రాజస్థాన్ మంత్రి ఆరోపణ
న్యూఢిల్లీ: దేశంలో నిజాయితీపరులైన తహసిల్దార్లు ఎవరూ లేరని, ఒకవేళ ఉన్నా వారు కూడా 2 శాతం ముడుపులు పుచ్చుకుంటారని రాజస్థాన్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తహసిల్దార్లు, నయీబ్ తహసిల్దార్లు, పట్వారీలు 2 శాతం ముడుపులు పుచ్చుకోవడం ఆనవాయితీగా ఉందని రాజస్థాన్ పరిశ్రమల శాఖ మంత్రి పర్సది లాల్ మీనా ఆరోపించారు.
మంగళవారం బుండిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఒక్క నిజాయితీపరుడైన తహసిల్దారును కనుగొనలేమని ఆరోపించారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా ఉన్నానని, అనేక మంది తహసిల్దార్లను నియమించానని, 2 శాతం ముడుపులు పుచ్చుకోవడం వారికి అలవాటేనని ఆయన చెప్పారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్న ప్రీతమ్ కుమారి మీనా అనే తహసిల్దార్ గురించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు సత్యేష్ శర్మ ప్రస్తావించినపుడు మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు.