Thursday, May 2, 2024

ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 14 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. రూ.100 ఆలస్యం రుసుంతో డిసెంబర్ 6 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు.

అలాగే రూ.వెయ్యి అపరాధ రుసుంతో వచ్చే నెల 17 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో వచ్చే నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు రూ.500, ఒకేషనల్ కోర్సులకు రూ.710 ఫీజు చెల్లించాలి. అలాగే ఇంటర్ రెండవ సంవత్సరం ఆర్ట్ విద్యార్థులకు రూ.500, సైన్స్ విద్యార్థులకు రూ.710, ఒకేషనల్ విద్యార్థులకు రూ.710 ఫీజు చెల్లించాలి.

ప్రైవేట్ విద్యార్థులకు హాజరు మినహాయింపు సదుపాయం

ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు హాజరుకానున్న ప్రైవేటు ఆర్ట్ విద్యార్థులకు హాజరు మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. హాజరు మినహాయింపు కోరుకునే అభ్యర్థులు ఈ నెల 30లోగా రూ. 500 ఫీజు చెల్లించాలని బోర్డు పేర్కొంది. రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకున్నా, వివరాలు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు. విద్యార్థులు www.bie.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది.

పోస్టు ద్వారా, నేరుగా సమర్పించే దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమని బోర్డు స్పష్టం చేసింది. 10వ తరగతి పాస్ సర్టిఫికెట్, ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి చదివిన వారు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. పదో తరగతి పూర్తయి ఏడాది గడిచిన అభ్యర్థులు నేరుగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరు కావచ్చు. రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయవచ్చు. ఇంటర్ బైపిసి ఉత్తీర్ణుత సాధించి, మేథమేటిక్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా రాయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News