Tuesday, April 30, 2024

స్టార్టప్‌ల అడ్డా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారతీయ పారిశ్రామికవేత్తల ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు స్పష్టం చేశారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అవసరమైన సంపూర్ణ, సహకారాలను అందిస్తామన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆర్థిక విలువను సృష్టిస్తారన్నారు. అలాంటి వారిని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన విధి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నర ఏళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించిందన్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తెలంగాణ గమ్యస్థానమన్నారు. ప్రయివేట్ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపిన స్టార్టప్ టి.. హబ్ కి చెందినదేనన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్‌లకు హైదరాబాద్ సొంతగడ్డగా మారిందన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థాపక శిఖరాగ్ర సదస్సు అయిన టై (టిఐఇ) గ్లోబల్ సమ్మిట్ సదస్సు నగరంలోని హైటెక్స్‌లో సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌ను సోమవారం మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధానంగా ప్రపంచ వ్యవస్థాపక అభివృద్ధిపై చర్చిస్తారు. దేశ, విదేశాలకు చెందిన సుమారు 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 150 మంది అంతర్జాతీయ స్పీకర్లు, 200కు పైగా పెట్టుబడుదారులు పాల్గొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, స్టార్టప్‌లను ప్రొత్సహించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉందన్నారు. దీని కారణంగానే రాష్ట్రానికి అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇందులో ఇప్పటికే అనేక విదేశీ సంస్థలకు చెందిన కంపెనీలు తమ రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్‌గా ఎంచుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోందన్నారు.

రాష్ట్రంలో ఐటి, పారిశ్రామిక రంగాన్నికి చేయూత నివ్వడంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎవరు సాటిలేరన్నారు. తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌తో నిమగ్నమవ్వడంలో టై చురుకైన పాత్ర పోషించిందన్నారు. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది ఆవిష్కరణకు అత్యంత కీలకమైనదన్నారు. వాటాదారులు, కమ్యూనిటీ సభ్యులను వివరించడానికి దోహదపడుకుందన్నారు. సుమారు ముప్పై సంవత్సరాల కింద ఏర్పడ్డ టై సంస్థ దినదినాభివృద్ధి చెందుతుండడం గర్వకారణమన్నారు. ప్రధానంగా విద్య, సాంకేతికత, ఉత్పత్తి మద్దతు, ప్రపంచ విస్తరణ, వ్యాపార నెట్‌వర్క్, ఫైనాన్సింగ్ మూలాలు, మార్కెట్‌లు, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులకు తగు సహకారాలను అందించడంలో టై పాత్ర అనిర్వచమైనదన్నారు. ప్రపంచంలోని దేశాల పోటీతత్వ ప్రయోజనాన్ని సృష్టించగల సమ్మిళిత వృద్ధిని నడిపించడం ద్వారా ఆవిష్కరణ అనేది ఒక కీలకమైన సాధనమని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

ఐటి రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లకు పెద్దఎత్తున ప్రొత్సాహం అందిస్తున్నదని కెటిఆర్ వెల్లడించారు. ముఖ్యంగా రాష్ట్ర విధానాలు ఇన్నోవేషన్ నెట్‌వర్క్, టి…హబ్, టి..వర్క్, వి…హబ్, టిస్క్ (టిఎస్‌ఐసి), రిచ్, టాస్క్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఇమేజ్, నిస్కాంలను నిర్మించినందుకు గర్విస్తున్నామన్నారు. టి.హబ్ 2తో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ స్పేస్‌ను ప్రారంభించామన్నారు. ఇక టి..హబ్ తన ఏడు సంవత్సరాల ప్రయాణంలో 1100 మంది వ్యవస్థాపకులకు మద్దతునిచ్చిందని వివరించారు. రాష్ట్రంలో బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంలో తెలంగాణను ‘అత్యున్నత పనితీరు’గా డిపిఐఐటి గుర్తించిందన్నారు. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికలో పనితీరులో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో 6500లకు పైగా స్టార్టప్‌లు ఉన్నాయని కెటిఆర్ వివరించారు.
టి-హబ్‌తో అద్భుతాలు
ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి స్పేస్ స్టార్టప్- స్కైరూట్ టి. హబ్‌లో ఇంక్యుబేట్ చేయబడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి. హబ్‌లో సభ్యులైన యువత తమ ప్రతిభతో ప్రస్తుతం అద్భుతాలు సృష్టిస్తోందని కెటిఆర్ కొనియాడారు. ఇటీవల విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు రాష్ట్ర ఘన కీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయన్నారు. స్కైరూట్ ఏరో స్పేస్ ప్రయివేట్ లిమిటెడ్‌” అనే అంకుర సంస్థ దేశంలో మొట్టమొదటిసారి రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రయివేట్ రాకెట్ “ విక్రమ్ – ఎస్‌” ప్రయోగం విజయవంతమైందన్నారు. ఈ కార్యక్రమంలో అడోబ్ సిస్టమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్, గ్రీన్కో గ్రూపు ఎండి, సిఇఒ అనిల్ కుమార్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరి జయేష్ రంజన్, టై ప్రెసిడెంట్ , కో-చైర్ సురేష్ రాజు, టై గ్లోబల్ వైస్ చైర్మన్ మురళి బుక్కపట్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News