పదు. స్పిన్నర్లు కుల్దీప్, జడేజాలు కూడా మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాలి. అప్పుడే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే అవకాశం భారత్‌కు ఉంటుంది.

గెలుపే లక్ష్యంగా
కాగా, పర్యాటక ఆస్ట్రేలియా జట్టు చివరి మ్యాచ్‌లో గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. కిందటి మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా వీరికి ఉందనే చెప్పాలి. దీనికి తొలి మ్యాచ్ ఫలితమే నిదర్శనం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు.

అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్మిత్, లబూషేన్, అస్టన్, అలెక్స్ కారీ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, జంపా, అగర్ వంటి మ్యాచ్ విన్నర్లు కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా కనిపిస్తున్నారు. రెండు విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న ఆస్ట్రేలియాను ఓడించడం ఆతిథ్య భారత్‌కు అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో చివరి మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం తథ్యం.

3rd odi between India vs Australia
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News